శింగరకొండ... పర్యాటకంగా వెలుగొంద
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

శింగరకొండ... పర్యాటకంగా వెలుగొంద

న్యూస్‌టుడే - అద్దంకి

శింగరకొండ క్షేత్రం సమీపంలోని జలాశయం

జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. యంత్రాంగమూ దృష్టి సారిస్తే మరింత వేగంగా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకధామంగా మార్చేందుకు పుష్కరం క్రితమే నిర్ణయించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ చొరవతో 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పర్యాటకశాఖ ప్రతిపాదనలను ఆమోదించారు. 600 ఎకరాలకు పైగా విస్తరించిన భవనాశి తటాకంలో... ట్యాంక్‌బండ్‌లో బుద్ధుడి విగ్రహం మాదిరిగా ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం, బోటు షికారు, నామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి పక్కనే ఉన్న చేపల పెంపక కేంద్రం వద్ద రిసార్ట్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. ఒకే ప్యాకేజీగా వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.రెండు కోట్లు మంజూరు చేసింది. తదనుగుణంగా పర్యాటక, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్ర పరిశీలన చేపట్టి... ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. తరువాత వివిధ కారణాలతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. పట్టించుకున్న వారూ కరవయ్యారు.

చారిత్రక సంపదకు నెలవు...

శింగరకొండ అంటే పుణ్యక్షేత్రమే కాదు... చారిత్రక సంపదకు నిలయం. తొలి తెలుగు పద్యశాసనం అద్దంకిలోనే లభ్యమైంది. వెయ్యి స్తంభాల గుడి, రెడ్డిరాజుల కాలం నాటి కోటగోడలు, కత్తులబావి, గాడిద శాసనం తదితరాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. జార్జి చక్రవర్తి, విక్టోరియా మహారాణి నివాసాలు, వారి రాతి విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. చెప్పుకొంటూ పోతే ఇలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. వీటికి తోడు... సహజసిద్ధ తటాకం, దాన్ని ఆనుకుని సాగే నామ్‌ రహదారి మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. 99 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం మరో ప్రత్యేక ఆకర్షణ. పురాతన సంపదను ప్రాభవంలోకి తెచ్చి జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే... ఈ ప్రాంతం జిల్లాకే మకుటాయమానంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

రాతికత్తువ నిర్మాణానికి అంగీకారం...

భవనాశి తటాకం అభివృద్ధికి ఓ కార్పొరేట్‌ సంస్థ ఆసక్తి చూపుతోంది. సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాతికత్తువ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇది సాకారమైతే... పర్యాటక అభివృద్ధికి కీలక అడుగు పడినట్లే. కొవిడ్‌ పరిస్థితులతో పనుల ప్రారంభంలో జాప్యం నెలకొన్నట్లు సమాచారం. త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. అనుసంధానంగా ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఈ విషయమై ఆలయ సహాయ కమిషనర్‌ ఎన్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... సందరు సంస్థ వారు జలాశయం నలువైపులా రాతి కత్తువ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. మిగతా ప్రతిపాదనలకూ ఆమోదం లభిస్తే ఈ ప్రాంతం... ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని