విజయం వరించిందిలా!
eenadu telugu news
Published : 26/09/2021 04:04 IST

విజయం వరించిందిలా!

- న్యూస్‌టుడే, సోంపేట

ఎన్నాళ్లో వేచి చూసిన విజయం ఎట్టకేలకు ఇచ్ఛాపురం నియోజకవర్గానికి దక్కింది. సామాజిక సంప్రదాయ సంకెళ్ల నుంచి బయటపడి జడ్పీ పీఠం ఇన్నాళ్లకు శివారు నియోజకవర్గానికి కేటాయించారు. విభిన్న సమస్యలతో సతమతమవుతున్న ఉద్దాన తీరం అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జడ్పీ అధ్యక్షురాలిగా పిరియా విజయను ఎన్నుకోవడంతో మండల వ్యవస్థ ఏర్పాటు తర్వాత ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ పదవిని చేపట్టడం తొలిసారి కావడం గమనార్హం.

భర్తతో పాటు సమానంగా క్రియాశీల రాజకీయాల్లో రాణించిన పిరియా విజయ ప్రతిభతో పాటు సేవాభావానికి గుర్తింపు లభించింది. విజయ సొంత ప్రాంతం నూజివీడు అయినా బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే సాగాయి. పిరియా సాయిరాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె ఉంది. 2009లో సాయిరాజ్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తోడుగా 12 ఏళ్లుగా ఆమె కూడా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ వైకాపా మహిళా సమన్వయకర్తగా ఉంటూ స్థానిక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మహిళలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సాయిరాజ్‌కు ముఖ్యమంత్రి జగన్‌ వద్ద ఉన్న గుర్తింపుతో పాటు విజయ ప్రత్యేకత చాటుకోవడంతో పదవి వచ్చినట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని