గంజాయ్!
eenadu telugu news
Updated : 04/08/2021 12:57 IST

గంజాయ్!

జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు

చెడు అలవాట్ల వైపు కొంతమంది యువత

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం

యువత చెడు అలవాట్ల వైపు పయనిస్తోంది.. సన్మార్గాన్ని వదిలి పెడదారి పడుతోంది.. మొన్నటి వరకూ సిగరెట్లు, మద్యం తాగడం ఓ ఫ్యాషన్‌గా భావించిన కొందరు ఇప్పుడు గంజాయిని ఎంజాయ్‌ చేస్తున్నారు... మత్తులో జోగుతూ మాయాలోకంలో తేలుతున్నారు... చదువుకున్న యువతే వీటికి బానిసగా మారి బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారు.. కన్నోళ్ల కలలను చిదిమేస్తున్నారు.. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోనే ఈ సంస్కృతి చాపకిందనీరులా పెరిగిపోతోంది.. ఇందుకోసం కొన్ని ప్రాంతాలు అడ్డాలుగా మారాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఇటీవల పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. దీనిపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.

* శ్రీకాకుళం నగరంలో రెండు రోజుల కిందట ఓ యువకుడిపై దాడి జరిగింది. చాకుతో పొట్ట, చేయి, ఛాతీకి గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. దాడి చేసిన వ్యక్తి గంజాయి మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

* శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్‌ కళాశాల సమీపంలో ఉన్న పాడుబడిన భవనంలో యువత మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో గంజాయి తాగాలంటే తెలిసిన వారికే అనుమతి ఉంటుంది. ఎలాంటి అనుమానం రాకుండా కార్యకలాపాలు సాగుతున్నాయి.

* అరసవల్లి నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే 80 అడుగుల రహదారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇక్కడ రాత్రివేళ పలువురు గంజాయి దట్టించిన సిగరెట్లను తాగుతున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో నిఘాపెంచారు.

* కొంతకాలం కిందట నగర పరిధిలో రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో 23 మంది యువకులు గంజాయి తీసుకుంటూ దొరికారు. వారందరూ మైనర్లు కావడంతో పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి విడిచిపెట్టారు.

గంజాయి విక్రయదారులు జిల్లాలో కళాశాలల విద్యార్థులు, ఏ పనిలేకుండా తిరుగుతున్నవారే లక్ష్యంగా అక్రమాన్ని సాగిస్తున్నారు. వారికి మత్తు పదార్థాలను అలవాటు చేసి జేబులు నింపుకొంటున్నారు. ఈ విధంగా డబ్బుల్లేక దొంగతనాలకు సైతం పాల్పడి ఖాకీలకు దొరికిపోయినవారికి గతంలో చూశాం. రకరకాల వ్యక్తులు ప్రయాణికుల వేషధారణలో ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు గంజాయి చేరుస్తున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం నగర శివారు ప్రాంతాలకు చేరుతోంది. అక్కడి నుంచి అమ్మకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇదంతా అధికారుల కంట పడటం లేదు. ఎప్పుడైనా ఎవరైనా సమాచారం అందిస్తే వాటిపైనే దాడులు చేసి పట్టుకున్నారు. ఇటీవల ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో పెద్దఎత్తున మత్తు, నిషేధిత పదార్థాల నిల్వలపై పోలీసులు దాడులు జరిపి పెద్ద ఎత్తున సరకు స్వాధీనం చేసుకున్నారు.


ఒడిశా నుంచి దిగుమతి...

ఇటీవల నగరంలో యువకుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి పొట్లాలు

నకు ఒడిశా పక్కనే ఉండటంతో సులువుగా గంజాయి అక్రమ రవాణా సాగిపోతోంది. పర్లాఖెముండి, బరంపురం, తదితర ప్రాంతాల నుంచి రైలు, బస్సుమార్గం, వ్యాన్లు, ఆటోలు, జిప్సీల ద్వారా దిగుమతి జరుగుతోంది. రైల్లో సీట్ల కింద నిషేధిత గుట్కా, తదితరాలను బ్యాగు పెట్టి వ్యక్తులు దూరంగా నిల్చొని గమనిస్తూ ఉంటారు. గంజాయి విక్రేతకు, కొనుగోలుదారుడికి ఆ సమయంలో సంబంధముండదు. ఫలానా సీటు కింద బ్యాగులో గంజాయి ఉందని సంకేతాలు అందుకున్న వ్యక్తి వారి ఊరురాగానే వాటిని తీసుకువెళతారు. ఇలా అక్రమ మార్గంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా రైల్వే పోలీసులు పట్టుకున్న సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్ఛు రైళ్లలో తనిఖీలు అంతంతమాత్రంగా చేస్తుండటం గమనార్హం.


అవే అడ్డాలు...

శ్రీకాకుళం నగరంతో పాటు కొన్ని పట్టణ శివారు ప్రాంతాలు అడ్డాలుగా మారుతున్నాయి. సిగరెట్లలో ఉండే పొగాకు తీసివేసి అందులో గంజాయి కూరి తాగుతున్నారు. ఒక్కో సిగరెట్‌ రూ.25 నుంచి రూ.100 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మొదటగా ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్రస్తుతం వందల్లోకి చేరుకుంటోంది. కొన్ని పాన్‌షాపులు ఇందుకు వేదికగా మారుతున్నాయి.


గుట్కా కూడా తక్కువ కాదు..

ఇచ్ఛాపురంలో పట్టుబడిన గంజాయి ప్యాకెట్లు

జిల్లాలో గుట్కా అమ్మకాలు నిషేధమైనా వీటిని వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దుకాణదారులు బహిరంగంగానే అమ్మేస్తున్నారు. పలువురు దుకాణాల సమీపంలోనే పెద్దగోదాములు ఏర్పాటు చేసుకొని గుట్కాల నిల్వలను ఉంచుతున్నారు. ఇటీవల అరసవల్లి రహదారిలో ఓ ఇంట్లో రూ.5 లక్షలు, పొట్టిశ్రీరాములు మార్కెట్‌ సమీపంలో రూ.19 లక్షల విలువైన సరకు పట్టుబడింది. 20 రోజుల కిందట పాతపట్నం పోలీసుస్టేషన్‌ పరిధిలో రూ.3.19 లక్షల విలువైన సరకు దొరికింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


బృందాలను ఏర్పాటు చేస్తాం.

గంజాయి, మత్తుపదార్థాలు విక్రయించే దుకాణాలపై నిఘా పెంచుతున్నాం. ఇప్పటికే వాటి వద్ద రెక్కీ నిర్వహించాలని ఆదేశించాం. వీటిపై దాడులకు పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు కృషి చేస్తున్నాం. యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు కూడా వారి కదలికలపై దృష్టి సారించాలి. వారి ప్రవర్తనలో మార్పులను పసిగట్టాలి.

- అమిత్‌బర్దార్‌, ఎస్పీ, శ్రీకాకుళం


జ్ఞాపకశక్తి, విచక్షణ కోల్పోతారు...

* గంజాయి తీసుకోవడంతో శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతింటాయి. మెదడు, గుండె, కేంద్రనాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి కోల్పోతారు. కొన్నిసందర్భాల్లో విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడతారు.

* నోరుపొడి బారుతుంది. ఆకలి మందగిస్తుంది. నరాల వ్యవస్థ చచ్చుబడిపోయి నిటారుగా ఉండలేక వణికి పోతుంటారు. ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. క్యాన్సర్‌ బారిన పడే అవకాశమూ ఉంటుంది.

* మరీ ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఏం తిన్నా అరగదు. విపరీతంగా కడుపునొప్పి వస్తుంది. కాలేయం పూర్తిగా పాడై శరీరం శుష్కించి పోతుంది.. ఫలితంగా ప్రాణం పోయే ప్రమాదముంది.

- డాక్టర్‌ బుడుమూరు అన్నాజీరావు, కార్డియాలజిస్ట్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని