వద్దనుకుంటే ముట్టజెప్పాల్సిందే...
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

వద్దనుకుంటే ముట్టజెప్పాల్సిందే...

ఇంటర్‌ ప్రవేశాల్లో కళాశాలల వసూళ్లు

సాంకేతిక సమస్యతో విద్యార్థుల ఆందోళన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల్లో కొన్ని ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యాలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహన లోపాన్ని ఆసరా చేసుకుని ప్రవేశాల మార్పునకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఒక కళాశాల పేరుతో వివరాలు నమోదైతే.. ఆ విద్యార్థి మరో చోట చేరడానికి వీలుపడదు. మార్చుకోవాలంటే కళాశాల యాజమాన్యం ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌తోనే సాధ్యపడుతుంది. ఈ విధానం ఇప్పుడు ప్రైవేట్‌ కళాశాలలు డబ్బు దండుకునేందుకు అవకాశం కల్పించింది.

నకళ్లు ఇవ్వడంతో చిక్కులు...: గత నెల రోజులుగా ఇంటర్‌ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులు సీటు దొరుకుతుందో లేదోనన్న భయంతో ముందుగానే ధ్రువీకరణ పత్రాల నకళ్లను కొన్నిచోట్ల యాజమాన్యాలకు అందజేశారు. వీటిని ఉపయోగించి విద్యార్థులు తమ వద్ద చేరినట్టు వారు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కళాశాల నచ్చకపోతే మార్చుకునే వెసులుబాటు విద్యార్థికి ఉంటుంది. ఈ సడలింపు మేరకు కళాశాల మార్చుకుంటామంటూ కొందరు విద్యార్థులు యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా సంబంధిత విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.15 వేలు చెల్లించాలంటూ షరతు పెడుతున్నారు. కందుకూరులోని ఒక ప్రైవేట్‌ కో ఆపరేటివ్‌ కళాశాలపై ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఒంగోలు నగరంలోని ఒక కార్పొరేట్‌ కళాశాలపై కూడా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రైవేట్‌ కళాశాలల్లో ఈ తంతు కొనసాగుతోంది.

డబ్బులడిగితే చర్యలు తప్పవు...

విద్యార్థులు కళాశాల మార్చుకోడానికి డబ్బులు డిమాండ్‌ చేస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కందుకూరులోని కో ఆపరేటివ్‌ కళాశాలపై ఏడుగురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కళాశాల పాస్‌వర్డ్‌ సీజ్‌చేసి తాము మరో పాస్‌వర్డ్‌ ద్వారా విద్యార్థుల పేర్లు తొలగించి వారు కోరుకున్నచోట చేరే అవకాశం కల్పించాం. ఇంకా పలుచోట్ల నుంచి ఇలాంటి ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నెల 30 వరకు ప్రవేశాలకు గడువు ఉంది. ఎక్కడైనా విద్యార్థులకు సమస్య తలెత్తితే 9392911807కు సంప్రదించాలి.  - వీవీ సుబ్బారావు, ఆర్‌ఐవో


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని