శ్లాబు కూలి నిండు ప్రాణం బలి
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

శ్లాబు కూలి నిండు ప్రాణం బలి


కొండయ్య (దాచిన చిత్రం)

రణస్థలం, న్యూస్‌టుడే: రణస్థలం మండలంలోని ముక్తంపురం గ్రామానికి చెందిన జోగ కొండయ్య(55) శ్లాబు కూలి మృతిచెందాడు. శనివారం కుటుంబ సభ్యులందరూ కూలి పనికి వెళ్లగా కొండయ్య మాత్రం అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే ఉన్నాడు. ఉదయం 10.30 గంటల సమయంలో ఇంటిముందు కూర్చున్నాడు. అదే సమయంలో శ్లాబు కూలి పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు.


రోడ్డు దాటుతుండగా పడిపోయి ఒకరు...

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలిలోని పెద్దబ్రాహ్మణవీధి కూడలిలో నివాసముంటున్న రఘు శంకరరావు(38) ప్రమాదవశాత్తూ శనివారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ...అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన రోడ్డుదాటుతూ తూలిపడటంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రుడ్ని టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం తరలిస్తుండగా 108 వాహనంలో మృతిచెందాడు. కూలిపనులు చేసుకుని జీవిస్తున్న ఇతడికి భార్య రేణుక, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


రహదారి ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయరహదారిపై లొద్దపుట్టి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతిచెందాడు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ రోడ్డు దాటి వెళ్తున్న యువకుడిని బలంగా ఢీకొంది. 108 వాహనంలో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ వ్యక్తి చనిపోయే ముందు హిందీలో మాట్లాడుతున్నాడని, తన పేరు గోపీనాథ్‌, సోలాపూర్‌ వాసిగా చెప్పినట్లు రూరల్‌ ఎస్సై బి.హైమవతి తెలిపారు. చేతిపై ఆర్‌ఏడీఏ అని ఆంగ్ల అక్షరాలు పచ్చబొట్టుగా ఉన్నాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.


స్నానానికి వెళ్లి బాలుడి గల్లంతు

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: నాగావళి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి శనివారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం నగరంలో దమ్మలవీధికి చెందిన మైలపల్లి గణేష్‌ (7) మిత్రులతో కలిసి దమ్మలవీధి సమీపంలోని రేవులో స్నానానికి దిగాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయాడు. మరో బాలుడు కూడా నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆ బాలుడిని రక్షించారు. ఎంత వెతికినా గణేశ్‌ ఆచూకీ లభించలేదు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని