హాల్‌టికెట్‌పై సంతకం తప్పనిసరి కాదు
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

హాల్‌టికెట్‌పై సంతకం తప్పనిసరి కాదు

‘న్యూస్‌టుడే’ ఫోన్‌ఇన్‌లో డీఐఈవో లోకం రఘురాజ్‌

కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ మొదటి సంవత్సరర పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నాం. హాల్‌టికెట్లపై కళాశాల యాజమాన్యాల సంతకాలు అవసరం లేదు. 71 కేంద్రాల్లో 18,697 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కొవిడ్‌ కారణంగా అదనంగా 26 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. మూడు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు, హైపర్‌ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులు, సీఎస్‌, డీవోల ఆధ్వర్యంలో పరీక్షలు కొనసాగుతాయని జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి లోకం రఘురాజ్‌ తెలిపారు. ఇంటర్‌ విద్యార్థుల సందేహాల నివృత్తికి శనివారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో ఆయన సమాధానాలిచ్చారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

నిమిషం నిబంధన అమల్లో ఉందా? ఆలస్యమైతే పరీక్ష రాయడానికి అనుమతిస్తారా?

- భాస్కర్‌-సాయినగర్‌, చంద్రశేఖర్‌-డిచ్‌పల్లి

* సమయంలోగా చేరుకోవాలి. ఒక రోజు ముందే కేంద్రాలను చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయొచ్ఛు

ఆన్‌లైన్‌ పాఠాలు సరిగా అర్థం కాలేదు. పరీక్ష విధానంలో ఏమైనా మార్పులుంటాయా?

రాఘవేందర్‌-ఇందల్‌వాయి, సృజన్‌-వినాయక్‌నగర్‌

* కొవిడ్‌ కారణంగా పాఠ్యాంశాలను 70 శాతానికి కుదించారు. పాత విధానంలోనే పరీక్షలు కొనసాగుతాయి. ప్రశ్నలు సులభంగానే ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దు చేసి ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆధారంగా మార్కులు వేస్తే బాగుంటుంది కదా ?

శ్రీకాంత్‌ యాదవ్‌, భీంగల్‌

* గతంలో కరోనా మూలంగా మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుతం వాటిని నిర్వహించాలని విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు నిపుణులు నిర్ణయించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలప్పుడు మూడో దశ ఉంటే ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది.

మా గ్రామాల నుంచి కేంద్రానికి వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేవు. సమయానికి చేరేదేలా?

-వెంకటేశ్‌-వర్ని, రాము-బాల్కొండ

* బస్సులు సరైన సమయంలో నడిపించాలని ఆర్టీసీ అధికారులకు జిల్లా పాలనాధికారి లేఖలు రాశారు. ఆర్టీసీనే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. సమయానికి చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులు వారికి సహకరించాలి.

నిబంధనల ప్రకారం ఏయే వస్తువులు తీసుకురావాలి?

రవి-కిసాన్‌నగర్‌

* నీళ్ల సీసా వెంట తెచ్చుకోవచ్ఛు ఒకరి వస్తువులు మరొకరికి ఇవ్వరాదు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తీసుకురావొద్ధు చరవాణి కేంద్రానికి తెచ్చుకోకపోవడమే మంచిది.

కరోనా ప్రభావం తగ్గినా ఆ భయం ఇంకా పోలేదు. అనారోగ్యంతో బాధపడుతున్నవారి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?

రమేశ్‌-ఆర్మూర్‌

* పరీక్ష కేంద్రానికి వచ్చే విద్యార్థులు తిరిగి ఇంటికి చేరే వరకు మాస్కులు వేసుకోవాలి. కేంద్రం బయట థర్మామీటర్‌తో శరీర ఉష్ణోగ్రత చూసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. జ్వరం, జలుబు వంటి ఇతర సమస్యలు ఉన్న వారిని ఐసోలేషన్‌ గదిలో ఉంచి పరీక్ష రాయిస్తారు. ఇందుకోసం ప్రతి కేంద్రానికి ప్రత్యేక గదులు కేటాయించాం. ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. పరీక్ష రాసేటప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురైతే ప్రశ్న, జవాబు పత్రాలు తీసుకొని సంబంధిత పీహెచ్‌సీకి విద్యార్థిని పంపిస్తాం. కేంద్రాల్లోని నోటీసు బోర్డుపై కరోనా నిబంధనలపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటున్నారు. వాటిపై సంతకాలు లేకుండా పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తారా?

శ్యాంకుమార్‌-నిజామాబాద్‌, మహమ్మద్‌ నజిమోద్దీన్‌-ఆర్మూర్‌, రాజు-రెంజర్ల, శ్రీనివాస్‌-తల్వేద, శంకర్‌-ఆర్యనగర్‌, అన్వర్‌-ఖిల్లా, శ్రీధర్‌-భీమ్‌గల్‌

* ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష హాల్‌టికెట్లు https:///tsbie.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్ఛు వాటిపై ఆయా కళాశాలల యాజమాన్యాల సంతకాలు లేకున్నా కేంద్రంలోకి అనుమతిస్తారు. కరోనా పరిస్థితుల కారణంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని