చిక్కరు.. దొరకరు
eenadu telugu news
Published : 21/10/2021 05:58 IST

చిక్కరు.. దొరకరు

జిల్లాలో దోపిడీ ముఠాల అలజడి

వరుసగా ఏటీఎంలు, ఇళ్లు, గొలుసు చోరీలు
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

ఇందల్‌వాయిల్‌ చోరీకి గురైన ఏటీఎంను పరిశీలిస్తున్న పోలీసులు (పాతచిత్రం)

ఇందల్‌వాయి ఏటీఎం చోరీ ఘటనను పరిశీలించిన పోలీసులు ఓ ముఠా దోపిడీకి పాల్పడిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, యూపీ, బిహార్‌, హరియాణాకు చెందిన ముఠాలు ఇందూరులో అలజడి సృష్టిస్తున్నాయి. ఏటీఎంలు, ఇళ్లు కొల్లగొడుతున్నా అక్కడి ముఠాలను ఏళ్లతరబడిగా పట్టుకోలేని పరిస్థితి.
లారీల్లో వస్తూ..
44వ నంబరు జాతీయ రహదారి కామారెడ్డి జిల్లా భిక్కనూరు నుంచి నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ వరకు దాదాపు 100 కి.మీ విస్తరించి ఉంది. ఈ మార్గం మీదుగా నిత్యం వేలల్లో లారీలు, ట్రక్కులు రాకపోకలు సాగిస్తుంటాయి. చోరీలకు అలవాటుపడిన పలు ముఠాలు ఈ వాహనాల్లో ప్రయాణించి రహదారి వెంబడి ఉండే ఇళ్లు, ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నాయి.
మారుమూల గ్రామాల వారు..
జిల్లా మీదుగా మహారాష్ట్రకు రోజుకు ఆరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిల్లోనూ మహారాష్ట్ర ముఠాలు నగరంలోకి వచ్చి దొంగతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆ రాష్ట్రానికి వెళ్లిన ఓ బృందం ఆసక్తికర విషయాలు గుర్తించింది. పొరుగున మారుమూల గ్రామాల్లో నివసించే  కుటుంబాలు చోరీలే ఆధారంగా  జీవిస్తున్నాయి. పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకోవడం అంత సులువు కాదు. ఈ ముఠాల సభ్యులే   జిల్లాలో జరిగిన అనేక దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.


పట్టుకోవడం కష్టమే..
గతంలో డిచ్‌పల్లి మండలంలోని ఓ వివాహ వేడుకలో భారీ చోరీ జరిగింది. డిచ్‌పల్లి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా యూపీ ముఠాగా గుర్తించారు. వారిని పట్టుకొనేందుకు అక్కడికి వెళ్లిన బృందంపై వారంతా ఏకమై దాడికి యత్నించారు. పోలీసులు తప్పించుకొని వచ్చేశారు. గతంలో ఏటీఎం దొంగల ముఠా, గొలుసు చోరీ నిందితుల కోసం వెళ్లిన వారు నానా తిప్పలు పడ్డారు.
నంబర్లు మార్చేస్తున్నారు
దోపిడీలకు పాల్పడిన సమయంలో పోలీసులకు చిక్కకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిల్లీ, యూపీ ముఠాలకు సంబంధించిన చరవాణి నంబర్లు చిక్కాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దిల్లీలో యాచకుల ఆధార్‌ కార్డుల సాయంతో పొందినవిగా గుర్తించారు. ఒకసారి చోరీ చేసిన తర్వాత తిరిగి ఆ నంబర్లను వినియోగించట్లేదు. దీంతో పోలీసులకు ఉత్తరాది ముఠాల కేసులు సవాలుగా మారుతున్నాయి.
నిఘా వైఫల్యం
అంతరాష్ట్ర ముఠాలను కట్టడి చేయడంలో పోలీసుల నిఘా వైఫల్యం కళ్లకు కడుతోంది. జాతీయ రహదారిపై ఎక్కడా తనిఖీలు లేవు. జిల్లా సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ తర్వాత చేతులెత్తేశారు. సాలూర, బిద్రెల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద నామమాత్రపు నిఘా ఉంది. ఫలితంగా ముఠాలు సులువుగా జిల్లాలోకి ప్రవేశించి చోరీలు, దోపిడీలు చేసి ఉడాయిస్తున్నాయి. రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ పటిష్ఠంగా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రికవరీ అంతంతే..
నాలుగేళ్లలో ఉత్తరాది ముఠాల ఆధ్వర్యంలో 144 చోరీలు, దోపిడీలు, గొలుసు అపహరణ ఘటనలు జరిగాయి. రూ.10 కోట్ల వరకు సొత్తు చోరీకి గురైంది. ఈ కేసుల్లో ఇప్పటి వరకు కనీసం రూ.3 కోట్లు అయినా రికవరీ కాలేదు. చాలా కేసులు ఇంకా దర్యాప్తు దశలో ఉన్నాయి. కొన్నింటిని ఛేదించినా నిందితులు చిక్కట్లేదు. దొరికిన వారు జైలు నుంచి విడుదలై తిరిగి పేషీలకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కెమెరాకు స్ప్రే కొట్టి ..
నిజామాబాద్‌ నేరవార్తలు: ఇందల్‌వాయి మండలంలో ఏటీఎం నుంచి నగదు దోచుకెళ్లిన ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గ్యాస్‌ కట్టర్‌ సాయంతో ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు రూ.11.31 లక్షలు దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో ఆధారాలు చిక్కకుండా కెమెరా ముందు భాగానికి స్ప్రే చల్లడంతో అవి పనిచేయలేదు. చోరీకి ఉపయోగించిన గ్యాస్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌ సైతం ఇతర రాష్ట్రాలకు చెందినవిగా అనుమానిస్తున్నారు. దీంతో డీసీపీ అరవింద్‌బాబు బుధవారం ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. అనుమానిత వాహనాల వివరాలు సేకరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి 9 గంటలకు ఏటీఎంలో రూ.12 లక్షలు నగదు నిల్వ ఉంది. 10 గంటల వరకు రూ.69 వేలు విత్‌డ్రా అయ్యాయి. ఆ తర్వాత ఒక్క విత్‌డ్రా కూడా జరగలేదు. మొత్తంగా రూ.11.31 లక్షలను దుండగులు అపహరించుకెళ్లారు. పక్కా పథకం ప్రకారం దోపిడీ జరగడంపై ప్రొఫెషనల్‌ ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ తరహా ఘటనలు ఇంకా ఎక్కడైనా జరిగాయా? అనే కోణంలో వివిధ ప్రాంతాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొంటున్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని