ఆసరా లెక్క ముద్రతో పక్కా!!
eenadu telugu news
Published : 04/08/2021 04:13 IST

ఆసరా లెక్క ముద్రతో పక్కా!!

అర్హుల జాబితాపై కసరత్తు

బయోమెట్రిక్‌తో ముడి

ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం

న్యూస్‌టుడే- రాజాం

లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్న సిబ్బంది

సంక్షేమ పథకాలపై ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. తొలుత చూసీచూడనట్లు కొంత వెసులుబాటు ఇచ్చినా క్రమేపీ అన్ని పథకాల్లో కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి సాంకేతికతను జోడిస్తోంది. అనర్హుల ఏరివేతకు చర్యలు చేపడుతోంది. మరణించిన వారు, శాశ్వత వలసదారుల పేరున మంజూరవుతున్న నిధులు పక్కదోవ పట్టకుండా బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్లు, రుణాలు, పలు పథకాలకు ముడి పెట్టగా, ఇప్పుడు ఆసరా పథకానికి అమలు చేస్తోంది. తొలి విడత మంజూరు సమయంలో లేని ఈ నిబంధన రెండో విడత నిధుల మంజూరు సమయానికి తెరపైకి తెచ్చింది. వేలిముద్ర వేయని వారికి భరోసా లబ్ధి నిలిచి పోనుంది.

జిల్లాలో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంలో భాగంగా నాలుగు విడతల్లో రూ.1,506.48 కోట్ల మేర రుణ మాఫీ సాయాన్ని జమ చేయాల్సి ఉంది. 2020 సెప్టెంబరులో తొలి విడత నిధులు స్వయంశక్తి సంఘాల ఖాతాలకు జమ చేసింది. ఈసారి సంఘాల ఖాతాలకు మంజూరు చేసి ఊరుకోకుండా సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు సొమ్ములు మళ్లించాలని నిర్ణయించింది. గతేడాదే ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినా సంఘాల ఖాతాలకు జమ చేసి సరిపెట్టేసింది. కొన్ని చోట్ల సంఘాల అప్పునకు ఈ నిధులను బ్యాంకులు జమ చేసుకున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అడుగులు వేస్తోంది. దీని వల్ల పారదర్శకతకు తావు ఉంటుందని భావిస్తోంది. 2019 ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి బ్యాంకుల్లో అప్పు ఉన్న సంఘాలన్నింటికీ ఆసరా పథకం వర్తింపజేసింది. ఇందుకు అప్పట్లో భారీ కసరత్తే చేపట్టింది.

మృతుల పరిస్థితి ఏమిటి?

కొవిడ్‌, ఇతర అనారోగ్య కారణాలతో చాలా మంది చనిపోయారు. లాగిన్‌లో వీరి నామినీల వివరాలు నమోదు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అధికారులు భరోసా ఇస్తున్నా..ప్రభుత్వం దయతలచక పోతే నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకొందరు శాశ్వత వలసలూ వెళ్లారని చెబుతున్నారు. వృత్తి, బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడేందుకు వెళ్లిన వారు అక్కడి సంఘాల్లో చేరటం, అంతకు ముందు సంఘాల్లో కూడా పేర్లు నమోదై ఉండటం ..ఇలా ఒకటి కన్నా ఎక్కువ సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారి వివరాలు వేలిముద్రల సేకరణతో తేటతెల్లం కానుంది.

పలు చోట్ల వివాదాలు

రుణమాఫీ సాయంగా ఇస్తున్న నిధులు కావటంతో అప్పట్లో అప్పు తీసుకోని వారికి దీన్ని వర్తింప చేయలేదు. ఇది పలు వివాదాలకు కారణమైంది. ఉదాహరణకు 12 మంది సభ్యులున్న ఒక సంఘం రూ.5 లక్షలు రుణం తీసుకుని 8 మందే రుణం వినియోగించుకుంటే వారికే రుణమాఫీ వర్తింపజేశారు. ‘మా రుణం సొమ్ములు వేరే సభ్యురాలి అవసరాలకు సర్దుబాటు చేశామని, మమ్మల్ని ఎందుకు అనర్హులను చేస్తారు’ అన్న వాదన తెరపైకి చాలా మంది తెచ్చారు. ముందుగానే తీర్మానాలు తీసుకుని ఉండటంతో వివాదాలకు కొంత అడ్డుకట్ట పడింది. ఇప్పుడు సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు సొమ్ములు జమ కానున్న క్రమంలో మెప్మా, డీఆర్‌డీఏ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గ్రామాలు, వార్డుల్లో సంఘాలతో సమావేశాలు నిర్వహించి సభ్యుల వారీగా వివరాలు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమైక్య సంఘాల వారీగా సామాజిక సమన్వయకర్తలు (సీసీ)లు ఈ బాధ్యతలను చూస్తున్నారు.

ఆసరాకు అర్హత సాధించిన సంఘాలు: 51,536

వీటి పరిధిలో సభ్యులు : 6,62,912

గతేడాది జమ చేసిన సొమ్ము: రూ.376.62 కోట్లు


అర్హత ఉంటేనే లబ్ధి

రుణమాఫీ సాయానికి అర్హత ఉన్న స్వయంశక్తి సంఘాల్లోని సభ్యులంతా వేలి ముద్ర (బయోమెట్రిక్‌) వేయాలి. లేదంటే సాయం కోల్పోతారు. ఇది వారి బాధ్యత. సీసీలు ఈ పనిలోనే ఉన్నారు. ఎవరైనా చనిపోతే నామినీల పేర్లు నమోదు చేస్తున్నాం. అర్హత ఉంటే లబ్ధి మంజూరవుతుంది. పూర్తి పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ విధానం అమలు చేస్తోంది.

- బి.శాంతిశ్రీ, పీడీ, డీఆర్‌డీఏ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని