‘జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం’
eenadu telugu news
Published : 15/10/2021 04:19 IST

‘జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం’

సమావేశంలో పాల్గొన్న పరిరక్షణ సమితి నాయకులు

అద్దంకి, న్యూస్‌టుడే: జెండా మోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడిన కార్యకర్తలకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని వైకాపా సంయుక్త కార్యదర్శి బీవీ.కృష్ణారెడ్డి అన్నారు. జోసెఫ్‌రెడ్డి అధ్యక్షతన అద్దంకి భవానీకూడలిలో వైకాపా పరిరక్షణ సమితి నాయకులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, ప్రధాన నాయకుడి వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. అధిష్ఠానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సహకార బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ జాగర్లమూడి యల్లమందరావు మాట్లాడుతూ... డబ్బులు ఇచ్చిన వారికే నామినేటెడ్‌ పదవులు ఇచ్చారని విమర్శించారు. కొంగపాడు ఎత్తిపోతల పథకం భూముల ఆక్రమణపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఇసుక, మట్టి దందా పెద్ద ఎత్తున సాగుతోందని... అదేమంటే ఉన్నతస్థాయి వ్యక్తులకు వాటా ఉందని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎస్సీ సెల్‌ నాయకుడు పూనూరి నరేంద్ర మాట్లాడుతూ స్థానిక పరిస్థితులు తెలియజెప్పేందుకు... జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుల వద్దకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వద్దకూ వెళ్తామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను కాజేసేందుకే ‘గుడ్‌మార్నింగ్‌ అద్దంకి’ కార్యక్రమం చేపడుతున్నారని ఆరోపించారు. రావినూతలకు చెందిన కారుసాల బసవేశ్వరరావు మాట్లాడుతూ... రెండు ఎంపీటీసీ స్థానాలు గెలిపిస్తే ఎంపీపీ పదవి ఇస్తామని చెప్ఫి.. నమ్మక ద్రోహం చేశారన్నారు. కార్యక్రమంలో మద్దినేని గోపీకృష్ణ, జండ్రాజుపల్లి మాతయ్య, రమేష్‌, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని