అతలాకుతలం
eenadu telugu news
Published : 28/09/2021 05:25 IST

అతలాకుతలం

గులాబ్‌ ధాటికి  సిక్కోలు విలవిల

శ్రీకాకుళంలో శివారు ప్రాంతంలో ఇలా..

వెంకటాపురంలో రహదారిపై కూలిరాత్రివేళ దూసుకొచ్చిన గులాబ్‌ తుపాను సిక్కోలును తేరుకోలేని విధంగా దెబ్బతీసింది.. చెట్టు, పుట్టను అతలాకుతలం చేసింది.. గాలి చేసిన బీభత్సం చూసి రైతన్న నిలువునా కుప్పకూలిపోయాడు.. జడివాన జలదరింపుతో పంటలన్నీ నీళ్లపాలయ్యాయి.. వరి నుంచి మొక్కజొన్న వరకూ నిలువునా నేలవాలాయి.. దారులన్నీ గెడ్డలై పొంగుతున్నాయి.. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.. జిల్లాలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ కుప్పకూలింది.. వందల గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతున్నాయి.. హుద్‌హుద్‌, తిత్లీ తర్వాత గులాబ్‌ కూడా జిల్లాపై ప్రతాపం చూపింది.

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌, గుజరాతీపేట

గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి తీరం దాటినా దాని ప్రభావంతో జిల్లాలో వరుసగా రెండోరోజూ కూడా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సోమవారం సాయంత్రం వరకూ జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నగరంలో అర్ధరాత్రి నుంచి కుండపోత కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటిని బయటకు పంపేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ముంపు నీటిలో అనేక కాలనీలు మగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వరద రోడ్లపై దర్శనమిస్తోంది.

గోపాల్‌నగర్‌లో ఓ ఇంట్లోకి చేరిన నీరు

* ఆమదాలవలస, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, గార, శ్రీకాకుళం తదితర మండలాల్లోని కొన్ని చెరువుల్లో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

* జిల్లాలో నేలకొరిగిన చెట్లను పక్కకు తొలగించేందుకు 19 బృందాలు పనిచేశాయి. 321 కి.మీ. రహదారులపైన పడిన వాటిని సాధ్యమైనంత వేగంగా తొలగించారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

రణస్థలం మండలం జేఆర్‌పురం వెంకటేశ్వర కాలనీలో ..

* 38 పునరావాస కేంద్రాల్లో 1358 మందికి ఆశ్రయం కల్పించారు. పరిస్థితులు చక్కబడిన చోట వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని ఇళ్లకు పంపించేటప్పుడు రూ.1000 చొప్పున ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎంత మందికి ఎంత ఇచ్చారనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


జి.సిగడాంలోని గెడ్డకంచారం పాఠశాల గోడ కూలడంతో ధ్వంసమైన ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు

* చిలకపాలెంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో ఎనిమిది ఫీడర్లు పావడ్వంతో శ్రీకాకుళం నగరమంతా సరఫరా నిలిచిపోయింది.

* జిల్లా వ్యాప్తంగా 104 సబ్‌స్టేషన్లు, 33 కేవీ ఫీడర్లు 58 దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 405 పాడయ్యాయి.

* సరఫరా పునరుద్ధరణకు సుమారు 1400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.


లావేరు మండలం శీర్లపాలెం సమీపంలో నీట మునిగిన వరిని చూపిస్తున్న రైతు

* మొత్తం 500 విద్యుత్తు స్తంభాలు, 130 ట్రాన్స్‌ఫార్మర్లు పనికిరాకుండా పోయాయి.

* ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన రెండు రహదారులు కోతకు గురయ్యాయి. పంచాయతీ రాజ్‌ శాఖకు సంబంధించి 20 చోట్ల 9.67 కిలోమీటర్ల   మేర రోడ్డు దెబ్బతింది. పురపాలక శాఖ పరిధిలో 5.4 కి.లోమీటర్ల    రహదారి, 3.7 కి.మీ మేర మురుగునీటి కాలువలు దెబ్బతిన్నాయి. 


కళింగపట్నం తీరంలో కోతకు గురైన రహదారి

అన్నదాతకు కష్టం..

సంతబొమ్మాళి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, జలుమూరు, పోలాకి, గార, శ్రీకాకుళం గ్రామీణం మండలాల్లో వేల ఎకరాల్లో వరి నీటమునిగింది. అరటి, మొక్కజొన్న, పత్తి, బొప్పాయి, చెరకు పంటలకు  నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే దశలో ఈ తుపాను దెబ్బకొట్టింది. పంట కాలువన్నీ ఉద్ధృతంగా ప్రవహించడంతో పరివాహక పంటలన్నీ నీటిలో మునిగిపోయాయి.

జిల్లావ్యాప్తంగా సోమవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

కళింగపట్నంలో అత్యధికంగా 24.3 సెం.మీ.,

కంచిలిలో అత్యల్పంగా 1.25 మి.మీ. వర్షపాతం నమోదైంది.

విద్యుత్తుశాఖా పరంగా రూ. 5.3 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషిరావు తెలిపారు.

తుపాను ప్రభావిత మండలాలు 12

గ్రామాలు 237

నీటమునిగిన వరి 36,115 హెక్టార్లలో

ఉద్యాన పంటలు 232.50

మృతుల సంఖ్య 01

చనిపోయిన మూగజీవాలు 130

సహాయక చర్యలు వేగవంతం ..

 

తుపాను ప్రభావంతో జిల్లాలో ఒకరు చనిపోయారు. వారి కుటుంబాన్ని అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది. నష్టాలు, బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాం.

- ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ 

అప్రమత్తతతోనే బయటపడ్డాం ..
అధికార యంత్రాంగం అప్రమత్తతతోనే తుపాను నుంచి తక్కువ నష్టాలతో బయటపడ్డాం. అధికారులు, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ చక్కగా పనిచేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

-  తుపాన్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు

త్వరగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలి ..

తుపాను తీవ్రత నేపథ్యంలో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నందున వీలైనంత త్వరగా సరఫరా పునరుద్ధరణ పనుల పూర్తికి చర్యలు చేపట్టాలి. సముద్రతీర ప్రాంతాలతో పాటు ఇతర గ్రామాల్లో ప్రజలు కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. సరఫరాను తొందరగా ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.  గ్రామాల్లో తెదేపా శ్రేణులకు సహాయక చర్యల్లో పాల్గొనాలి.

- కె.అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు


కూప్పకూలిన విద్యుత్తు వ్యవస్థ

వెంకటాపురంలో రహదారిపూ స్తంభాన్ని తొలగిస్తున్న సిబ్బంది

గులాబ్‌ తుపాను తాకిడికి జిల్లాలో విద్యుత్తు వ్యవస్థ అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో నిలిచిపోయిన సరఫరా సోమవారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాలకు, సాయంత్రం 4 గంటలకు మరికొన్ని ప్రాంతాలకు ఇవ్వగలిగారు. చిలకపాలెంలో 132 కేవీ సబ్‌స్టేషన్లో ఫీడర్లు పాడవ్వడంతో సరఫరాలో జాప్యం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ కె.సంతోషిరావు జిల్లాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కూలిన చెట్లను తొలగించేందుకు క్రేన్లు, మరికొన్ని చోట్ల మున్సిపాల్టీ లాడర్లు వినియోగించారు. ఎస్‌ఈ ఎల్‌.మహేంద్రనాథ్‌, డైరెక్టర్‌ రాజబాపయ్య తదితరులు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టారు.మహా వృక్షాలనూ కూల్చేసింది..


మహా వృక్షాలనూ కూల్చేసింది..

గార మండలం వాడాడలో రహదారిపై కూలిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

తుపాను తీరం దాటిన సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు జిల్లాపై విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో వందల ఏళ్లనాటి భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. గార, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస ప్రాంతాల్లో భారీస్థాయిలో పడిపోయాయి. రహదారులపై పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తక్షణం స్పందించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ సిబ్బంది తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని