ఆపదలో ప్రథమ చికిత్స ఎలా..?
eenadu telugu news
Published : 04/08/2021 04:13 IST

ఆపదలో ప్రథమ చికిత్స ఎలా..?

పాలకొండ, న్యూస్‌టుడే: ప్రజా రవాణా వ్యవస్థలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ఎక్కడో ఒకచోట తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీరికి ప్రథమ చికిత్స చేసేందుకైనా ఆర్టీసీ బస్సుల్లో కనీస సామగ్రి ఉండటం లేదు. ప్రథమ చికిత్స పెట్టెలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో సామగ్రి మాత్రం ఉంచడం లేదు. ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసిన ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని గమనించారు. తక్షణమే అన్ని బస్సుల్లోనూ ప్రథమ చికిత్సకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో అయిదు డిపోల పరిధిలో 458 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. శ్రీకాకుళం-1 డిపో పరిధిలో 107, శ్రీకాకుళం రెండవ డిపోలో 103, పాలకొండ డిపోలో 102, పలాస డిపోలో 88, టెక్కలి డిపోలో 58 బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం నడుపుతున్న అన్ని బస్సుల్లోనూ ప్రథమ చికిత్స పెట్టెలు ఏర్పాటు చేయనున్నారు.

అవసరమే: ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలు ఉండటం అవసరమే. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సమయంలో 108 వాహనం వచ్చే వరకు కనీస చికిత్స అందని పరిస్థితి ఉంది. బస్సుల్లోనే కనీస వైద్యానికి అవసరమైన సామగ్రి ఉంటే తక్షణ చికిత్స అందించేందుకు వీలు కలుగుతుంది. ఇక మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే 108 వాహనాలు వచ్చేందుకు అధిక సమయం పడుతుంది. ఈ లోగా బాధితులకు వెంటనే ప్రథమ చికిత్సకు ఆస్కారం ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ డీఎం ఈ చర్యలు చేపట్టారు.

ఉండాల్సినవి ఇవి: ప్రథమ చికిత్స పెట్టెలో తొమ్మిది రకాలు సామగ్రి ఉండాలని నిర్దేశించారు. 25 గ్రాముల దూది(రెండు కట్టలు), ఎలక్టిక్ర్‌ బ్యాండేజ్‌ (అయిదు కట్టలు), బెటాడిన్‌ ఆయింట్మెంట్‌, డెటాల్‌, బ్లేడ్లు, బర్నాల్‌, వాటర్‌ ఫ్రూఫ్‌ ప్లాస్టర్లు పెట్టెల్లో ఉండాలి.


ఏర్పాటు చేస్తాం: ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెల్లో సామగ్రిని అందుబాటులో ఉంచుతాం. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అన్ని బస్సుల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తాం.

- వైవీఎస్‌ఎన్‌ మూర్తి, ఆర్టీసీ మేనేజరు, పాలకొండ డిపో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని