నగర శివారులో దారుణ హత్య!
eenadu telugu news
Updated : 27/07/2021 04:54 IST

నగర శివారులో దారుణ హత్య!

మృతుడు విశ్రాంత ఆర్మీ ఉద్యోగి..

చౌదరి మల్లేశ్వరరావు (దాచిన చిత్రం)

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగర శివారులో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన చౌదరి మల్లేశ్వరరావు(49) ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం శ్రీకాకుళం నగర శివారు ప్రాంతం సీపాన్నాయుడుపేటలో కుటుంబంతో కలసి నివాసముంటున్నారు. సింహద్వారం వద్ద మీ-సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సోదరుడిని విజయవాడ బస్సు ఎక్కించి ఇంటికి తిరిగొచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఎక్కడి నుంచో చరవాణికి ఫోన్‌ వచ్చింది. ఇప్పుడే వస్తానని భార్యతో చెప్పి బయటకెళ్లారు. ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానిక యువకులు గాలించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ యువకులకు నగర శివారులోని విజయాదిత్య పార్కులోని ఓ సిమెంట్‌ దిమ్మపై మల్లేశ్వరరావు విగతజీవిగా కనిపించారు.. వెంటనే వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఒంటిపైన తీవ్రమైన గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. డాగ్‌స్వ్కాడ్‌, క్లూస్‌టీం నిపుణులు వేలిముద్రలు సేకరించారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ ఈశ్వరప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆ ఫోన్‌ కాల్‌ ఎవరిదో.. మల్లేశ్వరరావు ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం నివాసముండే ప్రాంతంలో కూడా అందరితోనూ సరదాగా ఉండేవారు. మంచివానిగా పేరుంది. ఆదివారం ఎక్కడి నుంచి ఫోన్‌ వచ్చిందో కాని ఇంటినుంచి బైక్‌పై బయటకు వెళ్లారు. విజయాదిత్య పార్కు సమీపంలోని ఓ స్నేహితుడి ఇంటివద్ద ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్‌ చేశారు. అనంతరం ఏం జరిగిందో.. ఏమో.. విగతజీవిగా మారిపోయారు. కాగా ఆ ఫోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. స్నేహితుడి ఇంటివద్ద ద్విచక్రవాహనాన్ని పార్కింగ్‌ చేసిన కొద్ది సేపటికే హత్య జరగడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంటిని డీఎస్పీ ఎం.మహేంద్ర పరిశీలించి వివరాలు ఆరాతీశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని