మార్చరు..కట్టనీయరు...
eenadu telugu news
Updated : 22/10/2021 05:55 IST

మార్చరు..కట్టనీయరు...

మూడేళ్లుగా రూపకల్పనలోనే మాస్టర్‌ ప్లాన్‌

తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టణ వాసులు

కందుకూరు పట్టణ ముఖచిత్రం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌ కేంద్రం కందుకూరు. రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న పట్టణం. నూతనంగా భవనాలు, వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి. దీంతో పాటు పల్లెల నుంచి భారీగా వలసలు పెరిగాయి. ఏటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ చిత్రపటాన్ని రూపొందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. 2005లో రూపొందించిన బృహత్తర ప్రణాళికే(మాస్టర్‌ ప్లాన్‌) నేటికీ అమలవుతోంది. కొత్తది కాగితాలకే పరిమితమవుతోంది. దీంతో పట్టణ వాసులకు కష్టాలు తప్పడం లేదు.

2005లో మాస్టర్‌ ప్లాన్‌ ఏర్పాటు...: ద్వితీయశ్రేణి మున్సిపాలిటీగా ఉన్న కందుకూరు పట్టణానికి 2005లో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. మొత్తం 30 వార్డులుండగా.. 60.32 చ.కి.మీ విస్తీర్ణం ఉంది. వ్యాపార(కమర్షియల్‌), పరిశ్రమల(ఇండస్ట్రియల్‌), గృహ సముదాయ జోన్లుగా(రెసిడెన్షియల్‌), గ్రీన్‌ బెల్ట్‌, పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌ జోన్‌లుగా ప్రకటించారు. పట్టణంలోని ప్రధాన వీధుల వెంట వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండటంతో సుమారు వంద అడుగుల వెడల్పు వరకు వ్యాపార జోన్‌గా నిర్ణయించారు. ఇదేక్రమంలో పట్టణంలోని పామూరు రోడ్డు కూడలి నుంచి కేజీబీవీ పాఠశాల, విద్యుత్తు ఉపకేంద్రం వరకు సుమారు 330 ఎకరాలు, కనిగిరి రోడ్డులో కోర్టు అవతల సుమారు 6 ఎకరాలను పరిశ్రమల జోన్‌గా ప్రకటించారు.

కట్టబోతే తప్పని తిప్పలు...: పామూరు రోడ్డులో రెండు పొగాకు వేలం కేంద్రాలతో పాటు కందిపప్పు, మిరప, ఆయిల్‌, ధాన్యం తదితర మిల్లులున్నాయి. పొగాకు గ్రేడింగ్‌ చేసే కంపెనీలు మరో 10 వరకు ఉంటాయి. సుమారు 20 కంపెనీలు గరిష్ఠంగా 100 ఎకరాల్లోపే ఏర్పాటయ్యాయి. కానీ అప్పట్లో అనాలోచితంగా 330 ఎకరాలను పరిశ్రమల జోన్‌గా ప్రకటించడంతో పట్టణ వాసులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలో ఏటా దాదాపు 200కు పైగా ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. అయితే పామూరు రోడ్డు కూడలి నుంచి కేజీబీవీ పాఠశాల వరకు, కేశరగుంట కాలనీ, తానికొండవారికొష్టాలు, కనిగిరి రోడ్డులోని ఓ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. పామూరు రోడ్డులోని సర్వే నంబర్లు 134 నుంచి 180 వరకు, 890 నుంచి 943 వరకు 330 ఎకరాలు, కనిగిరి రోడ్డులోనూ 10 ఎకరాల స్థలం పరిశ్రమల జోన్‌గా ప్రకటించారు. గతంలో ఈ ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మించుకోవాలంటే మున్సిపాలిటీ నుంచి అనుమతులు లభించడం లేదు. కట్టుకున్న వారికీ జరిమానాలు విధిస్తున్నారు.

పారిశ్రామికవాడగా నమోదైన పామూరు రోడ్డు ప్రాంతం

సమావేశంతో సరిపుచ్చారు... : పారిశ్రామిక జోన్‌ను మార్చాలని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం, పట్టణాభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాలతో మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు 2019 జనవరిలో మున్సిపాలిటీలో స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం నిర్వహించి సలహాలు స్వీకరించారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. సర్వేలు, మ్యాపుల పేరుతో అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి...

ప్రస్తుతం పట్టణ స్థితి ఉన్నట్లుగా బేస్‌ మ్యాప్‌ తయారీ పూర్తై డీటీసీపీ అనుమతి కూడా లభించింది. ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు వీలైనంత త్వరలోనే డీటీసీపీ నుంచి అనుమతులు రానున్నాయి. వారం రోజుల పాటు సర్వే చేయిస్తాం. తర్వాత మాస్టర్‌ ప్లాన్‌ వివరాలపై స్టేక్‌ హోల్డర్స్‌తో సమావేశం నిర్వహిస్తాం. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి ప్లాన్‌ రూపకల్పన చేస్తాం. మరో రెండు నెలల్లోగా ప్రక్రియ మొత్తం పూర్తిచేసేందుకు కృషిచేస్తాం. - పి.వేణు, పట్టణ ప్రణాళికాధికారి

మున్సిపాలిటీ : కందుకూరు

వార్డులు: 32

జనాభా : 60,576 (సుమారు)

విస్తీర్ణం: 60.32 చ.కి.మీ

గృహాలు : 15 వేలు (సుమారు)


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని