జడ్పీ పీఠంపై ఉద్దానం వనిత
eenadu telugu news
Published : 26/09/2021 04:15 IST

జడ్పీ పీఠంపై ఉద్దానం వనిత

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

సాయిరాజ్‌ దంపతులను సత్కరిస్తున్న మంత్రి అప్పలరాజు చిత్రంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన, ఎమ్మెల్యేలు

జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ముందుగా అనుకున్నట్లుగానే జడ్పీ అధ్యక్షురాలిగా కవిటి జడ్పీటీసీ సభ్యురాలు పిరియా విజయ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వజ్రపుకొత్తూరు జడ్పీటీసీ సభ్యురాలు పాలిన శ్రావణి, సంతకవిటి జడ్పీటీసీ సభ్యుడు సిరిపురపు జగన్మోహనరావు, కోఆప్షన్‌ మెంబర్లుగా సీతంపేటకు చెందిన సవర లక్ష్మి, నరసన్నపేటకు చెందిన షేక్‌బాబ్జిలను ఎన్నుకున్నారు. వీటిలో ఏ పదవికీ ఎవరూ పోటీలో లేకపోవడంతో అంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకరు తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి లఠ్కర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి సమావేశానికి రావడంతో కోలాహలం నెలకొంది.

ఏ సమయంలో ఏం జరిగింది..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ లఠ్కర్‌ పర్యవేక్షణలో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నిక ప్రక్రియ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. జడ్పీ కార్యవర్గంలో రెండు కోఆప్షన్‌ సభ్యులకు అవకాశముంది. సవర లక్ష్మి, షేక్‌బాబ్జీ 10 గంటలకు నామినేషన్లు వేశారు. వీరికి పోటీగా ఎవరూ వేయకపోవడంతో 12 గంటల తర్వాత ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పాలకొండ, రేగిడి జడ్పీటీసీ సభ్యులు పాలవలస గౌరీపార్వతి, ఇందుమతి హాజరుకాకపోవడంతో మిగిలిన 35 మందితో పాటు ఇద్దరు కోఆప్షన్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డి శాంతితో కలిసి రావడంతో వారితో కూడా చేయించారు. తర్వాత మంత్రులు జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు పార్టీ బీ-ఫారాలు అందజేశారు.

ఎన్నిక ఏకగ్రీవం

షెడ్యూల్‌ సమయానికి ఎన్నిక ప్రారంభించారు. మొత్తం 37 మంది సభ్యులతో కోరం ఉండటంతో సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థిగా వైకాపాకు చెందిన పిరియా విజయను కంచిలి జడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి ప్రతిపాదించగా, రేగిడి జడ్పీటీసీ పాలవలస ఇందుమతి బలపరిచారు. దీంతో జడ్పీ అధ్యక్షురాలిగా విజయ ఎన్నికైనట్లు ధ్రువీకరిస్తూ అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా శ్రావణి, జగన్మోహనరావులను మిగిలిన సభ్యులు బలపరిచారు. ఎన్నికల పరిశీలకులు కె.ఆర్‌.బి.హెచ్‌.ఎన్‌.చక్రవర్తి హాజరై ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విజయను కార్యక్రమంలో పాల్గొన్న నేతలంతా ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్యెల్యేలు కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు మామిడి శ్రీకాంత్‌, అందవరపు సూరిబాబు, నర్తు రామారావు, పిరియా సాయిరాజ్‌, జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బాధ్యతగా భావిస్తా.. ప్రజలకు సేవచేస్తా..

అందరినీ కలుపుకొంటూ వెళ్లి ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందేలా నా వంతు కృషి చేస్తాను. ఉద్దానం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను.- పిరియా విజయ, జడ్పీ ఛైర్మన్‌

అంతా సమష్టిగా పనిచేద్దాం : స్థానిక సంస్థల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైకాపాకు పట్టం కట్టడంచరిత్రాత్మక విజయం. ప్రతిపక్ష పార్టీల మాటలు ప్రజలువిశ్వసించరు. అంతా సమష్టిగా పనిచేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుదాం. - ధర్మాన కృష్ణదాస్‌, ఉప ముఖ్యమంత్రి

ప్రథమ స్థానంలో నిలపాలి: నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు గ్రామ సచివాలయాల సేవలను సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి ఆశయసాధనకు అనుగుణంగా పనిచేయాలి. జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేలా అంతా సమష్టిగా పనిచేద్దాం. - సీదిరి అప్పలరాజు, మంత్రి

సేవలకు గుర్తింపు..

ఉద్దానం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కిడ్నీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంస్థ ద్వారా చేయూత అందిస్తున్నారు. 200 పైగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌గా సేవలు అందించారు. కరోనా, కిడ్నీ బాధితుల కోసం రెండు అంబులెన్సులు, డయాలసిస్‌ పరికరాన్ని సోంపేట సామాజిక ఆసుపత్రికి ఇచ్చారు. 50 మంది రోగులకు నెలకు రూ.2 వేల చొప్పున పింఛను ఇచ్చి ఆదుకుంటున్నారు. కిడ్నీ వ్యాధి విషయంలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ, గజల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు, రోటరీ, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉద్దానం ప్రజలకు సేవలందిస్తున్నారు. థర్మల్‌ పోరాటంలో పాత్ర పోషించారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో పర్యటనలు సాగించి సమస్యలతో పాటు ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవడం వంటి చర్యలు ఆమె విజయానికి కారణంగా చెప్పొచ్ఛు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని