కల్లు విక్రయంపై వివాదం
eenadu telugu news
Updated : 22/10/2021 03:50 IST

కల్లు విక్రయంపై వివాదం

ధ్వంసమైన కల్లు సీసాలు, సామగ్రి

ముప్కాల్‌, న్యూస్‌టుడే: ముప్కాల్‌ మండల కేంద్రంలో కల్తీకల్లు అమ్ముతున్నారని గ్రామస్థులు గురువారం ఆందోళన చేశారు. ఈ విషయమై మాట్లాడేందుకు గీత పారిశ్రామిక సంఘం సభ్యులను చర్చలకు పిలిస్తే రావడం లేదని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా గీతవృత్తి చేసుకోనీయడం లేదని, ఈత వనంలో చెట్లు, కల్లు కుండలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారని గీత పారిశ్రామిక సంఘం సభ్యులు పేర్కొన్నారు. గురువారం ఉదయం కొందరు వ్యక్తులు కల్లు విక్రయ కేంద్రంపై దాడి చేసి సీసాలు, సామగ్రి పగలగొట్టారని ఆరోపించారు.


మృతదేహం లభ్యం

ఎడపల్లి, న్యూస్‌టుడే: జానకంపేటలోని చెరువులో గురువారం ఓ మృతదేహం లభ్యమైనట్లు ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్‌ తెలిపారు. నీటిలో శవం తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 45 సంవత్సరాల మహిళ మృతదేహం పూర్తి కుళ్లిపోయి ఉండడంతో ఎవరన్నది గుర్తించలేకపోయారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.


మహిళ అపహరణ కలకలం

నిజామాబాద్‌ నేరవార్తలు : నగరంలో ఓ మహిళ అపహరణ ప్రచారం గురువారం కలకలం రేపింది. గాజుల్‌పేట్‌కు చెందిన ఆమె మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండుకు వచ్చింది. అక్కడి నుంచి కాలనీకి వెళ్లేందుకు ఓ ఆటోలో ఎక్కిన అనంతరం కనిపించకుండా పోయింది. కుటుంబీకులు ఒకటో ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు చోట్ల సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించినా ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మహిళ ఇంటికి చేరింది. ఈ ఘటనను కుటుంబీకులు గురువారం రాత్రి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఒంటిపై నగలు మాయమయ్యాయని, ఆటోవాలాలపై అనుమానం ఉందని పేర్కొన్నారు. అపహరణకు యత్నించినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని, ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నట్లు ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు.


గంజాయి విక్రయదారుడి అరెస్టు

నిజామాబాద్‌ నేరవార్తలు: నగరంలోని కోజాకాలనీ రైల్వే ట్రాక్‌ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అర్సపల్లి నీటిట్యాంకు సమీపంలో నివాసం ఉండే నిందితుడిని గురువారం ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు అదుపులోకి తీసుకొని గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. కోర్టులో హాజరుపర్చి రిమాండుకి తరలించారు.


పోలీసుల అదుపులో దొంగలు

నిజామాబాద్‌ నేరవార్తలు: నగరంలోని ఒకటో ఠాణా పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గాంధారి, ఎల్లారెడ్డికి చెందిన నిందితులు రెండు వాహనాలు ఎత్తుకెళ్లారు. దర్యాప్తు చేపట్టిన ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు నిందితులను అదుపులోకి తీసుకొని వాహనాలు సీజ్‌ చేశారు.


అదృశ్యమైన యువతి ప్రతక్ష్యం

నిజామాబాద్‌ నేరవార్తలు: నగరంలోని ఐదోఠాణా పరిధిలో నివాసం ఉండే యువతి(19) అదృశ్యమై తిరిగి ప్రత్యక్షమైంది. ఈ నెల 14న కన్పించక పోవడంతో కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈ నెల 18న ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద తాను ఉన్నట్లు యువతి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసింది. పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తదుపరి వివరాల కోసం యువతిని విచారిస్తున్నట్లు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని