అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం

ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌


వాలీబాల్‌ విజేత రాజాం జట్టుకు బహుమతి ప్రదానం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, తదితరులు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో మేటి క్రీడాకారులకు కొదవలేదని, వారికి ఉత్తమ మౌలిక వసతులు కల్పించి జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తయారుచేస్తామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. సీఎం కప్‌ జిల్లాస్థాయి పోటీల్లో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ క్రీడా మైదానంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్యశిక్షకులు డా.కల్లేపల్లి శ్రీధరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాతోనే సీఎం కప్‌ పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు. కోడిరామ్మూర్తి క్రీడామైదానం పూర్తి చేసేందుకు రూ.కోటి విడుదల చేస్తామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఇందుంలో కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి.లఠ్కర్‌, శాప్‌ వైఎస్‌ ఛైర్మన్‌, ఎండీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కంబాల జోగులు, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, వైకాపా జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, జేసీ శ్రీరాములునాయుడు, శాప్‌ రాష్ట్ర సమన్వయకర్త ఎల్‌.దేవానందం, ఏడీ ఎస్‌.వి.రమణ, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.సుందరరావు, తదితరులు పాల్గొన్నారు. పోటీల నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేసిన సూర శ్రీనివాసరావును, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాసును పలువురు అభినందించారు.

వీడని మౌలిక సదుపాయాల కొరత: ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన సీఎం కప్‌ పోటీల్లో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌ పోటీలను మౌలిక వసతుల లేమి వెంటాడింది. అథ్లెటిక్స్‌ పోటీల నిర్వహణకు ట్రాక్‌ మొదలుకొని క్రీడాకారులకు సరైన జావెలెన్లు సైతం అందుబాటులో లేవు. చిరిగిపోయిన బెడ్స్‌పైనే హైజంప్‌ పోటీలకు వినియోగించాల్సి వచ్చింది.

విజేతలు వీరే...: వాలీబాల్‌ బాలికల విభాగంలో పలాస, పాలకొండ, బాలుర విభాగంలో రాజాం, టెక్కలి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఖోఖో బాలికల విభాగంలో ఇచ్ఛాపురం, పలాస, బాలుర విభాగంలో పలాస, రాజాం ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అథ్లెటిక్స్‌ పోటీల్లో పలాస జట్టు 48 పాయింట్లు సాధించి ఓవరాల్‌ ఛాంపియన్‌ సొంతం చేసుకుంది. ఎచ్చెర్ల 27 పాయింట్లతో రన్నర్స్‌ స్థానాన్ని దక్కించుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని