కాపాడాల్సిన వారే.. కాలయాపన చేస్తున్నారు
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

కాపాడాల్సిన వారే.. కాలయాపన చేస్తున్నారు

మార్కాపురం వైద్యశాలలో క్షతగాత్రులకు సమయానికి అందని వైద్యం

మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాల(ముఖ చిత్రం)

మార్కాపురం గడియార స్తంభం, న్యూస్‌టుడే: ప్రమాదాల్లో గాయపడి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి వచ్చే క్షతగాత్రులకు వైద్యం సక్రమంగా అందించడం లేదు. కనీస ప్రయత్నం చేయకుండానే ఒంగోలు వెళ్లాలంటూ ఉచిత సలహాలిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాత్రిళ్లు విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో ఉండటం లేదని బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణులు, ప్రాణాల కోసం పోరాడుతున్న క్షతగాత్రులపైనా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గురువారం ఆసుపత్రిలో జరిగిన సంఘటన వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

5 గంటల నిరీక్షణ తరువాత ఉచిత సలహా...

బుధవారం అర్ధరాత్రి బేస్తవారపేట మండలం సింగరపల్లిలో ట్రాక్టర్‌ బోల్తాపడటంతో బాలుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ కారంపూడి కాశీరావు(55)ను మార్కాపురం జిల్లా వైద్యశాలకు గురువారం తెల్లవారుజామున 5 గంటలకు తీసుకొచ్చారు. గంట తరువాత సిబ్బంది వచ్చి బయటకెళ్లి స్కానింగ్‌ చేయించుకురావాలని చెప్పారు. అది తీసుకొచ్చినప్పటికీ ఉదయం పది గంటల వరకు క్షతగాత్రుడిని పట్టించుకున్న నాథుడే లేరు. అప్పుడు వైద్యశాలకు చేరుకున్న వైద్యశాల సూపరింటెండెంట్‌ దృష్టికి బాధితులు విషయం తీసుకెళ్లడంతో ఆయన ఒంగోలుకు తీసుకెళ్లాలని సూచించారు. పైఅంతస్తులో ఉన్న పేషెంట్‌ను కిందికి తీసుకొచ్చేందుకు సైతం ఎవరూ సహాయం చేయకపోవడంతో కుటుంబసభ్యులే స్టచర్‌పై అతి కష్టం మీద కిందికి దించుకున్నారు. అయిదు గంటల నుంచి ఒక్క వైద్యుడు కూడా రాలేదని ఇప్పుడు ఒంగోలు తీసుకెళ్లమని చెప్పారని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

సమయపాలన పాటించని వైద్యులు...

మార్కాపురం జిల్లా వైద్యశాలలో 14 మంది వైద్యులునప్పటికీ రాత్రి వేళ ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు కూడా 11 దాటిన తరువాతే వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి వైద్య పరికరాలు సమకూర్చినప్పటికీ వాటి నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. వైద్యశాలలో 16 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల జరిగిన కిడ్నాప్‌ ఉదంతంతో నిర్వహణ లోపం స్పష్టంగా బయటపడింది. 15 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా భద్రతా చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. మరో వైపు కాన్పుల కోసం వచ్చే మహిళల పట్ల కొందరు నర్సుల వ్యవహరశైలి విమర్శలకు తావిస్తోంది. కొందరు వైద్యులు ప్రైవేటు వైద్యశాలలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో సర్కారు వైద్యశాలలో సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి.

త్వరలో బయోమెట్రిక్‌ అమలు చేస్తాం...

బుధవారం రాత్రి విధుల్లో ఓ వైద్యురాలు ఉన్నారు. ఆసుపత్రిలో స్కానింగ్‌ లేకపోవడంతో సిబ్బంది బయట తీసుకు రావాలని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఒంగోలు తీసుకెళ్లాలని సూచించార. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా త్వరలోనే బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తాం. రాత్రి వేళ విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. - సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ జిల్లా వైద్యశాల మార్కాపురం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని