నేరడికి ఒడిశా కొర్రీ..!
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

నేరడికి ఒడిశా కొర్రీ..!

ఎగువన ప్రాజెక్టు  నిర్మాణానికి యత్నం
ముమ్మరంగా జరుగుతున్న సర్వే

నేరడి బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార ప్రాజెక్టుకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడుగులు వేస్తుంటే ఒడిశా ప్రభుత్వం మాత్రం ఎగువన ప్రాజెక్టులు నిర్మించాలని యోచిస్తోంది. వంశధార నదిపై ఎగువనున్న పాణిడొంగొరొ వద్ద ప్రాజెక్టు సహా, మెగా ఎత్తిపోతల పథకాలు, చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ సర్వే ప్రారంభించింది. కేవలం 15 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే రెండు నెలల్లోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ఒడిశా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ట్రైబ్యునల్‌ తీర్పు తర్వాతే: నేరడి బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ట్రైబ్యునల్‌ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాలు సేకరించి ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూ సేకరణకి సంబంధించిన పరిహారం ఏపీˆ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది. అయినా ఒడిశా ముందుకు రావడం లేదు. పైగా ట్రైబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తమ రాష్ట్రంలోని ప్రాంతాలు పెద్దయెత్తున ముంపునకు గురవుతాయని ఆరోపిస్తోంది. ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించిన తర్వాతే ఎగువన ప్రాజెక్టుల నిర్మాణానికి శరవేగంగా ఒడిశా అడుగులు వేస్తోంది. వీలైనంత ఎక్కువ నీటిని పైనే ఆపేసేలా ప్రణాళికలు రచిస్తోంది.
నేరడి నిర్మాణం జరిగితే...: 19.05 టీఎంసీˆల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం వంశధార రిజర్వాయర్‌కి ఉంది. రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించడానికి కాట్రగడ్డ దగ్గర సైడ్‌వియర్‌ నిర్మించారు. నదిలో వరద ప్రవాహం 20వేల క్యూసెక్కులు దాటితే గానీ నీరు సైడ్‌వియర్‌ నుంచి వరదకాలువ ద్వారా రిజర్వాయర్‌కి చేరదు. పుణేకి చెందిన ఓ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం సైడ్‌ వియర్‌ నుంచి కేవలం 8 టీఎంసీˆల నీటిని మాత్రమే మళ్లించడానికి ఆస్కారం ఉంటుంది. అంతకు మించి నీటి మళ్లింపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రిజర్వాయర్‌ సామర్థ్యం మేరకు నీటిని మళ్లించాలంటే నేరడి బ్యారేజీ నిర్మించి తీరాలని ప్రతిపాదించింది. అప్పుడు నదిలో ప్రవాహం తక్కువగా ఉన్నా బ్యారేజీ వల్ల నీటిమట్టం పెరిగి రిజర్వాయర్‌లోకి నీరొస్తుంది. వంశధార నుంచి నాగావళికి అనుసంధాన కాలువ నిర్మాణం జరుగుతోంది. రిజర్వాయర్‌లోని నీటిని భవిష్యత్తులో నారాయణపురం ఆనకట్టకీ మళ్లించొచ్చు. మొత్తం 19.05 టీఎంసీˆల నీరు నిల్వ చేయగలిగితే జిల్లాలో 70 శాతం భూములకు ఏ సమస్యా లేకుండా సాగునీరు అందించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
106 ఎకరాలు సరిపోతుంది..
నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా భూభాగంలోని 106 ఎకరాలు సేకరిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఆ భూమి సేకరించి ఇస్తే ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ఏపీˆ సిద్ధంగా ఉంది. కానీ ఆ భూమి ఇవ్వకుండా ఏవో సాకులు చెబుతూ ఒడిశా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్యారేజీ పూర్తయితే కొంత నీటిని ఒడిశాలోని వ్యవసాయ భూములకూ మళ్లించే అవకాశం ఉంది. నిర్మాణం వ్యయం ఏపీˆదే అయినా కొన్ని ఫలాలు ఒడిశాకూ దక్కుతాయి. అయినా ఆ ప్రభుత్వం సహకరించకపోవడం గమనార్హం. ఈ అంశంపై గతంలో ఎపీˆ సీˆఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కి లేఖ రాశారు. తాజాగా ఒడిశా కుయుక్తుల నేపథ్యంలో ఏపీˆ ఎలాంటి ఎత్తుగడ వేసి, బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుసాధ్యం చేస్తుందో వేచి చూడాల్సిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని