‘ఆడుకోవాలని ఉంది.. మమ్మల్ని ఆదుకోండి!’
logo
Updated : 17/06/2021 16:45 IST

‘ఆడుకోవాలని ఉంది.. మమ్మల్ని ఆదుకోండి!’

ఒంగోలు: బడికి వెళ్లలేకపోయినా.. ఆ సోదరులు ఆంగ్లంలో అదరగొడతారు. తమ తెలివితేటలతో అబ్బురపరుస్తారు. పెరిగి పెద్దయ్యాక దునియానే దున్నేస్తామనేంత ఉత్సాహం ప్రదర్శిస్తారు. అలాంటి వారిని ఉన్నచోటు నుంచి కదల్లేని స్థితిలోకి నెట్టింది ఓ వింత వ్యాధి. దేశంలో మందుల్లేవ్.. విదేశాల నుంచి తెప్పించుకునేందుకు డబ్బుల్లేవ్. పిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలని పరితపిస్తున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 

బొద్దుగా, అల్లారు ముద్దుగా ఉన్న ఈ చిన్నారులు ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలకుంటకు చెందిన వినయ్ కుమార్, వేదవతి దంపతుల కుమారులు. ఇద్దరూ స్పైనల్ మస్క్యూలర్ ఎట్రోపీ వ్యాధితో బాధపడుతున్నారు. వినయ్ కుమార్ హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేసేటప్పుడు పెద్దబ్బాయి లస్సిత్‌లో తొలుత వ్యాధి లక్షణాలు కన్పించగా.. కొన్నాళ్లకు రెండో కుమారుడు మోక్షిత్‌కు ఇదే వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అమెరికాకు చెందిన బయోజిన్ కంపెనీ ఉత్పత్తి చేసే ఇంజెక్షన్ ఇస్తేనే వారిని కాపాడుకోగలమని వైద్యులు చెప్పారు. కానీ, ఒక్కో ఇంజెక్షన్‌ ధర రూ.కోటి అని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. పిల్లలను దగ్గరుండి చూసుకుంటూనే వైద్య ఖర్చుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

నా పేరు లస్సిత్ యాదవ్, ఎస్‌ఎంఏ టైప్-2 వ్యాధితో బాధపడుతున్నాను. నాకు నడవాలని, పరుగు తీయాలని, కారు నడపాలని, బడికి వెళ్లాలని ఉంది. నా పేరు మోక్షిత్. నేనూ ఇదే వ్యాధితో బాధపడుతున్నాను. నేను పెద్దయ్యాక బైక్ రేసర్‌ను అవుతాను. మేం కోలుకునేందుకు దయచేసి మీరు సాయపడాలని కోరుతున్నాం. - బాధిత చిన్నారులు

ఈ పిల్లల వ్యాధి గురించి అంతర్జాలంలో శోధించగా దేశంలో ఇలాంటి వ్యాధితో బాధపడేవారు సుమారు 400మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరందరి తల్లిదండ్రులు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో డైరెక్ట్ రిలీఫ్ ఫండ్ అనే అమెరికా సంస్థ భారత్‌కు చెందిన 360మందికి జీవితాంతం మందులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇందులో వీరి రెండో కుమారుడు మోక్షిత్‌కు అవకాశం లభించింది. త్వరలో హైదరాబాద్‌లో తొలి డోస్ ఇంజెక్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దబ్బాయికి ఏడేళ్లు కావడంతో ఇందులో అవకాశం లేదు. అందుకే క్రౌడ్ ఫండింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంపాక్ట్ గురులో సంప్రదించగా, ఇప్పటివరకు దాదాపు రూ.7లక్షలే సమకూరాయి. 

రోజురోజుకు పిల్లలిద్దరూ బరువు పెరగడం, కదలలేని పరిస్థితి ఏర్పడటం వల్ల బడికి వెళ్లే వీలు లేకపోయింది. తల్లి సంరక్షణ, శిక్షణలోనే విజ్ఞానాన్ని సముపార్జన చేస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం, యూట్యూబ్‌లో తమకు నచ్చిన సమాచారం వెతకడం, లఘుచిత్రాలు చూసి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. తమ కంటిపాపలిద్దరూ తోటిపిల్లల్లా ఆడిపాడుతుంటే చూడాలని తల్లి వేదవతి ఆశపడుతున్నారు.

ఇంటర్నెట్ ద్వారా లోకజ్ఞానం తెలుసుకుంటున్న ఈ చిన్నారులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. బిడ్డల ఎదుగుదలపై ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులు పిల్లలు కదల్లేని స్థితిలో ఉండటాన్ని చూసి కుమిలిపోతున్నారు. తమ కన్నీళ్లు తుడిచి బిడ్డల ఊహలకు రెక్కలు తొడిగే దాతల కోసం ఎదురుచూస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని