ఈ కుర్రాళ్లు..ప్రతిభా సుమూలు
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

ఈ కుర్రాళ్లు..ప్రతిభా సుమూలు

పాలిసెట్, జేఈఈ మెయిన్స్‌లో సత్తా


తల్లిదండ్రులతో ఆనందం పంచుకుంటున్న రాహుల్‌నాయుడు 

జిల్లా విద్యార్థులు పాలిసెట్‌తో పాటు జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చాటుకున్నారు. చక్కటి ఫలితాలతో ఉజ్వల భవితకు బాటలు వేసుకున్నారు. పాలిసెట్‌లో ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు 42, 61, 81 సాధించారు. వీరు జిల్లాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో ఇద్దరు విద్యార్థులు ప్రథమ, నాలుగో ర్యాంకులు సాధించడం విశేషం. 

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పాలిసెట్‌ 2021 ఫలితాలను బుధవారం సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లాకు సంబంధించి మొత్తం 2,908 మంది పరీక్ష రాయగా వారిలో బాలురు 1996 మంది (94.55 శాతం), బాలికలు 777 (97.49శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో బాలుర ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంగా 95.36 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ వారంలోగా ప్రవేశాల కౌన్సెలింగ్‌ జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి దాదాపు 5 వేల సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

 ఐఐటీ చదువుతా
-ధనేకుల జయప్రకాష్, శానంపూడి, సింగరాయకొండ   ర్యాంకు 42 
సింగరాయకొండ గ్రామీణం: జయప్రకాష్‌ 7వ తరగతి వరకు స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలోను..8,9,10 తరగతులు రాజమండ్రిలో చదివాడు. తండ్రి బలరామయ్య దొనకొండ మండలం తెల్లపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా, తల్లి సుభాషిణి మూలగుంటపాడులో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. జయప్రకాష్‌ పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఐఐటీ చేసి అఖిలభారత సర్వీసు అయిన సివిల్స్‌లో మెరవాలన్నది లక్ష్యమని జయప్రకాష్‌ తెలిపాడు. 

సివిల్స్‌ సాధించాలని..
-చీమలదిన్నె వీరనారాయణ, పొదిలి రోడ్డు, దర్శి  ర్యాంకు 61 
దర్శి: ఈ మండలంలోని లంకోజనపల్లికి చెందిన చీమలదిన్నె వీరనారాయణ పాలిసెట్‌లో 61వ ర్యాంకు సాధించాడు. 120 మార్కులకు 117 మార్కులు సాధించాడు. తండ్రి వెంకట్రావు దర్శిలో దర్జీగా పనిచేస్తుండగా తల్లి ఆశా కార్యకర్త. 6 నుంచి 10వ తరగతి వరకు దర్శి ఆదర్శ పాఠశాలలో ఈ విద్యార్థి చదువుకున్నాడు. స్థానికంగా ఓ అకాడమీలో పాలిసెట్‌ శిక్షణ తీసుకున్నాడు. భవిష్యత్తులో సివిల్స్‌లో రాణించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు వీరనారాయణ తెలిపాడు.

ప్రణాళిక ప్రకారం చదివా
-గోరంట్ల మోక్షజ్ఞ, చీమకుర్తి  ర్యాంకు 81 
చీమకుర్తి: ‘ఐఐటీ సాధించి ఉన్నతమైన ఇంజినీరింగ్‌ వృత్తిలో రాణించడమే నా లక్ష్యం’ అంటున్నాడు మోక్షజ్ఞ. ఈ విద్యార్థి తండ్రి రామకృష్ణ గతంలో సైన్యంలో పనిచేసి ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. మోక్షజ్ఞ ప్రాథమిక విద్యాభ్యాసం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని సైనిక పాఠశాలల్లో సాగింది. 8 నుంచి 10 తరగతి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని శశి పాఠశాలలో చదివాడు. ఓ ప్రణాళిక ప్రకారం చదవడం వల్లే తాను పాలిసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించినట్లు చెప్పాడు.

ఇష్టంతో చదివితే లక్ష్యం సిద్ధిస్తుంది
-కంచనపల్లి రాహుల్‌నాయుడు, జేఈఈ మెయిన్స్‌ ప్రథమ ర్యాంకర్, పర్చూరు  
పర్చూరు, న్యూస్‌టుడే: ‘‘అవగాహనతోనే చదువులో సులభంగా రాణించవచ్చు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వినడం, అర్థం చేసుకోవడం, అనంతరం విశ్లేషించుకోవడం దినచర్యగా మార్చుకున్నా. రాత్రి పదిన్నరకు నిద్రకు ఉపక్రమించి మరుసటిరోజు ఉదయం 5 గంటలకే లేచి పునశ్చరణపై దృష్టిసారించేవాడిని. సందేహాలు వస్తే అధ్యాపకులను సంప్రదించి వాటిని నివృత్తి చేసుకునేవాడిని. 24 గంటలు పుస్తకాలు ముందేసుకోవడం కన్నా ఇష్టంతో చదివితే లక్ష్యాన్ని సాధించగలుగుతాం.’’ అని తెలిపాడు జేఈఈ మెయిన్స్‌ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన రాహుల్‌నాయుడు. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి మార్కులు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్సు చదవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపాడు. 
బాల్యం నుంచి రాణిస్తూ..
రాహుల్‌ స్వస్థలం పర్చూరు. 6వ తరగతి వరకు ఇక్కడి ఎంఆర్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో చదివాడు. 7వ తరగతి విజయవాడ చైతన్యలోను, 8 నుంచి ఇంటర్‌ వరకు అక్కడి నారాయణ విద్యాసంస్థలో చదివాడు. ఇంటర్‌లో 978 మార్కులు సాధించాడు. తండ్రి రమేష్‌ చిరు వ్యాపారి కాగా, తల్లి మాధవీలత స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి చదువులో రాహుల్‌ చూపిస్తున్న ప్రతిభ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. పేద కుటుంబమైనా సరే చదువుకు భంగం కలగకుండా సౌకర్యాలు కల్పించారు. 

కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలన్నది లక్ష్యం
-పి.లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి, జేఈఈ మెయిన్స్‌ 4వ ర్యాంకు, ఒంగోలు
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్‌లో పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి సత్తాచాటాడు. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఈ విద్యార్థి స్వగ్రామం పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. ఒంగోలు సమతానగర్‌లో నివాసముంటున్నారు. తండ్రి మాల్యాద్రిరెడ్డి దర్శి ఉన్నత పాఠశాల, తల్లి లక్ష్మీకాంత తూర్పుగంగవరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లోకేష్‌రెడ్డి 5వ తరగతి వరకు పొదిలి, 6 నుంచి 10 వరకు గుడివాడ, ఇంటర్‌ మాదాపూర్‌లో చదివాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్‌ 3న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలనేది తన లక్ష్యమని తెలిపాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించానన్నారు. ఈ విద్యార్థి ఇటీవల ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌లో సైతం 23వ ర్యాంకు సాధించాడు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని