పేరుకే ఆటోనగర్‌!
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

పేరుకే ఆటోనగర్‌!

దుకాణాలు తరలక అద్దంకిలో తప్పని ఇక్కట్లు

న్యూస్‌టుడే - అద్దంకి

శింగరకొండ సమీపంలో ఖాళీగా ఉన్న ఆటోనగర్‌

వాహన మరమ్మతులు, వివిధ రకాల వర్క్‌షాపులు నిర్వహిస్తున్న వారి కోసం... రెండు దశాబ్దాల క్రితమే అద్దంకిలో ఆటోనగర్‌ ఏర్పాటు చేశారు. పట్టణానికి కాస్త దూరం కావడంతో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడక నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం పట్టణంలో ట్రాఫిక్‌ చిక్కులు, ప్రమాదాల తీవ్రత పెరిగిన నేపథ్యంలో... వాటిని ఆటోనగర్‌కు తరలిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ పరిస్థితి...

ఇటు ఒంగోలు, చీరాల... అటు నరసరావుపేట, వినుకొండ, పొదిలి ప్రాంతాలకు అద్దంకి పట్టణం మధ్యస్థంగా ఉంటుంది. హైదరాబాద్‌కు వెళ్లే అన్ని రకాల వాహనాలు పట్టణంలోంచే రాకపోకలు సాగిస్తాయి. రాయలసీమ, పశ్చిమ ప్రకాశం వాసులు... రాజధాని అమరావతికి దగ్గర దారి కావడంతో గుండకమ్మ వంతెన మార్గంలో వెళ్తుంటారు. గ్రానైట్‌ వాహనాలు, టిప్పర్లు సైతం ఇటుగానే తిరుగుతుంటాయి. ఈ కారణంగానే వాహనాల మరమ్మతు దుకాణాలు అద్దంకిలో ఎక్కువ. ఫౌండ్రీలు సైతం ఉన్నాయి. వీటన్నిటినీ ఓ చోట చేర్చేందుకు... హనుమాన్‌ మోటార్‌ వర్కర్స్‌, ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్‌ గరటయ్య చొరవ చూపి... శింగరకొండ సమీపంలో ఆటోనగర్‌ పేరిట 150 వరకు ప్లాట్లు కేటాయించారు. మంచినీటి సదుపాయం, విద్యుదీకరణ పనులు సైతం చేపట్టారు. కొందరు షెడ్లు సైతం నిర్మించారు. ఆ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందక దుకాణాలు తరలించలేదు. కేవలం పది మంది మాత్రమే అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

ట్రాఫిక్‌ చిక్కులు...

ప్రస్తుతం పట్టణంలో ట్రాక్టర్‌ మెకానిక్‌ షెడ్‌లు 15, విద్యుత్తు మరమ్మతులు... 20, కార్పెంటర్‌... 15, ద్విచక్ర వాహన మరమ్మతులకు సంబంధించి 25 వరకు దుకాణాలు ఉన్నాయి. అనుబంధంగా మరికొన్ని కొనసాగుతున్నాయి. ఇలా రామ్‌నగర్‌ నుంచి శింగరకొండ వరకు దాదాపు 120 దుకాణాలు నడుస్తున్నాయి. కమఠేశ్వరాలయం, భవానీకూడలి, ఆర్టీసీ బస్టాండ్‌ వంటి ప్రాంతాల్లో రోడ్డుపైనే వాహనాలు నిలిపి మరమ్మతులు చేపడుతున్నారు. కొందరు రహదారి ప్రాంతాన్నీ ఆక్రమించి... తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. నిత్యం భారీ వాహనాలు తిరిగే మార్గం కావడంతో... తరచూ ట్రాఫిక్‌ చిక్కులు తలెత్తుతున్నాయి. ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దుకాణాలను ఆటోనగర్‌కు తరలిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. వాహనదారులకు సైతం అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయని చెబుతున్నారు.

నిర్ణయం తీసుకోవాలి

అద్దంకి పట్టణంలో రెండు వరుస రహదారి నిర్మించడంతో వాహనాల వేగం పెరిగింది. అదే స్థాయిలో ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి. అన్ని వసతులతో ఆటోనగర్‌ ఏర్పాటు చేసినందున... మెకానిక్‌ దుకాణాలు అక్కడకు తరలిస్తే బాగుంటుంది. అధికారులు ఈ విషయమై వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలి. - మన్నం త్రిమూర్తులు, పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు

వ్యాపారం పెరుగుతుంది

మెకానిక్‌ షెడ్‌లు ఆటోనగర్‌కు తరలితే పట్టణంలో రద్దీ తగ్గుతుంది. ప్రస్తుతం కొన్ని వస్తువులకు విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పూర్తిస్థాయిలో ఆటోనగర్‌ ఏర్పడితే అన్ని రకాల దుకాణాలు, వస్తువులు ఇక్కడే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారమూ పెరుగుతుంది. - రామాంజనేయులు, మెకానిక్‌, అద్దంకి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని