ప్రయాణికులతో సానుకూలంగా వ్యవహరించండి
logo
Published : 24/06/2021 05:57 IST

ప్రయాణికులతో సానుకూలంగా వ్యవహరించండి

● సరకు రవాణాతో మంచి ఫలితాలు

● ఆర్టీసీ ఎండీ తిరుమలరావు

మాట్లాడుతున్న ఆర్టీసీ ఎండీ తిరుమలరావు

అరసవల్లి, న్యూస్‌టుడే: ప్రయాణికులతో సిబ్బంది సానుకూలంగా వ్యవహరించాలని ఆర్టీసీ ఎండీ సి.హెచ్‌.ద్వారక తిరుమలరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలోని రెండో డిపోను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో కార్గోలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఆదాయం వచ్చే రూట్లలో బస్సు సర్వీసులను పెంచాలని సూచనలు చేశారు. కొవిడ్‌ సమయంలో విజయనగరం 85 శాతం కార్గో ఆదాయాన్ని సాధించిందన్నారు. ప్రజారవాణా పరంగా భారీగా నష్టాలు వచ్చాయన్నారు. సిబ్బంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో కార్గో ఆదాయం అధికంగా తీసుకొచ్చిన డిప్యూటీ సీటీఎం వరలక్ష్మి, ఒకటో డిపో డీఎం ప్రవీణ, రెండో డిపో డీఎం కవిత, పలాస డిపో డీఎం శ్రీనివాసరావుకు పురస్కారాలు అందజేశారు.

వినతి పత్రాల అందజేత: వర్షపునీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు బి.కృష్ణమూర్తి, నానాజీ, త్రినాథ్‌, ఎస్‌వీ రమణ, బాబురావు ఎండీకి తెలిపారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. శ్రీకాకుళం నుంచి ఎక్కువగా ప్రయివేట్‌ బస్సులు తిరగడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోందని చెప్పారు. రాజాం బస్‌స్టేషన్‌ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆర్టీసీ ఆసుపత్రిలో మహిళ వైద్యురాలిని నియమించాలని, తూర్పు గోదావరి జిల్లాలో పని చేస్తున్న నెక్‌ రీజియన్‌ సిబ్బందిని వెనక్కి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బ్రహ్మనందరెడ్డి, రవికుమార్‌, ఆర్‌ఎం ఎ.అప్పలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని