గులాబ్‌ గుప్పెట..!
eenadu telugu news
Published : 26/09/2021 03:55 IST

గులాబ్‌ గుప్పెట..!

జిల్లాపై తుపాను పడగ

న్యూస్‌టుడే, సోంపేట, శ్రీకాకుళం కలెక్టరేట్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను జిల్లా ప్రజలను వణికిస్తోంది.. జిల్లా పరిధిలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయనే వాతావరణ శాఖ ప్రకటనతో మళ్లీ ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం తీరమంతా నెలకొంది.. ఇటు కళింగపట్నం నుంచి అటు ఒడిశాలోని గోపాలపూర్‌ మధ్య తీరం వెంబడి అలజడి రేగుతోంది.. సముద్రుడు ఉగ్రరూపం దాల్చుతూ కెరటాలతో ఎగసిపడుతున్నాడు.. మరోపక్క గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొబ్బరి రైతులతో పాటు మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

● బలమైన గాలులు వీస్తే విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉందని, దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

తుపాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో అలర్ట్‌ ప్రకటించింది. గార, కవిటిలో జాతీయ విపత్తుల నివారణ బృందాలు రంగంలోకి దిగాయి. రెవెన్యూ, పోలీసు, మెరైన్‌ పోలీసు, విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సెలవులు రద్దు చేశారు. అంతా స్థానికంగానే ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తహసీల్దార్లు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీరం నుంచి వేట పరికరాలు రక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలిచ్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తీరానికి అతి సమీపంలో ఉన్న డొంకూరు, ఇద్దివానిపాలెం, బారువ-కొత్తూరు, ఎకువూరు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు. పరిస్థితులను బట్టి ఆపదలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మత్స్యకారులు వేటను నిలిపివేసి వలలు, పడవలు, ఇతర పరికరాలు తీరం నుంచి గ్రామాలకు తరలించారు. సముద్రంలో అలల ఉద్ధృతి పెరడగంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చనే మత్స్యకార పెద్దలు అభిప్రాయపడుతున్నారు. కవిటి మండలంలో పడవను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న మత్స్యకారులను చిత్రంలో చూడొచ్ఛు

ఒడిశాలో వర్షాలు పడితే.. : ఒడిశాపైనా వర్షప్రభావం ఉన్న నేపథ్యంలో వంశధార నదీ పరీవాహక ప్రాంతంలో 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, నీటిపారుదలశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. జలాశయాల్లోని నీటి మట్టాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచితే వరదల తీవ్రతను తగ్గించేందుకు వీలుపడుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకు తరలించే బాధ్యతను రెవెన్యూ, పోలీసు అధికారులకు అప్పగించారు.

వణుకుతున్న ఉద్దానం..

తిత్లీ మిగిల్చిన విషాదం నుంచి కోలుకోకముందే మళ్లీ మరో తుపాన్‌ రానుందనే సమాచారం ఉద్దానం రైతులను వణికిస్తోంది. ఇప్పటి వరకు కొబ్బరి దిగుబడులు చేతికందే పరిస్థితి లేకపోగా ఇప్పుడిప్పుడే జీడిమామిడి కుదుట పడే పరిస్థితి కనిపిస్తుంది. తీరానికి సమీపంలోనే ఉద్దానం తోటలు ఉండటంతో తుపాన్‌ పరిస్థితి వాటిపై ఎక్కువగానే ప్రభావితం చూపుతుంది. గోపాల్‌పూర్‌ పరిధిలో తీరం దాటే తుపాన్ల తీవ్రత ఉద్దానంపై ఎక్కువగానే ఉంటుంది. 1999 నుంచి ఇప్పటి వరకు వచ్చినవి పరిశీలిస్తే ఎక్కువగా గోపాల్‌పూర్‌ పరిధిలోనే దాటాయి. పైలిన్‌, తిత్లీ మాత్రం సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో దాటాయి. 1999 సూపర్‌ సైక్లోన్‌తో పాటు ఈ రెండూ ఉద్దానం తోటలపై ప్రభావం చూపాయి. ఇచ్ఛాపురం నుంచి సంతబొమ్మాళి వరకు 8 మండలాల పరిధిలోనే 1.30 లక్షల ఎకరాల వరకు విస్తీర్ణంలో కొబ్బరి, జీడి, మామిడి, పనస ఇతర ఉద్యాన పంటలతో పాటు 1.5 లక్షల ఎకరాల వరకు వరిసాగుతో ఉద్దానం ప్రాంత ప్రజలు ఉపాధి పొందుతున్నారు. రెండు, మూడేళ్లకోసారి చిన్న, చితక ఆరేడేళ్లకు పెద్దస్థాయిలో తుపాన్లు సంభవిస్తుండడంతో ఉద్దానం రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజల ఉపాధి దెబ్బతింటోంది.

ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు: కన్నబాబు

తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కమిషనరు కె.కన్నబాబు హుటాహుటిన శనివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ దృష్ట్యా నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఆక్సిజన్‌ లభ్యత, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సుమిత్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌ బర్దార్‌, డీఆర్వో బలివాడ దయానిధి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తుపాను పయనిస్తున్న మార్గం

పలు రైళ్ల రద్ధు.కొన్ని దారి మళ్లింపు తుపాను కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటి గమ్యాలు కుదింపు, మరి కొన్ని దారి మళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 26న విశాఖ-విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ-విజయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేశామన్నారు. 27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

సమాచార వ్యవస్థపై ప్రత్యేక దృష్టి

● తాగునీటి సరఫరా, పెట్రోల్‌, గ్యాస్‌ కొరత లేకుండా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఆహారధాన్యాలు, పాలు, రొట్టెలు, బిస్కెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

* గార మండలం బందరువానిపేటలో కలెక్టరు లఠ్కర్‌ పర్యటించారు. తుపాను రక్షిత భవనాన్ని పరిశీలించి, దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తహసీల్దారు రామారావును ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని