పరిషత్‌ పాలనలో ఆమె!
eenadu telugu news
Published : 21/09/2021 04:55 IST

పరిషత్‌ పాలనలో ఆమె!

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

ఎన్నో రోజులుగా ఎదురుచూసిన పరిషత్తు ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి.. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఆమె పాలనే సాగనుంది.. ఎన్నికైన వారిలో సంఖ్యా పరంగా వారే పైచేయి సాధించారు. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల ఆధారంగా సగం స్థానాలు మహిళలకే కేటాయించగా, మిగిలిన స్థానాల్లోనూ బరిలో నిలిచి సత్తాచాటారు.. మహిళలంటే ఇంటికే పరిమితం కాదని, పాలనలోనూ తమదైన మార్కు చూపుతామని చాటిచెప్పారు.. జడ్పీ పీఠం కూడా వనితకే రిజర్వేషన్‌ కావడం మరో విశేషం. దీంతో జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఆమెదే కీలక పాత్ర కానుంది.

జిల్లాలో మొత్తం 590 ఎంపీటీసీ, 37 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటి లెక్కింపు ఆదివారం పూర్తయింది. ఫలితాల్లో 362 స్థానాల్లో ఎంపీటీసీ, 23 చోట్ల మహిళలకే పీఠాలు దక్కాయి. అంటే దాదాపు 62 శాతం స్థానాలు వారే కైవసం చేసుకున్నారు. ఎంపీపీలుగానూ ఎక్కువ చోట్ల మహిళలే ఎన్నిక కానున్నారు. అంటే ఆ పాలకవర్గం మొత్తాన్నీ నడిపే బాధ్యత ఆమె పైనే ఉంటుంది. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ కీలక పాత్ర మహిళ అయిన జడ్పీ ఛైర్‌పర్సన్‌దే కానుంది. గతంలో జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల్లోనూ వనితలే సత్తా చాటారు. పంచాయతీల్లో మొత్తం 1164 సర్పంచ్‌ స్థానాల్లో 671 వారే చేజిక్కించుకున్నారు.

ఒకప్పుడు రాజకీయాలంటే 40 ఏళ్ల పైబడిన వారే వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఇచ్ఛాపురం, సంతబొమ్మాళి, సీతంపేట మండలాల నుంచి 21 ఏళ్ల వయసున్న యువతులు ఒక్కొక్కరు ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు. 25ఏళ్ల లోపు వయసున్న వారు ఏకంగా 23 మంది ఎంపీటీసీ కుర్చీల్లో కూర్చోనున్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారూ రాజకీయాల వైపు రావడం హర్షించదగ్గ పరిణామం.

గతంలో పాలకవర్గంలో ఒకరిద్దరు మాత్రమే మహిళలు కనిపించేవారు. వారేం పాలిస్తారులే అంటూ ఎద్దేవా చేసి ఓట్లూ వేసేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న స్త్రీలు రాజకీయంగానూ ఉన్నతస్థాయికి ఎదగగలరని, మంచి పాలన అందించగలరనే నమ్మకం ప్రజల్లో వస్తోంది. తాజా ఫలితాలే దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. అన్ని అడ్డంకులనూ దాటుకుంటూ పాలనలో తమదైన ముద్ర వేసి మిగిలిన వారికి దిశానిర్దేశం చేసే స్థాయికి వెళ్లేవారూ వీరిలో ఉన్నారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇక్కడి వరకూ చేరుకున్న వారూ ఉన్నారు. యువతులు, గృహిణులు, రైతులు, రైతు కూలీలు, వ్యాపారవేత్తలు, ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు ఇలా అందరికీ అవకాశం దక్కింది.

ఈమె పేరు పిట్ట శారద. వయసు 21 ఏళ్లు. ఇచ్ఛాపురం మండలం ధర్మవరం ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రాజకీయ నేపథ్యం లేదు. బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. అయినా రాజకీయాలపై ఆసక్తితో వచ్చారు. ఓటర్లూ ఈమెకు పట్టం కట్టారు. ‘బాలికలను చదివించేలా ప్రోత్సహిస్తా. స్వయం ఉపాధి మార్గంలో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా వెళ్లాలి. అందుకు ఉన్న వనరులను గుర్తించి, అధికారుల ద్వారా చేయిస్తా.’ అని పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం ప్రాదేశిక స్థానాల్లో అన్ని పార్టీలు యువత చోటుకల్పించాయి. ఒకప్పుడు పూర్తి పరిణితి, రాజకీయ నేపథ్యం ఉన్నవారే పదవులకు పోటీపడేవారు. కానీ ఆ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. తమ ప్రాంత అభివృద్ధి పాటుపడాలనే ఉద్దేశంతో ఇటుగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో యువతులు ముందుకు రావడం గమనార్హం. సర్పంచ్‌, వార్డు సభ్యులు, పుర, ప్రాదేశిక ఇలా అన్ని ఎన్నికల్లోనూ యువత తమ సత్తా చాటుతూ వస్తున్నారు. కొన్నిచోట్ల బడా నేతలకూ పోటీగా నిలుస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని