దసరా వచ్చే.. సంబరాలు తెచ్చే...
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

దసరా వచ్చే.. సంబరాలు తెచ్చే...

భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు

సందడిగా సాంస్కృతిక కార్యక్రమాలు

మార్కెట్‌లో పత్రి, మామిడి ఆకులు కొనుగోలు చేస్తున్న మహిళలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. అమ్మవారి దేవాలయాల వద్ద భక్తుల ప్రత్యేక పూజలతో పాటు బుధవారం రాత్రి మొదలైన కళారాల ఉత్సవం సందడిగా సాగుతోంది. కళారావాలను ఒంగోలు నగర వాసులు తెల్లవారు జాము వరకు భక్తితో తిలకించారు. అమ్మవారి దేవాలయాల వద్ద నుంచి మేళతాళాలతో ప్రారంభమైన కళారాలు ప్రధాన రహదార్లలో ఊరేగింపుగా సాగాయి. దేవతామూర్తుల వేషధారణతో కళాకారులు అలరించారు. గంటాపాలెం పార్వతమ్మగుడి, కేశవస్వామిపేట విజయదుర్గ దేవాలయం, కొత్తపట్నం బస్టాండ్‌ రోడ్డులోని మహాలక్ష్మమ్మ దేవాలయం, కమ్మపాలెంలోని కాళికా అమ్మవారి గుడి వద్ద నుంచి గురువారం కన్నుల పండవగా ఉత్సవం సాగింది. ● గాయత్రీ అమ్మవారి దేవాలయంలో కుంకుమ పూజకు మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గద్దలగుంట రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో మహిషాసుర మర్దిని అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. ● ఒంగోలు ఫ్రెండ్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీరోడ్డులో మినీ పార్వేట ఉత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. వాసవీ అమ్మవారి దేవాలయంలో 108 రకాల ప్రసాదాలతో అమ్మవారికి నివేదన ఉంటుంది. లాయర్‌పేట జమ్మిచెట్టు వద్ద పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దేవాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ● స్థానిక తాతా లక్ష్మీ కల్యాణ మండపంలో శిద్దా సూర్యప్రకాశరావు నేతృత్వంలో నిర్వహించే కార్యక్రమాల్లో సుభాష్‌ పత్రీజీ శుక్రవారం పాల్గొని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తారు.

ఒంగోలు గ్రామీణం: ఒంగోలు నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవారు గురువారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లాయర్‌పేట షిర్డీ సాయిబాబా మందిరంలో మహిషాసుర మర్దిని; అచలానంద ఆశ్రమంలో గోవిందాంబిక, కేశవస్వామిపేట కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానంలో అన్నపూర్ణ అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో; చెన్నకేశవస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సంతపేట సాయిబాబా మందిరంలో స్వామివారికి విశేష అలంకరణ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. మద్దిపాడు: మండలంలోని పెదకొత్తపల్లిలోని శివాలయం, చెన్నకేశవస్వామి దేవాలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.కొండపి: స్థానిక గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరాలయంలో మహిశాసురమర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి లలితా సహస్ర నామార్చన, కుంకుమ పూజ నిర్వహించారు. పెరిదేపిలోని ఉమామహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. చీమకుర్తి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలను ముస్తాబు చేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరణ చేశారు. దసరా స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక హరిహర క్షేత్రంలో పార్వతీ అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. టంగుటూరు: వల్లూరమ్మ దేవస్థానంలో ఎనిమిదో రోజైన గురువారం మహిషాసురమర్దిని అలంకరణలో వల్లూరమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. గుడ్లూరు: స్థానిక నీలకంఠేశ్వరాలయంలో పార్వతీ అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేశారు. కుంకుమ పూజలు, సహస్ర నామార్చన నిర్వహించారు.

నేత్రపర్వంగా ఊంజల్‌ సేవ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలులోని కుర్తాళం పీఠ పాలిత శ్రీగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీవారి ఊంజల్‌ సేవను గురువారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. సంగీత విద్వాంసుడు వినోద్‌కుమార్‌ భక్తి సంకీర్తనలు ఆలపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తిరువీధి ఉత్సవం, కోలాట ప్రదర్శన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

వైభవం.. వేంకటేశ్వరుని కల్యాణం...

లింగసముద్రం: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చినపవని వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని గురువారం నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని