గృహ నిర్మాణం...నత్తే నయం
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

గృహ నిర్మాణం...నత్తే నయం

 ఇప్పటికి 40 ఇళ్లే పూర్తి 
 మరో విడత మేళాకు ఏర్పాట్లు 


కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని లేఅవుట్‌లో ఇళ్ల పనుల తాజా పరిస్థితి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉన్నాయి. ‘నవరత్నాలు-పేదలందరికి ఇల్లు’ పథకంలో భాగంగా సేకరించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో జూన్‌ 3 నుంచి 10 వరకు నిర్మాణాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించింది. క్షేత్రస్థాయిలో చాలామంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించలేదు. లేఅవుట్లలో నిర్మాణానికి అవసరమయ్యే మౌలిక వసతుల కొరతతోపాటు, భవన నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో లబ్ధిదారులు వెనుకడుగు వేశారు. వేగవంతం చేసే దిశగా పర్యవేక్షణ నిమిత్తం నియోజకవర్గ, మండల, గ్రామ, లేఅవుట్ల వారీగా ప్రత్యేకాధికారులను ఆ మధ్య నియమించారు. జులై 1, 3, 4 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మెగా గ్రౌండింగ్‌ మేళాను నిర్వహించింది. 48 వేల ఇళ్ల పనులను ఒకేసారి ప్రారంభించినా పునాదుల లోపే ఉన్నవి 40వేల వరకు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు కేవలం 40 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. తాజాగా మరో 31 వేల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
అరకొరగానే వసతులు 
ఎక్కువ లేఅవుట్లు గ్రామాలకు దూరంగా ఉండటంతో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ లోటు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏర్పాటుచేయడం ఇప్పట్లో కష్టమేనన్న భావన లబ్ధిదారుల్లో నెలకొంది. నిర్మాణానికి ఇబ్బంది లేకుండా అత్యవసరం కింద నీరు, విద్యుత్తు వసతి కల్పించేలా మాత్రం యంత్రాంగం చర్యలు ఆరంభించింది. జిల్లాలోని 698 లేఅవుట్లలో రూ.40.79 కోట్లతో నీటి వసతికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనాలు తయారు చేశారు. ఇప్పటివరకు 389 పనులే పూర్తయ్యాయి. అయినా సరిపడా నీరు అందుబాటులో లేక లబ్ధిదారులు ట్యాంకర్లతో తెప్పించాల్సిన దుస్థితి తలెత్తింది. ఇది వారికి అదనపు భారంగా మారింది. ఇప్పటికే చేసిన పనులకు బిల్లుల విడుదలలో జాప్యం జరగడంతో కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. 722 కాలనీలకు విద్యుత్తు సరఫరా అందించేందుకు స్తంభాలు, తీగల ఏర్పాటుకు రూ.186 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులు రాకపోవడంతో పనులు ప్రారంభించలేదు.

నేడు 31,826 గృహాల శంకుస్థాపనకు ప్రణాళిక 
జిల్లా వ్యాప్తంగా గురువారం మరో 31,826 పక్కా ఇళ్ల నిర్మాణ పనులు ఆరంభించనున్నారు.. అన్నింటి పనులు ప్రారంభించాలన్న ఉద్దేశంతో లబ్ధిదారులపై స్థానిక నాయకులు, వాలంటీర్ల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ యూనిట్‌ ఖరీదు రూ.1.80 లక్షలు. ఇందులో రూ.1,59,750 నగదు; మరో 90 బస్తాల సిమెంటు(రూ.20,250), ఉచితంగా 20 టన్నుల చొప్పున ఇసుక ఇవ్వనున్నారు. ఇదే విషయమై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా వారు అనాసక్తి చూపడంతో సంబంధిత అధికారులకు సమస్యగా మారింది. 

జిల్లాలో ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు 79,072 
నిర్మాణాలు ప్రారంభించినవి 47,246 
పునాదుల లోపు ఉన్నవి: 42,510 
పునాదుల స్థాయిలో ఉన్నవి 3,102
స్లాబ్‌ దశలో 842 
స్లాబ్‌ వేసినవి 752 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని