ఇందూరుపై దండయాత్ర
eenadu telugu news
Updated : 21/10/2021 06:24 IST

ఇందూరుపై దండయాత్ర

కోతులు.. కుక్కలు.. దోమల బెడదతో నగరవాసుల యాతన

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

నగర వాసులపై కోతులు.. కుక్కలు.. దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఇంట్లో ఉంటే దోమల రోత.. బయటకు వెళ్తే వానరాలు.. శునకాల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. వీటిని నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీనం సాగిస్తున్నారు.    

పిక్కలు జాగ్రత్త

నిజామాబాద్‌ నగరంలో కుక్కల బెడద తీవ్రమైంది.   ఏ కాలనీలో చూసినా గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. రాత్రివేళ అరుపులతో నిద్ర భంగం వాటిల్లుతోంది. నగరవ్యాప్తంగా సుమారు 10 వేల శునకాలు ఉన్నట్లు బల్దియా అధికారులు అంచనా వేశారు. గతంలో సమస్య తీవ్రంగా ఉండటంతో రంగంలోకి దిగిన అధికారులు వాటిని   పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలేశారు. సమస్య అలాగే ఉండటంతో మగ   కుక్కలను పట్టుకొని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని పాత మున్సిపల్‌ అతిథి గృహంలో వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గడిచిన ఆర్నెల్లల్లో 4 వేల కు.ని. ఆపరేషన్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వీటి జనాభా మాత్రం తగ్గడం లేదు.

దోమల మోత
నగరంలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. శివారు ప్రాంతాలైన గాయత్రినగర్‌, సాయినగర్‌, చంద్రనగర్‌, ఇంద్రాపూర్‌, నిజాం కాలనీ, మాలపల్లి, శాంతినగర్‌, వినాయక్‌నగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, దుబ్బ తదితర చోట్ల ఖాళీ స్థలాల్లో మురుగు కుంటలు దర్శనమిస్తున్నాయి. ఇవి దోమలకు ఆవాస కేంద్రాలుగా మారుతున్నాయి.
* వీటి నివారణకు బల్దియా అధికారులు పది ఫాగింగ్‌ యంత్రాలు కొనుగోలు చేశారు. ఒక్కోదానికి రూ.30 వేల వరకు వెచ్చించారు. పాత యంత్రాలు ఐదు ప్రస్తుతం మరమ్మతులో ఉన్నాయి. 60 డివిజన్లు.. 70 కాలనీలు ఉండగా ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. వీటితో అప్పుడప్పుడు ఫాగింగ్‌ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.

వామ్మో వానరాలు
ఇటీవలి కాలంలో కోతులు అడవుల్లో కంటే నగరంలోనే ఎక్కువ తిరుగుతున్నాయి. మొన్న అశోక్‌ వీధిలో ఓ మహిళపై కోతి దాడి చేసింది. ప్రగతినగర్‌, సరస్వతి నగర్‌, ద్వారకానగర్‌, కోటగల్లీ, జెండాగల్లీ, పద్మానగర్‌, వినాయక్‌నగర్‌, హౌసింగ్‌ బోర్డు, గంగాస్థాన్‌, కంఠేశ్వర్‌, చంద్రశేఖర్‌ కాలనీలో వానరాల బెడద తీవ్రంగా ఉంది. కోటగల్లీ, జెండాగల్లీలో ఇళ్లపై పెంకులు తీసి గుల్ల చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి వండిన పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. వీటిని చూసి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
* వీటి సమస్య పరిష్కారానికి అటవీ శాఖ, నగరపాలక సంస్థ సమన్వయంతో పని చేయాలి. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
* కోతుల దాడిలో గాయపడ్డ ఘటనలపై అధికారికంగా లెక్కలు తీయడం లేదు.


పిల్లలను బయటకు పంపడం లేదు
- పుష్పలత, పద్మానగర్‌

మా కాలనీలో కోతులు ఎక్కువ. ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్తున్నాయి. చిన్న పిల్లలను బయటకు పంపడం లేదు. గుంపులు గుంపులుగా వచ్చి దాడిచేస్తున్నాయి.


ఎటు నుంచి వస్తాయో తెలియదు
- వివేకానంద, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్‌

వీధిలో కుక్కలు ఎటునుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. రాత్రి వేళ బయటకు వెళ్లాంటేనే భయంగా ఉంది. అధికారులు స్పందించి నివారణపై దృష్టి సారించాలి.


నివారణపై దృష్టి సారిస్తాం
- శ్రీనివాస్‌, ప్రజారోగ్య అధికారి, నగర పాలక సంస్థ

కోతుల బెడద ఇటీవల పెరిగిన మాట వాస్తవమే. అటవీ శాఖ అధికారులతో కలిసి నివారణకు చర్యలు చేపడతాం. కుక్కల నియంత్రణ కోసం వాటిని పట్టుకొని కు.ని. శస్త్రచికిత్సలు చేస్తున్నాం. దోమల కట్టడికి అవసరమైన చోట ఫాగింగ్‌ చేస్తున్నాం. పారిశుద్ధ్య పర్యవేక్షకుల దృష్టికి సమస్య తీసుకెళ్తే పరిష్కరిస్తారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని