ఆయువు నిలిపేందుకు...వాయువు అందిస్తూ...
logo
Published : 17/05/2021 06:14 IST

ఆయువు నిలిపేందుకు...వాయువు అందిస్తూ...

కొవిడ్‌ సమయంలో ఆదుకుంటున్న దాతలు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే

● అండగా ఉద్దానం ఫౌండేషన్‌...: ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఉద్దానం ఫౌండేషన్‌ కొవిడ్‌ బాధితులకు అండగా నిలుస్తోంది. విపత్కర సమయంలో కిడ్నీ రోగులు డయాలసిస్‌ చేయించుకునేందుకు, కొవిడ్‌ బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చేందుకు సోంపేట, ఇచ్ఛాపురం తహసీల్దార్‌ కార్యాలయాలకు ఒక్కో అంబులెన్సును ఇచ్చింది. చికిత్స పొందుతున్నవారికి సొంత ఖర్చులతో నాణ్యమైన వైద్యం ఇప్పిస్తున్నారు. కొవిడ్‌తో పెద్దదిక్కును కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్నారు.

కొవిడ్‌ బాధితులను ప్రాణవాయువు కొరత కలవరపెడుతోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు దొరక్క పలువురు అల్లాడుతున్నారు. సకాలంలో ఆక్సిజన్‌ అందక కొందరు ప్రాణాలొదుతున్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు కొన్ని మనసులను కదిలించాయి. ఆపద వేళ బాధితులకు బాసటగా నిలిచేందుకు ముందుకు కదిలాయి. రోగులను తరలించేందుకు ఆక్సిజన్‌ సదుపాయం కలిగిన అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల అందించి ప్రాణాలను నిలుపుతున్నాయి.

కలెక్టర్‌కు అంబులెన్సులను అందజేస్తున్న ఉద్దానం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, కన్వీనర్‌ పిరియా సాయిరాజ్‌, విజయ

● కలెక్టర్‌ పిలుపుతో..: స్వచ్ఛంద సంస్థలు, దాతలు చొరవ తీసుకుని కరోనా బాధితుల ప్రాణాలను కాపాడాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రాణవాయువును అందించేందుకు పలువురు ముందుకొస్తున్నారు. నాగార్జున అగ్రికెం కంపెనీ శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో రూ.25 లక్షల నిధులతో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. అది పూర్తయితే గంటకు 40 వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. విశాఖపట్నానికి చెందిన నేవల్‌ కమాండ్‌ అధికారులు 12 ఆక్సిజన్‌ పడకలను సమకూర్చారు.

● కేవీఎస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో...: ఇచ్ఛాపురానికి చెందిన కాధా వెంకటరమణమ్మ, సాంబమూర్తి(కేవీఎస్‌) ట్రస్టు తరఫున 10 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమకూర్చారు. వాటిలో రెండింటిని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి ఇచ్చారు. మిగిలిన 8 ట్రస్టులో ఉంచారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులకు వీటిని అందిస్తున్నారు. సాంబమూర్తి పెద్ద కుమారుడు దిల్లీ ఎయిర్‌పోర్టు ఎండీ కాధా నారాయణరావు వీటి కోసం ఆర్థిక సాయం చేశారు. రోటరీ క్లబ్‌ కార్యదర్శి కాధా రామకోటి క్లబ్‌ తరఫున అంతిమయాత్ర వాహనం ఏర్పాటు చేశారు.

● సేవ చేయాలనే దృక్పథంతో...: సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు కరోనా బాధితులకు ప్రాణవాయువు అందించాలి, తోటి వారికి సేవ చేయాలనే దృక్పథంతో 18 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం పాలకొండ, రాజాం, కొత్తూరు, టెక్కలి, సీతంపేట మండలాల్లో అయిదింటిని అందుబాటులో ఉంచారు. ఈ నెల 20న మిగిలిన 13 కాన్సంట్రేటర్లు జిల్లావ్యాప్తంగా అన్ని సేవా సమితుల్లో ఉంచనున్నారు. దీంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు ఆహార పొట్లాలు. నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు.

● ఆసుపత్రికో సిలిండర్‌..: ఎచ్చెర్లకు చెందిన రాజకీయ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు నియోజకవర్గ పరిధిలో 8 పీహెచ్‌సీలు, రణస్థలం సీహెచ్‌సీకి ఒక్కో ఆక్సిజన్‌ సిలిండర్‌ను అందించారు. ఖాళీ అయిన వెంటనే వాటిని మళ్లీ నింపిస్తున్నారు. ఆర్‌ఎంపీ వైద్యులకు 300 పీపీఈ కిట్లు అందజేశారు. ఇటీవల జి.సిగడాం మండలం కొయ్యపేట గ్రామానికి చెందిన అసిరినాయుడు కరోనా సోకి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులకు తనవంతుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేసి, పిల్లలను చదివించే బాధ్యతను స్వీకరించారు. నియోజకవర్గంలో ఎవరికైనా ప్రాణవాయువు అవసరమైతే 94404 36426, 90006 40632, 80745 49413, 94944 36375, 83745 59947 హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదిస్తే డోర్‌ డెలివరీ చేస్తున్నారు.

● వైద్యుని దాతృత్వం..: రోగుల నాడి తెలిసిన కంచిలికి చెందిన వైద్యులు రంగాల జయప్రకాశ్‌రెడ్డి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి రెండు ఆక్సిజన్‌ సిలిండర్లతో కూడిన అంబులెన్స్‌లను అందించారు. అత్యవసరంగా ఎవరికైనా ఆక్సిజన్‌ కావాలంటే ఉచితంగా తన ఇంటివద్ద అందజేస్తున్నారు. రోగులకు అవసరమైన తక్షణ వైద్యం, సూచనలు అందిస్తూ వారికి ఊపిరిపోస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని