చూస్తే తాగగలమా..?
eenadu telugu news
Published : 27/07/2021 04:44 IST

చూస్తే తాగగలమా..?

పట్టణాల్లో మురుగు కాలువల్లోనే నీటి పైపులైన్లు

పట్టించు కోని పుర యంత్రాంగం 

 వర్షాలకు జలాలు కలుషితం 

-న్యూస్‌టుడే, పాలకొండ, రాజాం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నగరం, పలాస, ఆమదాలవలస గ్రామీణం

మురుగు కాలువల్లో తాగునీటి పైపులైన్లు, గోతుల్లో కుళాయిలు, తుప్పుపట్టిన గొట్టాలు వెరసి పలు పట్టణాల్లో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.. ఫలితంగా పట్టణ ప్రజలను వ్యాధుల బారిన పడేలా చేస్తోంది.. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రోగాలు ఇట్టే చుట్టుముడతాయి.. ఇందుకు ప్రధాన కారణం తాగునీరేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.. ఇటు శుద్ధమైన నీరు అందిస్తున్నామని అధికారులు చెబుతుంటారు.. వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే ఎన్నో లోపాలు కనిపిస్తాయి. ఏళ్లతరబడి ఇవే సమస్యలు వేధిస్తున్నా తూతూమంత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. జిల్లాలోని నగర, పురపాలికల్లో నీటి సరఫరా వ్యవస్థను ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా అనేక లోపాలు కనిపించాయి. మరి వీటి ద్వారా వచ్చే నీళ్లు ఎలా తాగాలో యంత్రాంగమే ఆలోచించాలి.. స్పందించాలి.. సమస్యను సరిదిద్దాలి..  

జిల్లాలోని ప్రధాన పట్టణాలు శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, పాలకొండ, రాజాం. అధిక శాతం జనాభా ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఏటా పురాలు విస్తరిస్తున్నా సౌకర్యాలు మాత్రం అంతంతం మాత్రంగా ఉంటున్నాయి. నిర్వహణ లోపాలు ఇక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా శుద్ధమైననీరు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. చాలా పట్టణాల్లో నీటి వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు తప్పలేదు. ఏళ్లనాటి పైపులైన్లు, మురుగునీరు వెళ్లే మార్గంలోనే ఉండటం మరింత ఆందోళనకరం. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు అన్నీ ముంపులోనే. అవి మంచివో, కలుషిత నీళ్లో తెలియని పరిస్థితి.  


శ్రీకాకుళం

భైరివానిపేట వద్ద ఈ చిత్రం. మురుగు కాలువలో అడ్డంగా ప్రధాన పైపులైను ఏర్పాటు చేశారు. ఏళ్లతరబడి ఇదే దుస్థితి. మురుగునీటిని ఈ పైపే ఆపుతుంది. ఆక్కడే నిల్వ ఉంటుంది.  దీనివల్ల నీరు కలుషితమయ్యే అవకాశమూ ఉంది.
* నగరంలో 32,852 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆదివారంపేట ప్రధాన నీటి సరఫరా కేంద్రం నుంచి అరసవల్లి రిజర్వాయరుకు నీటిని సరఫరాచేసే ప్రధాన పైపులైను ఇల్లీసుపురం వద్ద వాల్వులో నీరు నిల్వ ఉండి మురుగు కాలువలో కలుస్తోంది. పుణ్యపువీధి, ఇల్లీసుపురం, రెల్లి,  సానా, కొన్నా, జాలరి, దమ్మల, పుణ్యపు, బలగ, పొందర, మేదర, పాండురంగ, ఇప్పిలి, కత్తెర, చిన్నబరాటం, గొల్ల, గుడివీధులు,  గూనపాలెం, బలగ, హడ్కోకాలనీ, రైతుబజార్‌, వన్‌వేట్రాఫిక్‌ రహదారి, హయతీనగరం, గుజరాతీపేటలో అధిక శాతం పైపులైన్లు మురుగుకాలువలోనే ఉన్నాయి.


ఇచ్ఛాపురం

* గాంధీపార్కు సమీపంలో మురుగుకాలువలో ప్రధాన పైపును ఏర్పాటుచేశారు. ఏ మాత్రం లీకేజీ ఏర్పడినా వందల ఇళ్లకు వెళ్లే రక్షిత నీరు కలుషితమయ్యే అవకాశాలున్నాయి. ఇచ్ఛాపురంలో ప్రధానంగా గాంధీపార్కు, డబ్బూరి, కలెక్టర్‌, కస్పావీధి తదితర ప్రాంతాల్లో నీటి గొట్టాలు మురుగుకాలువల్లో కనిపిస్తున్నాయి.


రాజాం

దూలపేట ఇంటి కుళాయి పైపులైను మురుగుకాలువ పైనే ఏర్పాటు చేశారు. వర్షం పడినప్పుడు నీరు కలుషితమయ్యే అవకాశముంది. సాయిశరణ్య నగర్‌, వాసవీకాలనీ, గాంధీనగర్‌లో కొన్నిప్రాంతాల్లో మురుగుకాలువల మీదుగా పైపులైన్లున్నాయి.


పలాస

ఇందిరాచౌక్‌ ప్రాంతంలో వాల్వు మురుగులోనే ఉంది. మురుగునీరు వాల్‌్్వలోకి వెళ్లే అవకాశముంది. పలాస- కాశీబుగ్గ పట్టణ పరిధిలో హడ్కో, రాజమ్మ కాలనీలు, శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతాల్లో ఇంటింటా గోతులు తవ్వి నీటిని పట్టుకుంటున్నారు. వర్షం పడితే గుంతల్లో చేరుతున్న బురద పైపుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది.


పాలకొండ

కుమ్మరివీధి శివారున కాపువీధులకు వెళ్లే రహదారిలోనిదీ చిత్రం. ఏళ్లుగా రక్షిత కుళాయిలకు తాగునీరు ఇలా మురుగుకాలువల నుంచే పైపుల ద్వారా సరఫరా అవుతోంది.  

పాలకొండ పట్టణంలో 20 వార్డులకు నాలుగు రక్షిత పథకాల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఇందులో కిలోమీటరు మేర మురుగుకాలువల్లోనే పైపులు ఉన్నాయి. శెగిడి, గటాలడెప్పి, నాగవంశం, భారతమ్మ, జెట్టివారి, వెంకంపేట, యాత, లోగిడి, రామకళామందిర్‌ వీధులతో పాటు మరో 20 ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.


ఆమదాలవలస

వన్‌వే సెంటర్‌ కండ్రపేటలో వివిధ ప్రాంతాలకు తాగునీరు అందించే పైపులు ఇలా మురుగు కాలువలో ఏర్పాటు చేశారు.

ఆమదాలవలస పురపాలిక పరిధిలో 27 వార్డులకు నీటి సరఫరా పైపులు ఏర్పాటు చేశారు. 31 మురికివాడలను గుర్తించారు. కండ్రపేట, ఐజేెనాయుడు, వాంబే, హడ్కో, వెంగళరావుకాలనీలు, అక్కివలస, మెట్టక్కివలస కండ్రపేట, పంతులుపేట, జగ్గుశాస్త్రులపేటలతో పాటు మరి కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ చాలాచోట్ల మురుగుకాలువల నుంచే తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. వర్షం కురిస్తే చాలు పైపులు పూర్తిగా మునిగిపోతుంటాయి.


నిర్వహణ అంతంతే...

* తాగునీటి రిజర్వాయర్లను రెండు నెలలకోసారైనా శుభ్రం చేయాల్సి ఉండగా అది నామమాత్రంగానే ఉంది.
రోజూ క్లోరినేషన్‌ స్థాయిని పరీక్షించి సురక్షితమని తేలితేనే సరఫరా చేయాలి. కుళాయిల్లో వచ్చే నీటిని కూడా పరీక్షించాలి.
* అనేకచోట్ల పైపులైన్లు లీకులు దర్శనమిస్తున్నా వాటికి మరమ్మతులు చేసేవారు కనిపించడం లేదు.


కలిగే అనర్థాలు ఇవీ...

లుషిత నీళ్లు  తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని శస్త్రచికిత్స వైద్యనిపుణులు డీవీ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రధానంగా అతిసారం ప్రబలే అస్కారం ఉందన్నారు. పచ్చకామెర్లు సోకే ప్రమాదం ఉందన్నారు. దీర్ఘకాలంగా ఇటువంటి జలాలు  తాగడం వల్ల జీర్ణకోశ సంబంధ వ్యాధులు సోకుతాయన్నారు. వీటికి గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదురవుతాయన్నారు. కలుషితమయ్యే తాగునీరు ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు.


ఆ బాధ్యత కమిషనర్లదే..

సురక్షితమైన తాగునీరు సరఫరా చేసే బాధ్యత ఆయా పురపాలిక, నగర పంచాయతీ కమిషనర్లదే. కాలువల్లో రక్షిత పైపులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రణాళిక ప్రకారం సురక్షిత నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై మరోసారి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తాం.

- కె.రమేష్‌, ఆర్డీ, పురపాలకశాఖ, విశాఖపట్నంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని