Published : 14/02/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాయగాళ్లు!!

● సిక్కోలు పోలీసులకు చిక్కిన నకిలీ డీఐజీ

● విశాఖలో నకిలీ ఐఏఎస్‌ అరెస్టు?

● నమ్మకంగా డబ్బులు గుంజిన మోసగాళ్లు

నిందితుని వివరాలు వేల్లడిస్తున్న ఎస్పీ అమ్మిరెడ్డి

ఒకరు... పోలీసు ఉన్నతాధికారినన్నాడు! డీఐజీనంటూ నమ్మించాడు! ‘సస్పెండ్‌ చేశారని బాధపడొద్ధు.. వీఆర్‌లో ఉన్నారని బెంగొద్దు! మీకు నేనున్నా...నచ్చిన చోట పోస్టింగ్‌ ఇప్పిస్తా..’అంటూ...పోలీసులనే బురిడీ కొట్టించాడు. రూ. లక్షలు గుంజేశాడు!

ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు! 

మరొకరు... తాను ఐఏఎస్‌నన్నాడు! అలా...ఓ గుర్తింపు కార్డూ సృష్టించాడు! ఇంకేముంది...తనదైన శైలిలో వసూళ్లు ఆరంభించాడు! చివరికి నిఘా కళ్లకు దొరికాడు!! శ్రీకాకుళం...విశాఖపట్నం పోలీసులు తెలియజేసిన ఈ మాయగాళ్ల వివరాలు దిగ్భ్రాంతి కలిగించేవే!!

అరసవల్లి, న్యూస్‌టుడే

రాచపల్లి శ్రీను ఏడో తరగతి చదివాడు. ‘పోలీసులపై చర్యలు’ అనే వార్తలు ఆసక్తిగా గమనించేవాడు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వారి జాబితా తయారు చేసుకున్నాడు. ఉన్నతాధికారినంటూ ఫోన్‌ చేసి హడావుడి చేసేవాడు. ‘నాకింత ఇస్తే...నీకు పోస్టింగ్‌ వేయిస్తా’ అని నమ్మించాడు. రోడ్లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారి బ్యాంకు ఖాతాల నంబర్లు చెప్పి డబ్బులు జమ చేయమనేవాడు. అలా చేసిన ఓ అధికారికి అనుమానం రావటంతో...తీగ లాగాడు. అక్రమార్కుని డొంక కదిలింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలను శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డి గురువారం వెల్లడించారు.

అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వేళ్లమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీను అలియాస్‌ మంగళ శ్రీను ఏడో తరగతి వరకు చదువుకున్నాడు.

నేరాలు చేస్తూ అడ్డదారులు తొక్కేవాడు. 2006 నుంచి బంగారు గొలుసులు అపహరించేవాడు. ఇలాంటి 18 కేసుల్లో తప్పించుకు తిరుగుతున్నాడు. అతనిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు ఉన్నాయి. కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ ఇతనిపై కేసులున్నాయి. 2016లో జైలు నుంచి విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడ్డాడు. 2017లో ఓ గొలుసు అపహరించి పారిపోయే సమయంలో ద్విచక్రవాహనం స్టార్ట్‌ కాకపోవడంతో ప్రజలు పట్టుకున్నారు. మళ్లీ జైలుకెళ్లాడు. ఆ తరువాత తన దారి మార్చాడు. ‘వైట్‌కాలర్‌’ నేరాలకు దిగాడు. ఇప్పటి వరకు వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు పోలీసులకు పోస్టింగ్‌లు వేయిస్తానని రూ.లక్షలు గుంజేసినట్లుపోలీసులు గుర్తించారు.

వారిపైనే గురి: పోలీసు ఉద్యోగులు ఎందుకు వీఆర్‌లో ఉన్నారు...ఎందుకు సస్పెండ్‌ అయ్యారు...క్రిమినల్‌ కేసుల్లో ఎందుకు ఇరుక్కున్నారనే వివరాలను ఆరా తీసేవాడు. వారి గురించి పత్రికల్లో...టీవీల్లో వచ్చే వార్తలు ఆసక్తిగా పరిశీలించేవాడు. సంబంధిత పోలీసు స్టేషన్‌ ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌చేసి రేంజ్‌ డీఐజీని మాట్లాడుతున్నాను..ఫలానా కానిస్టేబుల్‌, ఎస్‌ఐల వివరాలు ఎంత వరకు వచ్చాయనే దస్త్రాలు పరిశీలించి చెప్పాలని అడిగేవాడు. కిందిస్థాయి సిబ్బంది కొందరు నిజమనుకుని వివరాలు చెప్పేసేవారు. ఏ రేంజ్‌ అధికారి అయితే ఆ రేంజ్‌ అధికారి యాషలో మాట్లాడి సిబ్బందిని నమ్మించేవాడు. ఫోన్‌ చేసి వివరాలు అడిగే సమయంలో ఏమైనా తేడా అనిపించి అవతలివారు గట్టిగా అడిగితే వెంటనే ఫోన్‌కట్‌ చేసేవాడు. నేరాలకు పాల్పడిన తరువాత సెల్‌, సిమ్‌ మార్చేస్తాడు. వివిధ కారణాలతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న పోలీసు సిబ్బందితోనూ మాట్లాడుతూ పోలీసు నిబంధనలు తెలుసుకునేవాడు.

ఉభయ రాష్ట్రాల్లోనూ

శ్రీను వద్ద ఓ పుస్తకం గుర్తించారు. అందులో ఎవరెవరిని మోసగించాలో పేర్లు రాసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, వరంగల్‌ , జీడిమెట్ల, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, మంగళగిరి, గురజాల, వనస్థలిపురం, విజయవాడ, అమలాపురానికి చెందిన పోలీసులు, హత్య కేసు నిందితులు, ఉపాధ్యాయుల పేర్లు నమోదు చేసుకొన్నాడు. ఏదో ఒక కారణంగా శాఖాపరమైన చర్యలకు గురైన వారిని గుర్తించి తనదైన శైలిలో నమ్మించి తాను చెప్పిన ఖాతాల్లోకి నగదు జమ చేయించుకునేవాడు.

ఆ ఖాతా వివరాలు ఆరా తీస్తే

జేెఆర్‌ పురం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ వివిధ కారణాలతో వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ అశోక్‌బాబుకు నెల రోజుల కిందట రాచపల్లి శ్రీను ఫోన్‌ చేశాడు. విశాఖపట్నం డీఐజీనంటూ... ‘మీరు వీఆర్‌లో ఉన్నారు. మీ సమస్య పరిష్కరిస్తా. రూ.4 లక్షలు నాలుగు విడతలుగా జమ చేయండి’ అని నమ్మబలిలకాడు. అలా చేసిన తరువాత అనుమానం వచ్చిన అశోక్‌బాబు ఆ ఖాతా నంబరుపై ఆరా తీశాడు. అది ఒక పండ్ల వ్యాపారిది. జేఆర్‌ పురం పోలీసులు దర్యాప్తులో భాగంగా బ్యాంక్‌ అకౌంట్‌ ఎవరిదని ఆరా తీయగా... మిగతా విషయాలు బయటకు వచ్చాయి. అలా డొంకంతా లాగడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనును గురువారం శ్రీకాకుళం కొత్త బ్రిడ్జి దగ్గర పట్టుకుని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఓ చరవాణి, రూ.50 వేల నగదు స్వాధీన పర్చుకున్నాడు. చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు.

 మధ్యవర్తిని ఏర్పాటు చేసుకొని..

ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): పాతపట్నానికి చెందిన అనిల్‌కుమార్‌ను విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను విశాఖ కలెక్టరేట్‌లో జేసీ-3గా పని చేస్తున్నానని పలువురిని నమ్మించాడు. సమస్యల్లో ఉన్న వారిని గుర్తించి పరిష్కరిస్తానని డబ్బులు గుంజుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భూముల క్రమబద్ధీకరణ చేయిస్తానని కూడా నమ్మబలికాడు. ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌లో మురళీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. విశాఖ కలెక్టరేట్‌లో జేసీ-3 అని చెప్పుకుంటూ...భూ సంబంధిత సమస్యలతో వచ్చిన బాధితులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మూర్తి అనే మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని డబ్బులు గుంజుతున్నట్లు విచారణలో గుర్తించారు. ఎన్‌ఏడీ కొత్తరోడ్డు సమీపంలో స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు మురళీనగర్‌కు చెందిన బాబ్జీ నుంచి రూ. 2.50 లక్షలు తీసుకొని కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు రంగ ప్రవేశం చేసి అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని వద్ద ఐ.ఎ.ఎస్‌. అని గుర్తింపుకార్డు ఉన్నట్లు సమాచారం. ఇతని బారిన పడిన వారు ఎంతమంది ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. పూర్తి వివరాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.

.అదుపులో ఉన్న అనిల్‌కుమార్‌(దాచిన చిత్రం)

స్వాధీనం చేసుకున్న నగదు, చరవాణి

రివార్డు అందుకుంటున్న జేఆర్‌పురం సీఐ మల్లేశ్వరరావు
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని