ఇందూరు మీదుగా గంజాయిగా
eenadu telugu news
Published : 24/10/2021 05:02 IST

ఇందూరు మీదుగా గంజాయిగా

గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు ఆ దిశగా సమాయత్తం అవుతున్నాయి. కమిషనరేట్‌లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి గంజాయి రవాణా గొలుసుకట్టుని అరికట్టాల్సి ఉంది. ఇందుకోసం పకడ్బందీ వ్యూహం, రాత్రివేళలో పక్కా నిఘా వ్యవస్థ అవసరం.

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

ఏపీలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాకు గంజాయి రవాణా అవుతోంది. రాత్రి వేళల్లో లారీలు, సరకు రవాణా వాహనాలు, ప్రైవేటు కార్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిఘావర్గాలు, మాదక ద్రవ్యాల నిరోధక విభాగాలకు చిక్కకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ పలు సందర్భాల్లో సాంకేతిక వ్యవస్థ, చరవాణుల ఆధారంగా గంజాయి ముఠాలను పట్టుకోగలిగారు.

క్యాబిన్లు.. టైర్‌ ట్యూబ్‌ల్లో..

లారీ ముందుభాగం క్యాబిన్లలో గంజాయి నిల్వ కోసం ప్రత్యేకంగా స్థలం ఉంచుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు తరలించే సరకుల మధ్యలో ప్యాకెట్లు ఉంచి తప్పించుకొంటున్నారు. టైర్‌ ట్యూబ్‌ల్లోనూ నింపిన తర్వాత వాటిని మూసేసి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ఈ సమయంలో ఎవరికి అనుమానం రాకుండా మహిళలు, చిన్నారులు వారితో ఉండేలా చూస్తున్నారు. రైళ్లలో తరలించేందుకు ఓ కుటుంబాన్ని ఎంపిక చేసుకొని ట్రిప్పునకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నారు. భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరగా ముంబయికి వెళ్లే బస్సుల్లోనూ ప్యాసింజర్‌ లగేజీల్లో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తీసుకెళ్తున్నారు. ఇలా పలువురు స్మగ్లర్ల తాలూకు వ్యక్తులు వారానికి రెండు దఫాలుగా ముంబయికి వెళ్లొస్తున్నట్లు తెలుస్తోంది.

తరలింపు ఇలా..

* గంజాయి రవాణా చేసేవారు విశాఖపట్నం నుంచి వేకువజామున సరకు లారీలు, ఇతర వాహనాల్లో బయలుదేరుతున్నారు. అక్కడి నుంచి భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా నేరుగా హైదరాబాద్‌కు చేరుకొని అర్ధరాత్రి సంగారెడ్డి చేరుకుంటున్నారు. ః రాత్రుళ్లు పోలీసుల నిఘా ఆధారంగా సంగారెడ్డి-జహీరాబాద్‌-బాన్సువాడ మీదుగా నిజామాబాద్‌కు వస్తున్నారు.

* లేని పక్షంలో నేరుగా జాతీయ రహదారి మీదుగా డిచ్‌పల్లి వరకు తరలించి రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు. పాతబడిన ఇళ్లు, మూసి ఉన్న పెట్రోలు బంకులను ఎంచుకొంటున్నారు.

* అనంతరం అక్కడి నుంచి అనువైన సమయాల్లో నాందేడ్‌, పుణె, ముంబయి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు, బస్సులు, రైళ్లలో సులువుగా రవాణా చేస్తున్నారు.

ఇక్కడ నిఘా అవసరం

జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద కొంతకాలంగా పోలీసు, ఎక్సైజ్‌ శాఖల నిఘా కొరవడింది. ఫలితంగా మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాత్రివేళల్లో ఉభయ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉంది.

రెండింతలకు అమ్ముతూ..

ఈ దందాలో అక్రమార్కులు రూ.లక్షల్లో వెనకేస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి 2 కిలోల ప్యాకెట్‌ను రూ.3,500 కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్‌లో హోల్‌సేల్‌గా రూ.6- రూ.8 వేలకు అమ్ముతున్నారు. యువతే లక్ష్యంగా చేసుకొని రోజువారీ విక్రయాలు చేసేవారు అంతకు రెండింతలు వ్యాపారం చేస్తున్నారు. ఇదే మొత్తాన్ని ముంబయికి తరలించి రూ.25 వేలు-రూ.30 వేలు సంపాదిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని