సర్వర్  పనిచేయదు... సమస్య తొలగదు 
eenadu telugu news
Published : 27/07/2021 03:31 IST

సర్వర్  పనిచేయదు... సమస్య తొలగదు 

క్రయ విక్రయదారులకు తప్పని ఇక్కట్లు
శ్రీకాకుళం రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద రద్దీ

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాలను సాంకేతిక సమస్య వేధిస్తోంది. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు 14 చోట్ల గతవారం రోజులుగా సర్వర్‌ మొరాయిస్తూనే ఉంది. ఫలితంగా క్రయవిక్రయాలు సాగడం లేదు. హైదరాబాద్‌లోని ప్రధాన సర్వర్‌ మంగళగిరి ప్రాంతానికి తరలించడంతోనే ఈ సమస్య తలెత్తింది. అది ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో పూర్తి స్థాయిలో సేవలందించలేని పరిస్థితి నెలకొంటోంది.

జిల్లాలో నిత్యం స్థిరాస్తి, చరాస్తి విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నిత్యం పదుల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుంటాయి. విశాఖపట్నం, విజయనగరం, ఒడిశా రాష్ట్రం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా క్రయవిక్రయాలకు ఎంతో మంది వస్తుంటారు. అంతా బాగున్నప్పుడే దరఖాస్తులు పూర్తి చేయడం అధికారులకు కత్తి మీద సాములా ఉండేది. దీనికి తోడు సిబ్బంది కొరత, సాంకేతిక ఇబ్బందులతో అంతా మరింత ఇబ్బంది పడుతున్నారు.

నిరీక్షణలో ఎన్నో దస్త్రాలు... శ్రీకాకుళంలోని కార్యాలయంలో సాధారణంగా రోజుకు 30-40 వరకు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేసేవారు. మిగతా ప్రాంతాల్లో రోజుకు 10 నుంచి 15 వరకు క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. గత వారం రోజుల నుంచి సర్వర్‌ పని చేయకపోవడంతో నేటి వరకు 11 వందల వరకు దస్త్రాలు నిరీక్షణ జాబితాలో ఉండిపోయాయని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గత నెల 12 నుంచి 22వ తేదీ వరకు 2450 క్రయ విక్రయాలు జరిగాయి. ఈ నెల 12 నుంచి 22 వరకు మాత్రం 1,616 దస్త్రాలే లెక్కల్లోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా రైటర్ల వద్ద ఎన్నో డాక్యుమెంట్లు నిరీక్షిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పడుతున్న తరుణంలో పెరగాల్సిన క్రయవిక్రయాల సంఖ్యకు సాంకేతిక సమస్య అడ్డంకిగా మారింది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందోనని ఆ శాఖ ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. 

ఉన్నతాధికారులకు విన్నవించాం... ప్రధాన సర్వర్‌ మార్పు చేసిన కారణంగా సమస్య తలెత్తింది. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. దానికి కారణంగా జిల్లాలో క్రయవిక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు విన్నవించాం. మరికొద్ది రోజుల్లో సర్వర్‌ పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

 - ఆర్‌.సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్‌, శ్రీకాకుళం 

   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని