కష్టమంతా వర్షార్పణం
eenadu telugu news
Published : 28/09/2021 05:25 IST

కష్టమంతా వర్షార్పణం

వేలాది ఎకరాల్లో నీటమునిగిన పంటలు

జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

●●●న్యూస్‌టుడే, రాజాం

వెంకటాపురంలో నేలమట్టమైన మొక్కజొన్న పంట

గులాబ్‌ తుపాను హలధారులను అతలాకుతలం చేసింది. ఆపసోపాలు పడి సాగుచేసిన పంటను నిలువునా ముంచేసింది. వేలాది ఎకరాలు ఇంకా ముంపులోనే నానడంతో కంటిమీద కునుకు లేకుండాపోయింది. ప్రాథమిక అంచనాల గుర్తింపునకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న బాగా దెబ్బతినే ప్రమాదముందని భావిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే వరికి అనర్థం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పత్తి, చెరకు, కూరగాయలు, ఇతర పంటల్లోనూ పెద్దఎత్తున నీరు నిల్వ ఉండటంతో రైతులు ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ విస్తీర్ణం ఆశాజనకంగానే ఉంది. మొదట్లో వర్షాలు లేకపోయినా తర్వాత అనుకూలించడంతో 5.43 లక్షల ఎకరాల్లో వివిధ రకాలు సాగు చేశారు. ఇందులో వరి 4,81,210 ఎకరాలు కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం 36,115 హెక్టార్లు ముంపులోనే ఉన్నట్లు గుర్తించారు. మొక్కజొన్న 14 వేల ఎకరాల్లో నేల వాలింది. కోతకు వచ్చే దశ కావడంతో పొత్తులు మొలకెత్తితే అపార నష్టం వాటిల్లనుంది. పత్తి, చెరకుపైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త చిన్నంనాయుడు సూచిస్తున్నారు.

కూర గాయలు

నీళ్లలో మునిగిన పంటకు ఎకరాకు 19-19-19 ఎరువు కిలో, మల్టీకే కిలో పిచికారీ చేసుకోవాలి. టమాటా, మిరప, వంగలో వడలు తెగులు వచ్చే అవకాశముంది. నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క మొదల్లో వేసుకోవాలి.

మొక్క జొన్న

పొత్తులు కోసే దశలో ఈ పంట ఉంది. కిలో 19-19-19 ఎరువును ఎకరాకు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రతి పది మీటర్లకు కాలువల ఏర్పాటు తప్పనిసరి. మొలక రాకుండా లీటరుకు 50 గ్రాముల ఉప్పు ద్రావణంతో పిచికారీ చేయడం ఉత్తమం.


వరి

చిరుపొట్టకు చేరువైంది. ప్రస్తుతం నీరు నిల్వ ఉండటంతో పోషక లోపాలు తలెత్తుతాయి. బూస్టర్‌ డోస్‌గా ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ వేయాలి. పొడతెగులు నివారణకు హెక్సాకొనజోల్‌ ఎకరాకు 400 మి.లీ., ప్రాపికొనజోల్‌ 200 మి.లీ., వాలిడామైసిన్‌ 400 మిల్లీలీటర్ల మందుల్లో ఏదైనా ఒకదాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి దుబ్బు తడిచేలా పిచికారీ చేయాలి. స్వర్ణ, సాంబ, సోనామసూరిలలో అగ్గితెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీరు తగ్గించడానికి వీలుకాని పక్షంలో మల్టీకే ఎకరాకు 2 కిలోలు మధ్యాహ్న సమయంలో పిచికారీ చేసుకోవాలి.


పత్తి

పూత, కాయల దశలో ఉంది. మొక్క మొదలు దగ్గర 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ వేస్తే పోషక లోపం తగ్గుతుంది. నీరు నిల్వ ఉంటే ఆకుమచ్చ, కాయమచ్చ తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ. దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 500 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్‌ 20 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. వారం రోజులకు మల్టీకే 13-0-45 కిలో, సూక్ష్మపోషక మిశ్రమం అరకిలో 200 లీటర్ల నీటికి కిలిపి పిచికారీ చేసుకోవాలి. రేగడి భూముల్లో నీరు నిలిచే ప్రాంతాల్లో వేరుకుళ్లు తెగులు వచ్చే వీలుంది. ప్రతి 5 మీటర్లకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.


చెరకు

నీటిని తీసేయడం, పడిపోయిన గెడలకు ఊతకర్రలు పెట్టాలి. జూన్‌ నెలలో వేసిన మొక్క తోటలకు బూస్టర్‌ డోస్‌గా ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ను మొదల్లో వేయాలి. 9-10 నెలల వయసు నిండిని తోటలు పడిపోతే కర్మాగారానికి తరలించడం ఉత్తమం.


నివేదిక తయారుచేస్తాం

‘‘నీట మునిగిన పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో నష్టాలపై ఒక అంచనా వస్తుంది. ఈ తుపాను వల్ల చెరువులు నిండాయి. రబీకి నీటి సమస్య ఉండదు. మెట్ట పంటలకు ఎలాంటి నష్టం లేదు. మొక్కజొన్న కోత దశలో ఉండటంతో వాలితే వెంటనే పొత్తులు వేరు చేసుకోవాలి. ’’

పోలాకిలో అమ్మవారి కోవెల చుట్టూ చేరిన నీరు

బూర్జ మండలం లక్కుపురంలో..

మందస: డబార్‌సింగిలో చెట్లను తొలగిస్తున్న అగ్నిమాపకశాఖ అధికారులు

నరసన్నపేట: గొట్టిపల్లి వంతెన పక్కన సర్వీసు రోడ్డుపై..

- కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ, శ్రీకాకుళం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని