కిలోల్లో కొని.. క్వింటాళ్లుగా అమ్మి
eenadu telugu news
Updated : 21/10/2021 06:27 IST

కిలోల్లో కొని.. క్వింటాళ్లుగా అమ్మి

 ఆగని రేషన్‌ బియ్యం దందా

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌  రాజంపేట మండల కేంద్రంలో పట్టుకున్న రేషన్‌ బియ్యం మినీ డీసీఎం

* కామారెడ్డి జిల్లా రాజంపేట- భిక్కనూరు సరిహద్దులో ఆరేపల్లి మీదుగా మెదక్‌ జిల్లాకు దారుంది. ఇటువైపు వాహనాల రాకపొకలుండవు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు గత నెల 26న మినీ డీసీఎంలో 67 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం తరలిస్తుండగా దంతేపల్లి గ్రామస్థులు అడ్డగించారు. బియ్యం ఎక్కడివని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో రామాయంపేట పోలీసులకు చెప్పగా వారొచ్చి స్వాధీనం చేసుకున్నారు.

* ఈ నెల 2న రాజంపేట మీదుగా రాత్రిపూట మెదక్‌ జిల్లాకు మినీ డీసీఎంలో 31.80 క్వింటాళ్ల బియ్యం  తరలిస్తుండగా పోలీసు వాహనాల తనిఖీలో పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకపోవడంతో పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించడంతో అసలు విషయం తెలిసింది.

* మాచారెడ్డి మండల కేంద్రంలోనూ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ఓ వ్యాపారిపై ఇదివరకే కేసులు నమోదైనా దందా ఆపడం లేదు. ఇక్కడి వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.8-10 చొప్పున కొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిల్లులకు తరలిస్తారు. అక్కడ కిలోకు రూ.18-20 వరకు విక్రయిస్తారు.  

పేదల బియ్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. లబ్ధిదారుల నుంచి చౌకగా కొనుగోలు చేసి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఇవి కొనుగోలు చేయడానికే ప్రత్యేకంగా దుకాణాలు వెలుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రేషన్‌ పంపిణీ చేసే రోజుల్లోనే లబ్ధిదారుల నుంచి దర్జాగా కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు అనుమానం రాకుండా తతంగం నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల కిరాణా దుకాణ నిర్వాహకులు సైతం తక్కువ ధరకే కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
ప్రత్యేక దుకాణాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు, మాచారెడ్డి మండలంలో రెండు, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ఒక దుకాణం రహస్యంగా నడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేయడానికి ప్రత్యేక వ్యక్తులున్నారు. ఇటీవల కొందరు బియ్యం తీసుకోని లబ్ధిదారులను గుర్తించి వారి ఓటీపీ తీసుకొని సరకులు విక్రయించుకుంటున్నారు. వరి పండించే రైతుల్లో ఎక్కువ మంది తాము పండించిన ధాన్యమే ఆహారంగా తీసుకుంటారు. వీరు తమకొచ్చిన బియ్యాన్ని విక్రయిస్తారు. కొందరు ఇంటింటికి తిరిగి సేకరించి విక్రయిస్తారు. జిల్లా కేంద్రం, పలు మండల కేంద్రాల్లో రైతుల నుంచి పెసర్లు, మినుములు, కందులు కొంటామని పేర్కొంటూ.. బియ్యం కొనుగోలు చేస్తారు. నిత్యం ఒక్కో దుకాణదారుడు 10 క్వింటాళ్ల వరకు కొని.. అదే రోజు రహస్య ప్రాంతానికి తరలిస్తారు.
ఇతర జిల్లాల నుంచి..
మన నుంచి ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్లే.. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాకు రవాణా చేస్తున్నారు. గత నెలలో భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా బియ్యం దొరికింది. అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యంలో కొంత భాగం స్థానికంగా మరికొంత మహారాష్ట్రకు వెళ్తున్నట్లు సమాచారం.


 తప్పు చేస్తే కఠిన చర్యలు..
- రాజశేఖర్‌, డీసీఎస్‌వో, కామారెడ్డి

అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయి. లబ్ధిదారులకు అవసరం లేకుంటే తీసుకోవద్దు. దాని వల్ల ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. బియ్యం తీసుకోకుంటే కార్డు రద్దు కాదు. అక్రమ దందాపై మా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. చిన్న సమాచారమిచ్చినా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని