Updated : 04/05/2021 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మిర్చి చేలో ‘మందు’ పాతర... 

 రూ.20 లక్షల మద్యం పట్టివేత
  ప్రధాన నిందితుడు ఎంబీఏ విద్యార్థి 
వల పన్ని పట్టుకున్న సెబ్‌ అధికారులు


స్వాధీనం చేసుకున్న గోవా రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలతో సెబ్‌ అధికారులు

మార్కాపురం గడియార స్తంభం, న్యూస్‌టుడే: ఓ మిర్చి చేలో మొక్కల మధ్య, సాగునీటి పైపుల కింద ఎవరూ గుర్తించకుండా దాచి ఉంచిన ‘మందు’పాతర గుట్టు వీడింది. గప్‌చుప్‌గా గోవా నుంచి తెచ్చి.. పెద్దఎత్తున నిల్వ చేసి విక్రయిస్తున్న ఉదంతం బట్టబయలైంది. ఈ అక్రమ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఓ విద్యార్థి కావడం గమనార్హం. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) జిల్లా సహాయ కమిషనర్‌ వై.శ్రీనివాస్‌చౌదరి మార్కాపురం ఈఎస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.  
గుమ్మనంపాడు- గోవా- కర్రొల...
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామానికి చెందిన భూక్యా సేవా నాయక్‌ అనే విద్యార్థి మార్కాపురంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మల్లారెడ్డి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సోదరుడు ఆంజనేయులు నాయక్‌తో కలిసి ఉంటున్నాడు. సేవా నాయక్‌ గతంలో కొంతకాలం గోవాలో ఉన్నాడు. ఆ సమయంలో చిన్నపాటి ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత చదువుల నిమిత్తం మార్కాపురం వచ్చాడు. గోవాలో తనకున్న పరిచయాలతో అక్కడి నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో స్థానికంగా మద్యాన్ని అక్రమంగా విక్రయించే వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుని పరిచయాలు పెంచుకున్నాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సిద్ధప్ప అలియాస్‌ సిద్ధు అనే వ్యక్తి ద్వారా అతని సొంత వాహనంలో గోవా నుంచి మద్యాన్ని తెప్పించేవాడు. అనంతరం స్థానిక వ్యాపారులకు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ అక్రమం మూడు నెలలుగా సాగుతోంది. గోవా నుంచి తెచ్చిన మద్యం సీసాలను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకుగాను తనకు పరిచయస్థుడైన పెద్దారవీడు మండలం హనుమాన్‌జంక్షన్‌ కుంట సమీపంలోని కర్రొల గ్రామానికి చెందిన దూదేకూల సిద్దయ్య పొలాన్ని ఎంచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా మిర్చి చేలోని చెట్ల మధ్య, సాగునీటి పైపుల కింద వీటిని నిల్వ ఉంచాడు. 


మిర్చి పొలంలో మొక్కల మధ్య దాచి ఉంచిన మద్యం సీసాలు 

పది రోజులపాటు పక్కా నిఘా...
పెద్దారవీడు మండలం హనుమాన్‌జంక్షన్‌ కుంట సమీపంలోని కర్రొల గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారం సాగుతున్నట్టు సెబ్‌ అధికారులకు సమాచారం అందింది. సెబ్‌ కమిషనర్, జాయింట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా సహాయ కమిషనర్‌ పర్యవేక్షణలో సీఐ ఎన్‌.తిరుపతయ్య ఆధ్వర్యంలో ఓ బృందం పక్కా నిఘా ఏర్పాటు చేసింది. అక్రమ మద్యం గుట్టురట్టు చేసేందుకు వల పన్నారు. ప్రధాన నిందితుడైన సేవా నాయక్‌ కదలికలను గత పది రోజులుగా పరిశీలించారు. తొలుత విద్యార్థి నివాసం ఉంటున్న మార్కాపురంలోని ఇంటిలో తనిఖీలు చేశారు. ఆ తర్వాత కర్రొల గ్రామంలోని మిర్చి చేలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ దాచి ఉంచిన 1175 కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.20 లక్షలు ఉంటుంది. పట్టుబడిన మద్యం సీసాలన్ని కల్తీ బ్రాండ్లుగా భావించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏడుగురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో వై.పాలెం మండలం వాదంపల్లికి చెందిన నీలం నారాయణ, సఫావత్‌ రామానాయక్, పెద్దరావీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన కుందురు యోగిరెడ్డి, ప్రధాన నిందితుడైన సేవా నాయక్‌ సోదరుడు ఆంజనేయులు నాయక్, గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన దొడ్డా శివారెడ్డి ఉన్నారు. నిందితుల నుంచి రూ. 50,800 నగదుతో పాటు ఒక ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో నరసరావుపేట ఈఎస్‌ వి.చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ కర్ణ, స్వ్కాడ్‌ ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని