
డీఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: నాడు- నేడు పనుల్లో ప్రగతి లేదంటూ.. అందుకు హెచ్ఎంలను బాధ్యులను చేస్తూ డీఈవో మెమోలు జారీ చేయడాన్ని ఫ్యాప్టో ప్రతినిధులు ఖండించారు. ఆ మేరకు సంఘం జిల్లా ఛైర్మన్ రఘుబాబు, కేవీజీ కీర్తి శనివారం డీఈవో వీఎస్ సుబ్బారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇతర సమస్యలపైనా మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని కోరారు. లోప రహిత సీనియారిటీ జాబితాలు తయారు చేసి ఉద్యోగోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 30 రోజుల వేతనం, డీఏలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు తదితరాలపై నిర్ణయాలు తీసుకోకుండా ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు అప్పగించి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. డీఈవోను కలిసిన వారిలో చల్లా శ్రీనివాసులు, రవి, వై.వెంకట్రావు, చెన్నుపాటి మంజుల, అమ్మయ్య తదితరులు ఉన్నారు.