యంత్రాలతో పన్జేసి.. తంత్రాలతో పైసలేసి
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

యంత్రాలతో పన్జేసి.. తంత్రాలతో పైసలేసి

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

భిక్కనూరు మండలంలో ఉపాధి జాబ్‌కార్డులు 8290321010100 , 8290321010000 నంబర్లు కలిగిన వారు భార్యాభర్తలు. వీరెప్పుడూ ఉపాధి పనులకు వెళ్లలేదు. ఇటీవల ఓ వ్యక్తి వీరికి ఫోన్‌ చేసి జాబ్‌కార్డు నంబర్లు అడగడంతో చెప్పారు. వారం తర్వాత వారి ఖాతాల్లోకి కూలీ డబ్బులు జమయ్యాయి. ఒక్కొక్కరు ఆరు రోజులు చొప్పున పని చేసినట్లుగా ఇద్దరి ఖాతాల్లో రూ.3006 జమ చేశారు. ఇదే విధంగా మరో ఐదారుగురికి ఇలాగే జమ చేశారు.’’

ఉపాధి కూలీలకే సమయానికి డబ్బులు రాకుంటే అసలు పనికే వెళ్లని వారి ఖాతాల్లో డబ్బులు జమవుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది కదూ..! అధికారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మరి. సీసీ రోడ్ల నిర్మాణాల్లో వేజ్‌ పేమెంట్‌(కూలి చెల్లింపులు)లలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలా మండలాల్లో ఈ వ్యవహారం జరుగుతోంది. కొందరు గుత్తేదారులు అనర్హుల ఖాతాల్లో కూలీ డబ్బులు పడిన తర్వాత వెళ్లి తీసుకుంటున్నారు. ఉపాధిహామీ పథకంలో జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం అనేక లోపాలను గుర్తించింది. తాజాగా కొత్త దందాకు తెరలేపారు.

ఒక శాతం వేజ్‌ పేమెంట్‌

* సీసీ రోడ్డు నిర్మాణ వ్యయంలో ఒక శాతం వరకు వేజ్‌ పేమెంట్‌ ఇవ్వాలి.

* ఉదాహరణకు రూ.5 లక్షల రోడ్డు నిర్మాణానికి ఒక శాతం అంటే రూ.5 వేల వరకు కూలీలకు చెల్లించాల్సి ఉంటుంది.

* రోడ్డు నిర్మాణంలోనూ కూలీలకు కేటాయించిన నిధులు వారికే వాడాలి. వాటర్‌ క్యూరింగ్‌, ఇరువైపులా మొరం పోయడం వంటి పనులు చేయించాలి.

* గుత్తేదారులు మొత్తం యంత్రాల సాయంతో పూర్తి చేసి వారికి తెలిసిన కూలీల జాబ్‌కార్డులను అధికారులకు పంపించి వేజ్‌ పేమెంట్‌ జమ చేయిస్తున్నారు.

* అనంతరం వారి వద్ద తిరిగి తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీరాజ్‌శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

* నిబంధనల ప్రకారం సీసీరోడ్లు నిర్మాణాల్లో కూలీలకు పని కల్పించాలి. మొత్తం యంత్రాల సాయంతో చేయడం విరుద్ధం.

అక్రమాల ఉపాధి

జిల్లాలో ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీలు జరిగిన మండలాల్లో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. బినామీల పేరిట రూ.లక్షలు స్వాహా చేశారు. కొందరు రైతులు సొంతంగా మట్టి రోడ్లు నిర్మించుకుంటే వాటికి కూలీల పేరుతో డబ్బులు కాజేసిన ఉదంతాలు వెలుగుచూశాయి. బాధ్యులపై అధికారులు కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్వోఆర్‌ కింద రికవరీకి ఆదేశించారు. ఈ తతంగం ఒకవైపు కొనసాగుతుండగానే మరో కోణం బయటపడింది.

పని చేసే వారికే డబ్బులు

- వీరానంద్‌, ఈఈ, పంచాయతీరాజ్‌శాఖ, కామారెడ్డి

పంచాయతీరాజ్‌ పర్యవేక్షణలో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణాల్లో వేజ్‌పేమెంట్‌ ప్రకారం కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నాం. పని చేసే వారికే అందుతున్నాయి. ఎవరైనా కూలీ పేరును రాయించిన తర్వాత వారు పనికి రాకుండా ఉంటే డబ్బులు జమై ఉండవచ్ఛు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని