ప్రస్థానం.. కుటుంబం ఇక్కడే
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

ప్రస్థానం.. కుటుంబం ఇక్కడే

జిల్లాతో మావోయిస్టు నేత ఆర్కేకు విడదీయని బంధం

ఆర్కే కుమారుడు ఫృథిఫఫఫ్వ స్మారక స్తూపం

ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు, న్యూస్‌టుడే: అనారోగ్యంతో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కేకు జిల్లాతో విడదీయరాని బంధం వుంది. ఆయన ఉద్యమంలో కీలక ఘట్టాలు ఇక్కడ ఉన్నాయ్‌. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన ఆర్కే సుమారు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలో కొనసాగారు. దీనిలో ఎక్కువభాగం ప్రకాశం జిల్లాతోనూ ముడిపడి వుంది. తొలుత పీపుల్స్‌వార్‌లోను, ఆ తరువాత అన్ని విప్లవ గ్రూపులను ఏకం చేసి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల నిర్వహణలో నల్లమల అటవీ ప్రాంతం కేంద్రంగా కీలకభూమిక పోషించారు. జిల్లాకు చెందిన విప్లవ రచయితల సంఘం కీలక నాయకుల్లో ఒకరైన కల్యాణ్‌రావు మరదలు శిరీషను వివాహం చేసుకున్నారు. వీరిది టంగుటూరు మండలం ఆలకూరపాడు స్వగ్రామం. ఆర్కే దంపతుల కుమారుడు ఫృథ్వి నాలుగేళ్లక్రితం ఏవోబీలో జరిగిన కాల్పుల్లో చనిపోగా అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. ఈ సంద్భంగా నిర్మించిన స్మారక స్తూపం గ్రామంలో ఉంది.

గ్రామంలో విషాదం..

ఆర్కే మృతి గురించి ప్రసార మాధ్యమాల్లో వస్తున్న సమాచారంతో ఆలకూరపాడు గ్రామంలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబం నివసిస్తున్న ఇంటికి గురువారం రాత్రి గ్రామస్థులు చేరుకున్నారు. భార్య శిరీషను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ● కాగా పదిహేడేళ్ల క్రితం ప్రభుత్వంతో జరిగిన చర్చలకు ఆర్కే ఆధ్వర్యంలో మావోయిస్టుల బృందం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచే వచ్చింది. పెదదోర్నాల సమీపంలో వారు బయటకు వచ్చారు. నాటి ఘటనలను పలువురు గుర్తుచేసుకున్నారు.

పల్నాడుతో మమేకమై..

ఆర్కే తండ్రి ఉద్యోగ్య రీత్యా గుంటూరు జిల్లా తుమృకోటలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేయడంతో పల్నాడు ప్రాంతంతో ఆర్కేకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ ప్రాంత రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. సౌమ్యుడుగా, చదువరిగా ఉండే వాడని ఆయనతోపాటు ఇంటర్‌, డిగ్రీ కలిసి చదువుకున్న ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు. డిగ్రీ పూర్తయిన తరువాత మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులై ఆ దిశగా ప్రయాణం సాగించారని తెలిపారు. 1982లో పీపుల్స్‌వార్‌లో చేరిన తరువాత గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నుంచే ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. దాదాపు పదేళ్ల పాటు శ్రీనగర్‌, రామాపురం, భట్రుపాలెం, గామాలపాడు ప్రాంతాల్లో ఉండి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. పీపుల్స్‌ వార్‌ను పల్నాట విస్తరించే క్రమంలో నాటుసారా వ్యతిరేక పోరాటం, దేవుని మాన్యాల పంపిణీ, కార్మిక ఉద్యమాలు నడిపి ప్రజలకు మరింత చేరువయ్యారు

ఆలకూరపాడులోని ఆర్కే కుటుంబ సభ్యుల నివాసం వద్ద విషాదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని