ధగధగలు
eenadu telugu news
Updated : 04/08/2021 13:11 IST

ధగధగలు

ఇద్దరు స్వాములకు 18 కిలోల వెండి, ఇత్తడి వస్తువులు

రెండో రోజూ సాగిన ఆభరణాల లెక్కింపు


వేణుగోపాలుడి బంగారు ఆభరణాలు

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి వేణుగోపాలస్వామి, సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం సీతారామస్వామి ఆభరణాల లెక్కింపు మంగళవారం కొనసాగింది. బొబ్బిలి కోటలోని భాండాగారంలో ఉన్న స్వామి వార్ల ఇత్తడి, వెండి వస్తువులు, స్థానిక ఆంధ్రాబ్యాంకు లాకర్‌లో ఉన్న వస్తువులను ఆలయ అనువంశిక ధర్మకర్త సుజయ్‌కృష్ణ రంగారావు, దేవాదాయశాఖ కమిటీ ప్రత్యేకాధికారి భ్రమరాంబ, ఆర్‌జేడీ సురేష్‌బాబు, డీసీ పుష్పనాథం, ఏసీ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు లెక్కింపు సాగింది. రికార్డుల మేరకు ఆభరణాలున్నాయని చెప్పిన అధికారులు ఇత్తడి, వెండి వస్తువులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. ఇద్దరు స్వాములకు 18 కిలోల వెండి, ఇత్తడి వస్తువులు ఉన్నాయన్నారు. గుళ్ల సీతారామపురంలో సీతారామస్వామి ఆలయ బాంఢాగారంలో మరో 96 రకాల వస్తువులు ఉన్నాయి. వాటిని బుధవారం లెక్కించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.


సీతారామస్వామి వారి ఆలయానికి చెందిన వస్తువులు

గంట ఆలస్యం

కోట భాండాగారంలోని వస్తువులు భద్రపరిచిన ఇనుప పెట్టె తాళాలు మొరాయించాయి. గ్యాస్‌ కట్టర్‌తో తాళాలను కోశారు. అందులో ఉన్న వస్తువులను భద్రంగా తీసి లెక్కించారు. దీనివల్ల గంట ఆలస్యమైంది.

* వేణుగోపాలస్వామికి నక్షత్ర హారతి, అష్ట, ద్వయ హారతులు, శఠగోపం, పగడం, పంచపాత్ర, కుందెలు, రుక్మిణీ, సత్యభామ, రాధాకృష్ణ, సీతారాముల కిరీటాలు, చక్రనారాయణ, రాజ్యలక్ష్మి, రాధాకృష్ణలు ఉత్సవ కిరీటాలు, రుక్మిణీ, సత్యభామ కర్ణపత్రాలు, స్వామి మొలతాడు, భుజకీర్తి, వడ్డాణాలు, గజ్జెలు, తిరువారాధన గిన్నె, రాధా అమ్మవారి కిరీటం, కాళ్ల గొలుసులు, బంగారు పూతతో కూడిన వెండి మరలు తదితర వస్తువులను గుర్తించారు.

* సీతారామస్వామికి గజవాహనం కలశాలు, శంఖుచక్రాలు, ఆంజనేయ వాహన కిరీటం, వెండి చిహ్నాలు, మకర తోరణాలు, పాత్రలు, గొలుసులు, వెండి నేత్రాలు, గొడుగు, చామరలు, గంటలు తదితరాలు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని