కన్నీళ్లను దిగమింగుతూ.. కాలానికి ఎదురీదుతూ..
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

కన్నీళ్లను దిగమింగుతూ.. కాలానికి ఎదురీదుతూ..

సరస్వతీ పుత్రుడికి విధి పరీక్ష

న్యూస్‌టుడే, టెక్కలి, సంతబొమ్మాళి


తల్లికి భోజనం తినిపిస్తున్న రాంబాబు

పేదరికం ఆ కుర్రాడికి కొత్తకాదు. అయినా అమ్మ గోరుముద్దలు పెడుతూ చిన్నతనంలో చెప్పిన చదువు విలువను తెలుసుకున్నాడు. సరస్వతీ పుత్రుడిగా తనదైన ప్రతిభ కనబర్చాడు. పేదింట్లో పుట్టిన వారికి ఇంత ప్రతిభ ఏమిటని కాలానికి కన్ను కుట్టిందేమో వరుసగా కఠిన పరీక్షలు పెట్టింది. కొవిడ్‌తో తండ్రిని కోల్పోయిన ఆ కుర్రాడికి పక్షవాతం బారిన పడిన తల్లి బాధ్యతను భుజాన వేసుకుని కాలానికి ఎదురీదుతున్నాడు. తండ్రి లేక, తల్లి కదలలేక అచేతన స్థితిలో ఉండగా విడవ లేక, దైన్య స్థితిని అధిగమిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడు. సంతబొమ్మాళికి చెందిన కొయ్యాన రాంబాబు యదార్థ వ్యథ గాథ ఇది.

సంతబొమ్మాళి వెలమ వీధిలో నివసిస్తున్న కొయ్యాన రాంబాబు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయి 20వ ర్యాంకు సాధించాడు. అంతకుముందు మహాత్మా జ్యోతిబా ఫులే జూనియర్‌ కళాశాల ప్రవేశ పరీక్ష లోనూ 20వ ర్యాంకును సాధించాడు. రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ఉన్నత ప్రతిభను కనబరుస్తున్న రాంబాబుకు విధి పెడుతున్న పరీక్షలను మాత్రం అధిగమించడం కష్టంగా మారుతోంది. తండ్రి సూర్యనారాయణది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆ ఇంటి పెద్ద కొవిడ్‌తో ఇటీవల మృతిచెందడం తీరని వేదననే మిగిల్చింది. రెండేళ్ల క్రితమే తల్లి చిన్నమ్మడు పక్షవాతం బారిన పడటంతో ఆమె ఆలన, పాలన రాంబాబు పైనే పడింది. తల్లి వైద్యం కోసం తండ్రి చేసిన రూ.2లక్షల అప్పు బాధ్యత సైతం తనపై పడటంతో రాంబాబు తన ముందున్న అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకోలేని స్థితి. రోజు కూలీగా మారాల్సిన పరిస్థితి ఎదురైంది. గ్రామంలో కూలి పనులకు వెళ్తూ కొంత సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతూ కాలం గడుపుతున్నాడు. కొన్నిసార్లు పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెమర్చిన కళ్లతో చెబుతున్న ఆ సరస్వతీ పుత్రుడి గుండె రోదన విన్నవారు ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే. ఉన్నత లక్ష్యాలను సాధించగల సామర్థ్యం ఉన్న విద్యార్థి ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను అందుకునే అవకాశం ఓవైపు కంటికిరెప్పలా కనిపెంచిన తల్లి ఆరోగ్యం కాపాడుకోవడం మరోవైపున ఎదుర్కొంటున్న రాంబాబుకు అండగా నిలవాల్సిన బాధ్యత సమాజంపైనే ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని