ఆరేళ్లుగాగోదారి..చూపరేం
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

ఆరేళ్లుగాగోదారి..చూపరేం

నిర్మల్‌ - నిజామాబాద్‌ మార్గంపై అలసత్వం

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం

పనులు చేపట్టకపోవడంతో రోడ్డు కోసం ఇచ్చిన భూమిలో పంటలు వేసుకుంటున్న వైనం

నందిపేట్‌ నుంచి నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మారం వరకు వంద ఫీట్ల రోడ్డు విస్తరించి, 30 ఫీట్ల తారు వేయాలి. ఇందులో గోదావరిపై మధ్యలో 500 మీటర్లు, అటు, ఇటు మరో 40 మీటర్ల చొప్పున 80 మీటర్ల మేర వంతెనలు నిర్మించాలి. నాలుగేళ్ల పాటు శ్రమించి ఎట్టకేలకు వంతెనలు నిర్మించారు. వీటి కోసం రూ.80 కోట్ల వరకు వెచ్చించారు. లోకేశ్వం వైపు రోడ్డు విస్తరించారు. కానీ, నిజామాబాద్‌ జిల్లా వైపు పనులు మూడు అడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. గోదావరి నుంచి నందిపేట్‌ వరకు 9 కి.మీ. మేర రోడ్డు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కేవలం 3 కి.మీ. మేర మట్టి రోడ్డు వేసి వదిలేశారు.

అడుగడుగున ఇబ్బందులు

గోదావరికి అవతల భూసేకరణకు ఇబ్బంది రాలేదు. కానీ, ఇవతల సీహెచ్‌ కొండూరు మీదుగా నందిపేట్‌ వరకు మూడేళ్ల పాటు అంతరాయం ఏర్పడింది. ఇటువైపు ఎకరానికి రూ.7.50 లక్షల వరకు బాధిత రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖలు ముందుకొచ్చాయి. ఈ సమస్య తొలగినా అలైన్‌మెంటులో ఉన్న విద్యుత్తు స్తంభాలు, తీగలు తొలగించే ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. విద్యుత్తు అధికారులు ప్రతిపాదనలు పంపితే ఖర్చులను ఆర్‌అండ్‌బీ భరించాల్సి ఉంటుంది. రెండు జిల్లాల అధికారుల సమన్వయ లోపం కారణంగా పనులు నిలిచాయి. లక్కంపల్లి వ్యవసాయాధారిత పరిశ్రమ సమీపంలో నిర్మించే కల్వర్టుకి పక్కనే చెరువు, గుత్ప ఎత్తిపోతల నీరు వచ్చి చేరుతోంది. వానాకాలం మొత్తం తోడినా ఇంకా తొలగిపోలేదు. ఇక్కడ పని పూర్తయితే గాని ముందుకు వెళ్లని పరిస్థితి. ఈ ఏడాది పనులు చేయరని భావించి రైతులు తమ భూముల్లో తాత్కాలికంగా పంటలేసుకున్నారు.


ఏడాదిగా అర్ధంతరంగా నిలిచిన కల్వర్టు పనులు

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం, దిలావర్‌పూర్‌, ముథోల్‌ మండలాల ప్రజలు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిపోతుంటారు. ఆర్మూర్‌ నియోజకవర్గ వాసులు భైంసా వెళ్లేందుకు ఇదే రహదారిని నమ్ముకుంటారు. నిర్మల్‌, బాసర మీదుగా వస్తే దాదాపు 50 కి.మీ. చుట్టి రావాల్సి ఉంటుంది. ఈ దూరభారాన్ని తగ్గించేందుకు నందిపేట్‌ మండలం ఉమ్మెడ వద్ద గోదావరిపై అర కిలోమీటరు పొడువున వంతెన నిర్మించి రోడ్డు వేయాలనే ప్రతిపాదన ఏళ్లుగా నలుగుతోంది. శ్రీరాంసాగర్‌ నిర్మాణంతో రెండు ప్రాంతాల మధ్య ఏర్పడిన ఎడబాటును ఇది తొలగిస్తుంది. దశాబ్దాల నుంచి తీరని కల తెలంగాణ ఏర్పడిన తర్వాత నెరవేరింది. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చొరవతో రోడ్డు, వంతెన నిర్మాణానికి రూ.108 కోట్లు మంజూరు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికావడం లేదు.

జనవరి నాటికి పూర్తి చేస్తాం

: రవీందర్‌రెడ్డి, డీఈ, ఆర్‌అండ్‌బీ, భైంసా డివిజన్‌, నిర్మల్‌

విద్యుత్తు స్తంభాలు, తీగలు తొలగిస్తే పనులు వేగవంతం చేయొచ్ఛు విద్యుత్తు శాఖ అధికారులు ఇటీవలే అంచనాలు వేశారు. సంబంధిత దస్త్రం మా దగ్గరకు రాలేదు. రాగానే అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తాం. సెజ్‌ వద్ద ఏర్పడిన కల్వర్టులో నీటి ఊటను తోడేందుకు నాలుగు మోటార్లు వాడుతున్నాం. వానలు తగ్గడంతో కొంత ఇబ్బంది తొలగింది. జనవరి నెలాఖరు నాటికి రోడ్లు పూర్తిచేస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని