నల్ల దందా.. కొత్త పంథా
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

నల్ల దందా.. కొత్త పంథా

 రేషన్‌ బియ్యం పక్కదారి 
 బెంగళూరు, పుణెలకు తరలింపు


చెక్‌ పోస్ట్‌ వద్ద పట్టుకున్న వాహనం

న్యూస్‌టుడే, కనిగిరి: పేదలకు దక్కాల్సిన రేషన్‌ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. డీలర్‌ వద్ద కొనుగోలు చేయడం, అక్కడి నుంచి రహస్య ప్రాంతాలకు చేర వేసి పాలిష్‌ చేసి సొమ్ములు చేసుకోవడం సర్వ సాధారణంగా మారింది. కనిగిరి నుంచి దర్శికి, అక్కడి నుంచి కావలికి చేర వేసి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన వివిధ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. గత అయిదు నెలల్లో జిల్లాలోని కనిగిరి, వెలిగండ్ల, పీసీపల్లి, పామూరు, తదితర ప్రాంతాల్లో పట్టుబడిన వందలాది టన్నుల అక్రమ బియ్యమే దీనికి ఉదాహరణ.
చక్రం తిప్పేది వారే..
జిల్లాలో ఇటీవల కాలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టించింది స్వయంగా ప్రజలు, ప్రజా సంఘాల నాయకులే కావడం గమనార్హం. కనిగిరి, పీసీపల్లి, కావలి  ప్రాంతాల్లో చక్రం తిప్పే కొందరు వ్యక్తులే దళారుల అవతారమెత్తి ఈ దందాను నిర్విఘ్నంగా కానిస్తున్నారు. పౌర సరఫరా, పోలీసు శాఖల్లో పనిచేసే ఇంటి దొంగలే కీలకపాత్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. మామూళ్లతో ఈ వ్యవహారం సాఫీగా నడిచిపోతోంది.  
రెండు జిల్లాల బియ్యం మిల్లుల్లో అవినీతి కథ 
దళారులు, కొందరు డీలర్లు, చౌక బియ్యం వాహనాల చోదకులు బియ్యం తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు ఓ బృందంగా ఏర్పడి బియ్యాన్ని సేకరించి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని మిల్లులకు తరలించి కిలో రూ. 20లకు అమ్ముతున్నారు. వారు ఈ బియ్యాన్ని పాలిష్‌ చేసి బెంగళూరు, పుణె, చెన్నై తదితర ప్రాంతాల్లో వసతి గృహాలకు, హోటళ్లకు ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. కావలి, దర్శిలోని కొన్ని మిల్లుల యజమానులు ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి నెలా లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతోంది.


మొగుళ్లూరు వద్ద స్వాధీనం చేసుకున్న బియ్యం  (పాత చిత్రం) 

*కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద జులై నెలలో 100 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రజలే అధికారులకు పట్టించారు. 
* కనిగిరి నగర పంచాయతీలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఇటీవల స్థానికులే అడ్డుకుని అధికారుల సాయంతో అక్రమార్కుల ఆట కట్టించారు.
* గత నెలలో 90 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా కనిగిరిలో అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.
* బుధవారం పీసీపల్లి మండలం గుదేవారిపాలెం, కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌లో సుమారు 321 బస్తాల రేషన్‌ బియ్యాన్ని ఒంగోలు నుంచి వచ్చిన విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దాడులు నిర్వహిస్తున్నాం 
గడచిన అయిదారు నెలల కాలంలో వెయ్యి టన్నుల వరకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత అక్రమ వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. రాబోయే రోజుల్లో కూడా నిఘా పెంచి అక్రమ వ్యాపారాన్ని అరికడతాం. 
- నాయబ్‌ రసూల్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని