ఇక్కడి పేరు.. సరకు వేరు..
logo
Published : 17/05/2021 06:13 IST

ఇక్కడి పేరు.. సరకు వేరు..

 ‘పలాస’ బ్రాండ్‌తో ఇతర ప్రాంతాల జీడి పప్పు

 70 శాతం బయట నుంచే వ్యాపారం

 నష్టపోతున్న ఉద్దానం రైతులు

న్యూస్‌టుడే, కాశీబుగ్గ


పలాసలోని కర్మాగారంలో ఇతర ప్రాంతాలకు చెందిన జీడి పిక్కల్ని ఆరబోస్తున్న కార్మికులు

జిల్లాలోని ఉద్యాన పంటల్లో ప్రధానమైన పంట జీడి. జిల్లాలో సుమారు 30వేల హెక్టార్లలో ఈ పంట సాగవుతోంది. ఒక్క ఉద్దానం ప్రాంతంలోనే సుమారు 25 వేల హెక్టార్లలో పంట ఉంది. ఇక్కడ సారవంతమైన భూములు, సముద్రతీరానికి చేరువలో ఉండటంతో స్థానిక జీడి పప్పునకు రుచి ఎక్కువ. అందుకే పలాసకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి. అలాంటిది గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం పేరుతో ఇతర ప్రాంతాల సరకును తీసుకొచ్చి విక్రయాలు చేపడుతున్నారు వ్యాపారులు.

బయట సరకైతే తక్కువ ధర..

మే, జూన్‌ నెలల్లో ఉద్దానం పిక్కలు కొనుగోలు చేస్తుంటారు. గత కొన్నేళ్లుగా మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. స్థానిక పిక్కలు 80 కిలోల బస్తా రూ.16 వేలకు కొనుగోలు చేయాలని విన్నవిస్తున్నా అది రూ.10 వేలకు దాటడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి బస్తా రూ.8 వేలకే దొరుకుతుండటంతో వ్యాపారులు వాటి పైనే దృష్టిపెడుతున్నారు. గత అక్టోబర్‌ నుంచి ఇతర దేశాల నుంచి కూడా పిక్కల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఘానా, నైౖవరీకోస్ట్‌, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ఏడాదిలో సుమారు 8 నెలలకు కావాల్సిన సరకు దిగుమతి చేస్తున్నారు. ఇదంతా పలాస ప్రాంత పప్పు పేరుతోనే ఇక్కడ మార్కెటింగ్‌ జరుగుతోంది.

ఉద్దానం ప్రాంతంలో పండిన పంటకు పలాస కేంద్రంగా ఉండే కర్మాగారాల ద్వారా పప్పు ఉత్పత్తి అవుతుంది. అందుకే సుమారు 80 ఏళ్లుగా పలాస పప్పునకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఇతర ప్రాంతాల జీడి పిక్కలతో తయారుచేసిన పప్పును పలాస బ్రాండ్‌తో విక్రయిస్తున్నారు. ఇక్కడ ఏడాదిలో జరిగే వ్యాపారాలకు సంబంధించి 70 శాతం వరకు ఇతర ప్రాంతాలకు చెందిన పిక్కలనే వినియోగిస్తున్నారు. ఏటా ఏప్రిల్‌లో విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశా ప్రాంతానికి చెందిన పిక్కల్ని ఇక్కడి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

కనీస చలనం లేదు

జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించాలని ఎన్నిసార్లు విన్నవించినా కనీస చలనం లేదు. ఈ ప్రాంత పిక్కలు కొనుగోలు చేయకుండా వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి, ఉద్దానం రైతులకు న్యాయం చేయాల్సిఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలి. - వి.మాధవరావు, జిల్లా కార్యదర్శి, అఖిలభారత రైతుకూలీ సంఘం

ఇక్కడి వారికి తీరని అన్యాయం

పలాస పేరుతో ఇతర ప్రాంతాలకు చెందిన పిక్కలకు సంబంధించిన పప్పు మార్కెటింగ్‌ జరుగుతుండటంతో ఉద్దానం ప్రాంత రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఏడాదిగా కుటుంబమంతా ఈ పంట పైనే ఆధారపడి సాగు చేసినా ఎకరాకు 4 బస్తాల దిగుబడి కూడా రాని పరిస్థితి. దీంతో పాటు తక్కువ ధర ఉంటుంది. మరోవైపు కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇలా ఇతర ప్రాంతాలకు చెందిన జీడి పప్పునకు ‘పలాస’ బ్రాండ్‌ను ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు కనీస మద్దతు ధర అయినా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

మద్దతు ధర ప్రకటించాలి

ఈ ఏడాది మద్దతు ధర ప్రకటించాలి. 80 కిలోల బస్తాకు రూ.16 వేలు చెల్లించాలి. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మాకు ఈ జీడి పంటే ఆధారం. అలాంటి పంటకు కనీస మద్దతు ధర లేకపోతే ఎలా బతకాలి.

- కామేశ్వరరావు, ఎం.గడూరు, వజ్రపుకొత్తూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని