మారువేషంలో వచ్చి .. వీఆర్వోను పట్టుకుని
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

మారువేషంలో వచ్చి .. వీఆర్వోను పట్టుకుని

రైతు నుంచి తీసుకున్న నగదుతో వీఆర్వో మాలకొండేశ్వరరావు

కనిగిరి, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ వీఆర్వో చిక్కారు. ఈ ఉదంతం కనిగిరిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఒంగోలు ఏసీబీ డీఎస్పీ ఎం.సూర్యనారాయణరెడ్డి తెలిపిన ప్రకారం.. కనిగిరి బీసీ కాలనీకి చెందిన ఎం.మహేష్‌ అనే రైతు తండ్రికి శంకవరంలో 45 సెంట్ల పొలం ఉంది. ఆ భూమిని ఆన్‌లైన్‌లో తన పేరు మీద మార్చాలని కనిగిరి పట్టణం, శంకవరం-1 వీఆర్వో సింగరాజు మాలకొండేశ్వరరావును ఆశ్రయించారు. అందుకు రూ. 10 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనంటూ నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి రూ. 5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. డీఎస్పీతో పాటు సీఐలు అపర్ణ, వెంకటేశ్వర్లు, శేషు, మరో ఇద్దరు ఎస్సైలు మారువేషంలో వచ్చి కనిగిరి సామాజిక వైద్యశాల వద్ద మాటు వేశారు. అనంతరం రైతుతో వీఆర్వోకు ఫోన్‌ చేయించి అక్కడికి రప్పించారు. మహేష్‌ నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు వీఆర్వోను పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ పుల్లారావుకు సమాచారం అందించారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేశామని.. నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని