మోదమా.. ఖేదమా!
eenadu telugu news
Published : 19/09/2021 05:49 IST

మోదమా.. ఖేదమా!

తెరపైకి వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం

జిల్లాలో లక్షల మంది లబ్ధిదారులు

న్యూస్‌టుడే, రాజాం

జిల్లాలో గృహ నిర్మాణ పథకాల కింద లక్షల మంది పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. సొంతిల్లు లేనివారంతా ఆ కల సాకారం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్థిక చేయూత కేవలం రుణమని, వడ్డీతో సహా వాటిని చెల్లించాల్సి ఉందని చాలామంది లబ్ధిదారులకు తెలియదు. వారి పట్టా, పొజిషన్‌ పత్రం గృహ నిర్మాణ సంస్థ వద్ద ఇప్పటికీ కుదువలో ఉన్నాయన్నది గుర్తించలేదు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. ఇలాంటి వారందరికీ రుణ విముక్తులను చేసేందుకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకాన్ని తెరపైకి తెచ్చింది. 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు నిర్మించుకున్న ఇళ్లకు దీన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వారంతా పేదలు. ప్రభుత్వాల చేయూతతో ఇళ్లు నిర్మించుకున్నారు. సొంతింటి కల నెరవేరిందని సంబరపడ్డారు. అయితే అది వారి సొంతం కాదని ప్రభుత్వం ఇప్పుడు తేల్చింది. కేవలం ప్రభుత్వాల రుణ ఆర్థిక చేయూతతో నిర్మించుకున్నందున వడ్డీతో సహా చెల్లించాల్సి ఉందని గుర్తు చేసింది. వడ్డీ, అసలుతో నిమిత్తం లేకుండా ‘ఏకమొత్తం’ పరిష్కారం చూపేందుకు అంగీకరించింది. ఆ మొత్తాలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే సొంత ఆస్తిగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని స్పష్టం చేసింది.

ఇదీ ప్రాథమిక లెక్క

నిర్మించిన ఇళ్లు 2,92,769 (1983-2011 మధ్య)

గ్రామీణ ప్రాంతాలు: 2,77,202

పట్టణాల్లో: 15,567

జమ చేయాల్సిన మొత్తం రూ.296.55 కోట్లు


వాలంటీర్ల ద్వారా అవగాహన

జిల్లాలోని వార్డు/ గ్రామ వాలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తారు. నిర్ణీత డబ్బులు చెల్లించి సొంత ఆస్తిగా మార్చుకుంటే మున్ముందు కలిగే ప్రయోజనాలను వివరించి చైతన్యం చేస్తారు. డిసెంబరు 15వ తేదీలోగా వీరితో డబ్బులు కట్టించేందుకు కదులుతారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, ఇతర ఉన్నతాధికారులు దీనిపై పర్యవేక్షణ చేస్తారు. డిసెంబరు 21న తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేసి సొంత ఆస్తిగా లబ్ధిదారుల పేరున బదలాయింపు చేసే క్రతువు చేపడతారు.


యూనిట్‌ విలువ కన్నా ఎక్కువ

వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద నిర్ణయించిన రుసుం, యూనిట్‌ విలువకన్నా ఎక్కువ ఉన్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1983లో రూ.3000-4,000కు మించి యూనిట్‌ విలువ లేదు. ఇలాంటి వారు కూడా ఇప్పుడు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా కొంత కాలం రూ.2వేలు చొప్పున పెరిగింది. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. తొలుత కాస్త తక్కువే యూనిట్‌ విలువ ఉన్నా..తర్వాత ఈ మొత్తం ఎక్కువగానే ఉందని, అదీ కాకుండా వడ్డీతో సహా లెక్క కడితే తడిసి మోపెడైందని, అందుకే ఏక మొత్త చెల్లింపునకు అనుమతి ఇచ్చినట్లు చెబుతోంది. దీనికి తోడు ఇన్నాళ్లూ కుదవలో ఉండి, అధికారికంగా క్రయ విక్రయాలకు ఆస్కారం లేకుండా పోయిందని, ముందుకు వచ్చి సొమ్ములు చెల్లించిన వారికి ఆ ఇల్లు సొంత ఆస్తిగా మారుతుందన్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు.


ఎక్కడ ఎంత?

జిల్లాలోని 1190 పంచాయతీల్లో నిర్మించుకున్న ఇళ్లకు రూ.10 వేలు, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, పాలకొండ, రాజాం పట్టణాల్లో రూ.15 వేలు, శ్రీకాకుళం నగరంలో రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 2011 నాటికి పాలకొండ నగర పంచాయతీ ఏర్పాటు కాలేదు. దీంతో ఇక్కడ రూ.10 వేలకే క్రమబద్ధీకరిస్తారా? లేదంటే ఇప్పుడు పట్టణం కాబట్టి రూ.15 వేలు కట్టమంటారా అన్నది తేలాల్సి ఉంది. అలాగే శ్రీకాకుళం కూడా ఇటీవల నగరం స్థాయి పెరిగింది. 2011 కటాఫ్‌ తేదీ నాటికి ఇది పట్టణం కావటంతో రూ.15 వేలకే ఇల్లును లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నగరం కాబట్టి రూ.20 వేలు చెల్లించమంటారా అనే సందిగ్ధత ఉంది.


ఎంతో మేలు..

గృహ నిర్మాణ దారులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ వర్తింపు చేస్తూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం పేదలకు మేలు చేస్తుంది. గృహ నిర్మాణ సంస్థ వద్ద వడ్డీలకు రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. ఇన్నేళ్లలో వడ్డీ భారీగా పెరిగిపోయింది. వీటితో పోల్చితే ఓటీఎస్‌ కింద నిర్ణయించిన మొత్తం తక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లే జిల్లాలో ఎక్కువున్నాయి. వీరు రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. విధి విధానాలు వెల్లడైతే దీనిపై మరింత స్పష్టత వస్తుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

- ఎన్‌.గణపతి, పథక సంచాలకులు, గృహ నిర్మాణ సంస్థ, శ్రీకాకుళం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని