ప్రమాద హేతువులు
eenadu telugu news
Published : 28/09/2021 05:36 IST

ప్రమాద హేతువులు

కాలం చెల్లిన వంతెనలతో భయాందోళన


మందస, హరిపురం రహదారిలో గెడ్డపై కాలం చెల్లిన వంతెన

మందస, న్యూస్‌టుడే: మందస మండలంలోని చాలా రహదారులపై బ్రిటీష్‌ కాలం నాటి వంతెనలున్నాయి. ఇవి కాలం చెల్లి శిథిలావస్థకు చేరాయి. అయినా వాటిపైనుంచి బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు నడుస్తున్నాయి. వాహనాలు నడిచేటపుడు వంతెనలు ఊగుతుండడంతో ప్రయాణికులు, చోదకులు బిక్కుబిక్కుమంటున్నారు. ముందే మేల్కొని కొత్త వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

* ఆంధ్ర-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిపై గోవిందపురం కూడలి వద్ద, హంసరాలి సమీపంలో సునాముధి జీవగెడ్డపై శతాబ్దం కిందట నిర్మించిన వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రత్యామ్నాయం లేక వాటిపై నుంచి వాహనాలు నడుపుతున్నారు. బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు నడిచేటపుడు ఇవి వణుకుతున్నాయి.

* మండల కేంద్రం మందస-హరిపురం రహదారి మధ్యలో మూడు చోట్ల చాకిరేవు గెడ్డపై వంతెనలు వందేళ్ల కిందట నిర్మించినవి. రాతి గోడలపై ఉండే ఇవి కూడా కాలం చెల్లినవి కావడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు.

* పాత జాతీయ రహదారిపై కొర్రాయిగేటు వద్ద, చీపి-బుడంబొ రోడ్డులో బొందుకారి సమీపంలో, రట్టి- ఎర్రముక్కాం రోడ్డులో గెడ్డూరు సమీపంలో గెడ్డలపై నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన వంతెనలు పాడయ్యాయి. గోడలు విరిగి ప్రమాదాన్ని తలపిస్తున్నాయి.


మందస, మెళియాపుట్టి రహదారిలో హంసరాలి వద్ద గెడ్డపై బ్రిటిష్‌ కాలంనాటి వంతెన

ప్రతిపాదనలు పంపించాం

మందస-హరిపురం రహదారిని విస్తరించడంతో పాటు మూడు వంతెనల నిర్మాణానికి రూ.10 కోట్లు, సోంపేట మండలం తురకశాసనాం కూడలి నుంచి మందస మీదుగా మెళియాపుట్టి మండలం గొప్పిలి వరకు రహదారి విస్తరణతో పాటు సునాముధి గెడ్డపై రెండు వంతెనల నిర్మాణానికి రూ.40 కోట్ల అంచనా విలువతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు వస్తే పనులు ప్రారంభిస్తాం.

-డిక్కల విక్రం, ఆర్‌అండ్‌బీ ఏఈ, మందస


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని