బయటికెళ్లి.. తిరిగి రాలేదు...
eenadu telugu news
Updated : 18/10/2021 06:35 IST

బయటికెళ్లి.. తిరిగి రాలేదు...

 అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి 


జాగిలాలతో మృతదేహం వద్ద పరిశీలిస్తున్న క్లూస్‌ టీం

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. ఒంటిపై గాయాలతో అనుమానాస్పద రీతిలో మృతిచెంది కనిపించారు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని రామసముద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామసముద్రం గ్రామానికి చెందిన ఆవుల సుబ్బారెడ్డి(45) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. శనివారం సాయంత్రం సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లారు. రాత్రికి అయినప్పటికీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలోని ముళ్ల పొదల్లో ఒంటిపై గాయాలతో సుబ్బారెడ్డి విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మార్కాపురం డీఎస్పీ కిశోర్‌ కుమార్‌తో పాటు యర్రగొండపాలెం సీఐ దేవ ప్రభాకర్, త్రిపురాంతకం, పుల్లలచెరువు ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒంటిపై గాయాలుండడంతో హత్యగా భావించి విచారణ చేపట్టారు. జాగీలాలతో పాటు క్లూస్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఊరికి కొద్ది దూరంలో ఉన్న కంది చేను వరకు జాగీలాలు వెళ్లాయి. అతన్ని అక్కడ హతమార్చి తీసుకొచ్చి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తమ్ముడు ఆవుల చిన్న నాసర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు వదినతో పాటు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సీఐ దేవ ప్రభాకర్‌ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని