తీర్పు వెల్లడైన వేళ..
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

తీర్పు వెల్లడైన వేళ..

పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద నాయకుల సందడి

ఎట్టకేలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆయా పీఠాలను అధిరోహించేవారెవరో తేలిపోయింది. ఈ నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియ సమయంలో, పూర్తయిన తరువాత జరిగిన ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అవి ఇలా ఉన్నాయి...


మొదటిసారి తారుమారు...
  - న్యూస్‌టుడే, టెక్కలి

సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో తొలిసారి తెదేపా జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కోల్పోయింది. ఒక్కో మండలంలో తెదేపా కేవలం రెండేసి ఎంపీటీసీ ప్రాదేశికాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 1983లో మండలాల వ్యవస్థ ఏర్పడిన నుంచి రెండు మండలాల్లో తెదేపా ప్రజాప్రతినిధులే ఎన్నికవుతూ వచ్చారు. 1999లో రెండు మండలాల జడ్పీటీసీ స్థానాలు తెదేపాకు ఏకగ్రీవంగా గెలుపొందేవారు. ఈసారి మాత్రం అది తారుమారైంది.   


అత్తాకోడళ్ల విజయం...
- న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం, పాలకొండ

జడ్పీటీసీలుగా పాలకొండకు చెందిన అత్తాకోడళ్లు పాలవలస ఇందుమతి, పాలవలస గౌరీపార్వతి విజయం సాధించారు. గౌరీపార్వతి పాలకొండ నుంచి, రేగిడి నుంచి ఇందుమతి బరిలో నిలిచి ప్రత్యర్థులను ఓడించారు. ఇందుమతి కుమార్తె రెడ్డిశాంతి పాతపట్నం శాసనసభ్యురాలిగా, సోదరుడు రౌతు హనుమంతరావు పాలకొండ నగరపంచాయతీ ఉపాధ్యక్షుడి కొనసాగుతున్నారు.


నోటాకూ ఓటేశారు...
- న్యూస్‌టుడే, టెక్కలి

ఈ ఎన్నికల్లో నోటాకు ఓట్లేసిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని ప్రాదేశికాల్లోనూ కొంతమేర నోటాను ఎంచుకున్నారు.  మండలాల వారీగా చూసుకుంటే టెక్కలిలో 452, నందిగాంలో 374, సంతబొమ్మాళిలో 550, కోటబొమ్మాళిలో 697 ఓట్లు నోటాకు వేశారు. టెక్కలిలో నోటాకు వచ్చిన ఓట్ల కన్నా భాజపాకు తక్కువ వచ్చాయి. టెక్కలిలో 562, నందిగాంలో 442, సంతబొమ్మాళిలో 778, కోటబొమ్మాళిలో 946 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.


పదవులు గెలిచి.. కరోనాతో ఓడి..
కంచిలి, న్యూస్‌టుడే: కంచిలి మండలం పోలేరు ప్రాదేశికానికి చెందిన మల్లపురెడ్డి పద్మావతి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేశారు. ఫలితాలు ఆలస్యం అవుతుండటంతో పంచాయతీ ఎన్నికల్లో పోలేరు నుంచి పోటీచేసి సర్పంచిగా విజయం సాధించారు. అంతలోనే రెండోదశ కరోనా రావడంతో దాని బారిన పడి మృతిచెందారు. తాజాగా విడుదలైన ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఆమె పోటీ చేసిన పోలేరు ప్రాదేశికం నుంచి ఘనవిజయం సాధించారు. పద్మావతికి 811 ఓట్లు రాగా తెదేపాకి 39, జనసేన పార్టీకి 30 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల్లో విజయం పద్మావతి వెంటే ఉన్నప్పటికీ కరోనా ఆమె విషయంలో చిన్నచూపు చూసింది.


జడ్పీటీసీగా ఉపముఖ్యమంత్రి తనయుడు...
- న్యూస్‌టుడే, పోలాకి

పోలాకి జడ్పీటీసీగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడు ధర్మాన కృష్ణచైతన్య నిలిచారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన ఈయన తొలి ప్రయత్నంలోనే 15,603 మెజార్టీ సాధించారు. వైద్యవిద్య చదివినా... అటువైపు వెళ్లకుండా ఆసక్తితో రాజకీయాలవైపు వచ్చారు. కొంతకాలంగా తండ్రితో పాటు నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొని అందరి అభిమానం చూరగొన్నారు. కుమారుడి విజయంపై    మబుగాంలో ఉన్న ఉపముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.       


అయిదుసార్లు ఆయనే...
- న్యూస్‌టుడే, కొత్తూరు

కొత్తూరు మండలం కుంటుభద్ర గ్రామానికి చెందిన ఆగతముడి బైరాగినాయుడు ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తాచాటారు. గురిడి స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా 12 ఓట్లతో నెగ్గారు. వైకాపా అభ్యర్థి పట్టుబట్టడంతో రీ కౌంటింగ్‌ చేయగా... అందులోనూ విజయం ఆయననే వరించింది. దీంతో ఈయన అయిదోసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైనట్లయింది. గతంలో తెదేపా, తెదేపా, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెదేపాల తరఫున వరుసగా 1995, 2001, 2006, 2013, 2020లో ఆయన విజయం సాధించారు.


ఆరు ఓట్లతో అలికాం కైవసం...
- న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని అలికాం ఎంపీటీసీ స్థానానికి ముగ్గురి మధ్య పోటీ సాగింది. తెలుగుదేశం, వైకాపాతో పాటు స్వతంత్ర అభ్యర్థి బరిలో హోరాహోరీగా తలపడ్డారు. తెదేపా అభ్యర్థి వి.పద్మావతికి 469 ఓట్లు రాగా, వైకాపాకు 463 ఓట్లు వచ్చాయి. స్వతంత్య్ర అభ్యర్థి(వైకాపా రెబల్‌)గా బరిలో దిగిన జి.రమణమ్మకు 389 ఓట్లు వచ్చాయి. నోటాకు 13, చెల్లని ఓట్లు 36 వచ్చాయి. తెదేపా, వైకాపా అభ్యర్థులకు కేవలం ఆరు ఓట్లు వ్యత్యాసం ఉండడంతో రీకౌంటింగ్‌ నిర్వహించారు. మొత్తం ఓట్లను లెక్కించినప్పటికీ తెదేపాకు ఆరు మెజారీటీ రావడంతో పద్మావతి గెలుపొందినట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.


ఆలస్యంగా మొదలైన లెక్కింపు..
- న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

ఆమదాలవలస జూనియర్‌ కళాశాలలో వివిధ కారణాలతో లెక్కింపు సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా మొదలైంది. వైకాపా, తెదేపా ఏజెంట్లకు పాస్‌ అందకపోవడంతో వారు గేటు బయటే ఉండాల్సి వచ్చింది. తెదేపా ఏజెంట్లను పోలీసులు గేటు వద్ద నిలిపి వేశారు. సమాచారం తెలుసుకున్న తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ చేరుకొని వివక్ష పనికిరాదంటూ పోలీసులకు నిలదీశారు. కొంత సమయం తరువాత అధికారులతో మాట్లాడి తెదేపా ఏజెంట్లను లోపలకు పంపించారు. అనంతరం వైకాపా ఏజెంట్లు కూడా లోపలికి వెళ్లారు. రవికుమార్‌ను మాత్రం రాకుండా పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో కొంత సమయం ఉండి ఆయన తెదేపా కార్యాలయానికి వెళ్లిపోయారు.


కళ్లేపల్లిలోనూ పోటాపోటీ...
- న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని కళ్లేపల్లి ప్రాదేశిక స్థానం ఓట్ల లెక్కింపు ఉత్కంఠరేపింది. తెదేపా అభ్యర్థి ఎస్‌.కిరణ్మయికి 997 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి బి.మంగమ్మకు 1,005 ఓట్లు వచ్చాయి. నోటాకు 72 ఓట్లు పోలయ్యాయి. 8 ఓట్లు వ్యత్యాసం ఉండడంతో మళ్లీ లెక్కించారు. అయినప్పటికీ తేడా లేకపోవడంతో వైకాపా అభ్యర్థి గెలుపును రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని