Published : 24/02/2021 05:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అగ్రపీఠం ఆమెదే...

కొత్త ఒరవడికి శ్రీకారం

గతంలో ఎక్కడో ఒకచోట మహిళా సర్పంచులు కనిపించేవారు. వాళ్లు ఏం పాలిస్తారులే అంటూ ఎద్దేవా చేసిన వారూ లేకపోలేదు. ఇటువంటి విమర్శలు దాటుకుని కొందరు మహిళలు పాలనలో తమదైన ముద్ర వేసి మిగిలిన వారికి దిశానిర్దేశం చేసిన వారూ ఉన్నారు. అలాంటి వారి స్ఫూర్తితో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్నివర్గాల మహిళలూ పోటీపడ్డారు. ఇందులో యువతులు, గృహిణులు, రైతులు, కూలీలు, వ్యాపారులు, ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు పదవుల్లో చోటు దక్కించుకున్నారు. పల్లె పాలనలో తమదైన ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

అందరికీ ప్రాధాన్యం

‘గ్రామాన్ని బాగుచేసుకోవడానికి, ప్రగతి పథంలో నడిపించేందుకు చదువు వచ్చినా రాకపోయినా ఫర్వాలేదు. మంచి పాలన అందించాలనే తపన, కృషి, పట్టుదల ఉంటే చాలు’ అని తాజా పంచాయతీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. అక్షర సేద్యం తెలియపోయినా సక్రమ పాలన అందించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని నమ్మి జిల్లాలో దాదాపు 226 మంది నిరక్షరాస్యులైన మహిళలకు ఆయా గ్రామస్థులంతా అధికారం కల్పించారు. ఇక ఉన్నత చదువులు చదివి కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించి గ్రామ ప్రథమ మహిళగా మరికొందరు ఎన్నికయ్యారు.

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

జిల్లాలో గ్రామ పంచాయతీ పోరు ముగిసింది.. ఇక విజేతలంతా రానున్న ఐదేళ్లు పాలన సాగించనున్నారు. సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారిలో అన్నివర్గాలకు చెందిన వారు ఉన్నారు.. ముఖ్యంగా మహిళలే అధికశాతం స్థానాలను కైవసం చేసుకున్నారు.. వంటింటికే పరిమితం కాదని మరోసారి నిరూపించుకున్నారు.. ఇంటిని చక్కదిద్దుకోగలిగిన వారు గ్రామాన్ని కూడా ఉన్నతంగా పాలిస్తారని ఆయా గ్రామాల ప్రజలు వనితలకే పట్టం కట్టారు.. కొందరు రిజర్వేషన్‌ తోడుగా, మరికొందరు పురుషులకు ఏమాత్రం తీసిపోమంటూ పోటీలో నిలిచి, ప్రజాదరణతో పదవులు దక్కించుకున్నారు.. మొత్తం సర్పంచ్‌ స్థానాల్లో 671 స్థానాలను మహిళామణులే దక్కించుకున్నారు.

తక్కువ వయసైనా..

గ్రామ సర్పంచులుగా ఎన్నికైన వారిలో అన్ని వయసుల మహిళలూ ఉన్నారు. మొత్తం 671 లో 221 మంది వయసు 35 సంవత్సరాల లోపే ఉండడం గమనార్హం. యువత రాజకీయాల వైపు చూస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచుల్లో 206 మంది మధ్య వయస్కులు ఉన్నారు. మిగిలిన వారు 50 సంవత్సరాలకు పైన వారే.

సమస్యలు తీర్చేందుకు కృషి

నాపేరు పులిటి గౌరమ్మ. మాది వీరఘట్టం మేజరు పంచాయతీ. నా వయసు 70 ఏళ్లు. ఈ వయసులో తొలిసారి పోటీ చేస్తే ప్రజలంతా ఆశీర్వదించి సర్పంచిని చేశారు. నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయను. చదువు లేకపోయినా ఏదైనా చేయగలననే నన్ను నమ్మారు. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న నేను ప్రజా సమస్యలపై దృష్టిపెడతాను.

సదుపాయాలు కల్పిస్తా

నా పేరు బొడ్డు శాంతిప్రియ. మందస మండలం బహాడపల్లి పంచాయతీ పరిధిలో మాది ఓ చిన్న గ్రామం బహాడపల్లి. పంచాయతీలోని ఓటర్లలో మా గ్రామంలో నాలుగోవంతు ఉండరు. నా వయసు 24 ఏళ్లు. గ్రామస్థుల ఆమోదంతో పోటీ చేశాను. రెండు గ్రామాల ప్రజలు నన్ను ఆదరించి గెలిపించారు. పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా. జీవితంలో గుర్తుండిపోయేలా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాను.


వృత్తి పరంగా...చదువుకుంటున్న  వారు 252

రైతులు  357

గృహిణులు  12

ఉద్యోగులు 48

వ్యాపారులు 14


విద్యార్హతలు ఇలా..

పదో తరగతి లోపు: 346

ఇంటర్‌: 37 డిగ్రీ: 41

డిగ్రీ పైన: 21

నిరక్షరాస్యులు: 226

ఎన్నికైన మొత్తం సర్పంచ్‌లు: 1164

వారిలో మహిళలు: 671

వయసుల వారీగా..

35 లోపు: 221

35-50 మధ్య: 264

50కి పైన: 186


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని