ఆదరిస్తే ఆడేస్తారు...!
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

ఆదరిస్తే ఆడేస్తారు...!

జిల్లాలో కరవైన బ్యాడ్మింటన్‌ శిక్షకులు

వసతులు కల్పించాలంటున్న క్రీడాకారులు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

శ్రీకాకుళంలోని ఇండోర్‌ స్డేడియంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో తలపడుతూ...

ఒలింపిక్స్‌లో తెలుగు బిడ్డ పి.వి.సింధు రెండు సార్లు రెండు పతకాలతో సత్తా చాటింది. అలుపెరగని సాధనతో ప్రపంచస్థాయిలో పోరాడి ఆదర్శంగా నిలిచింది. ఆ స్ఫూర్తితో జిల్లా నుంచీ ఎంతో మంది క్రీడాకారులు బ్యాడ్మింటన్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. అదే తరహాలో రాణించాలనే ఆసక్తితో ముందుకు సాగుతున్నారు. కానీ వారికి తగిన ప్రోత్సాహమే అందట్లేదు. శిక్షకులు లేక...అరకొర వసతులతో ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయంలో తమకూ తోడ్పాటునందిస్తే ఆస్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంటామంటున్నారు సిక్కోలు క్రీడాకారులు.

జిల్లా వ్యాప్తంగా 5 ప్రభుత్వ, 4 ప్రయివేటు ఇండోర్‌ స్డేడియంలు ఉన్నాయి. కానీ ఎక్కడా బాడ్మింటన్‌ శిక్షకులు లేరు. శ్రీకాకుళం నగరంలో రూ.2 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇండోర్‌ మైదానమూ నిరుపయోగంగా ఉందని క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సాహించాల్సిన జిల్లా క్రీడాప్రాధికార సంస్థ పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని వాపోతున్నారు. క్రీడాపరికరాలు, వసతులు సమకూర్చకపోవడంతో పేదక్రీడాకారులకు బ్యాడ్మింటన్‌ అందని ద్రాక్షలా మారిపోతోందని ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వ తోడ్పాటు అవసరం...

రాష్ట్ర, జాతీయస్థాయి సంఘాలకు కార్యదర్శిగా పని చేసిన మాజీ డీఎస్‌డీవో పున్నయ చౌదరి జిల్లాలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడను అభివృద్ధి చేశారు. పల్లెల నుంచీ ఎంతో మంది షటిల్‌ రాకెట్‌ పట్టుకునేలా కృషి చేశారు. కె.విక్రాంత్‌కుమార్‌, బమ్మిడి వెంకటేశ్‌, కె.పి.చైతన్య, టి.హేమనాగేంద్రబాబు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను క్రీడాలోకానికి పరిచయం చేశారు. ప్రస్తుత తరుణంలో జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ క్రీడాకారులకు కొంత అండగా నిలుస్తుండటం ఊరటనిస్తోంది. ఏటా విభాగాల వారీగా పోటీలు నిర్వహిస్తూ, రాష్ట్రస్థాయిలో రాణించినవారికి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వమూ వసతులు, ఆర్థిక పరంగా తోడ్పాటు అందిస్తే బాగుంటుందని అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.


ప్రతిభను వెలికితీయడంతోనే విజయం...

నా పేరు మాడుగుల శేషు. మాది కవిటి గ్రామం. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాను. అయిదేళ్లుగా బ్యాడ్మింటన్‌ సాధన చేస్తున్నాను. ప్రస్తుతం చిట్టూరి సుబ్బారావు గోపిచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో మెలకువలు నేర్చుకుంటున్నారు. 2019లో విజయనగరం, ఒంగోలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచాను. 7 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. దేశానికి గర్వకారణమైన పీవీ సింధులోని ప్రతిభను వెలికితీయడంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఆమె స్ఫూర్తితో ముందుకుసాగుతున్నాను.


తప్పకుండా పతకం సాధిస్తా...

నా పేరు మాదిన శ్రీకర్‌. మాది కంచిలి మండలం శ్రీరాంపురం. డిగ్రీ చదువుతున్నాను. ఖమ్మం శాప్‌ అకాడమీలో 8 ఏళ్ల కిందట శిక్షణ ప్రారంభించాను. ప్రస్తుతం ప్లేమాక్స్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఇండోనేషియా శిక్షకుడు యూసఫ్‌ జుహారి వద్ద రోజుకు 6 గంటల పాటు సాధన చేస్తున్నాను. సబ్‌ జూనియర్‌ విభాగంలో 6 సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచాను. మరింత ప్రోత్సాహం అందిస్తే తప్పకుండా పతకం సాధిస్తాను.


ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారు...

జిల్లాలో బ్యాడ్మింటన్‌ క్రీడాభివృద్ధికి అసోసియేషన్‌ తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో 40 మందికి ఉచితంగా మెలకువలు నేర్పుతున్నాం. ఏటా పోటీలు నిర్వహించి, ఎంపికైన వారిని శిక్షణ శిబిరాలకు పంపుతున్నాం. ఇలాంటివారు జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. తగిన ప్రోత్సాహం ఉంటే మరింత రాణిస్తారు.

- కిల్లంశెట్టి సాగర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బ్యాడ్మింటన్‌  అసోసియేషన్‌, ఉపాధ్యక్షుడు

 


శిక్షకుల నియామకానికి కృషి...

జిల్లాలో 5 ఇండోర్‌ మైదానాలు ఏర్పాటు చేశాం. వాటిల్లో బ్యాడ్మింటన్‌ శిక్షకులు లేని మాట వాస్తవమే. రాజాం, కవిటి, పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, తదితర గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ శిక్షకుల కొరత ఉండటంతో ఇతర ప్రాంతాల్లోని అకాడమీల్లో తర్ఫీదు పొందుతూ రాణిస్తున్నారు. జిల్లాలో నైపుణ్యం కలిగిన శిక్షకులను నియమించేందుకు కృషి చేస్తున్నాం.

- బి.శ్రీనివాస్‌కుమార్‌, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి


చర్యలు తీసుకుంటాం...

జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదువ లేదు. వారికి కావాల్సిన వసతులు ఉన్నాయి. కానీ శిక్షకులే లేరు. వారికి మెరుగైన తర్ఫీదు ఇచ్చేందుకు, మెలకువలు నేర్పించేందుకు అధికారులతో చర్చించి శిక్షకులను నియామకానికి చర్యలు తీసుకుంటాం.

- ధర్మాన కృష్ణదాస్‌, ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని